బీసీ హాస్టల్లో దారుణం..జూనియర్‌ను చితకబాదిన సీనియర్లు

కరెంట్‌ వైర్‌తో షాక్‌ ఇచ్చేందుకు తెగబడిన ద్వితీయ సంవత్సరం విద్యార్థులు.;

Update: 2025-08-09 16:04 GMT

జూనియర్‌ ఇంటర్‌ చదువుతున్న ఓ విద్యార్థిని సీనియర్‌ ఇంటర్‌ చదువుతున్న విద్యార్థులు విచక్షణా రహితంగా కొట్టారు. కరెంటు వైర్లు, కర్రలతో దాడి చేసి.. కాళ్లు, చేతులతో కొడుతూ రాక్షస ఆనందం పొందారు. పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ వసతి గృహంలో రెండు రోజుల క్రితం చోటు చేసుకున్న ఈ దారుణం శనివారం వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా దాచేపల్లి బీసీ వసతి గృహంలో ఇంటర్‌ విద్యార్థులు ఉంటున్నారు. ఇంటర్మిడియట్‌ మొదటి సంవత్సరం చదువుతున్న అఖిల్‌ అనే విద్యార్థిని ఇంటర్‌ రెండో సంత్సరం చదువుతున్న కొంత మంది విద్యార్థులు కర్రతో కొడుతూ, కాళ్లు చేతులతో తన్నుతూ చితకబాదారు.

అంతటితో కోపం చల్లారని ఆ సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులు అఖిల్‌కు కరెంట్‌ వైర్‌తో షాక్‌ ఇచ్చేందుకు తెగబడ్డారు.  అంతేకాకుండా వారి పాశవిక దాడి దృశ్యాలను సెల్‌ఫోన్‌తో వీడియో తీశారు. ఈ దుర్మార్గం ఈ నెల ఏడో తారీఖున చోటు చేసుకుంది. ఆ వీడియో కాస్త అఖిల్‌ తల్లిదండ్రులకు చేరడంతో పోలీసులను ఆశ్రయించారు. దాడికి పాల్పడిన వారిపై ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంఘటన సంచలనంగా మారింది. సీనియర్‌ విద్యార్థుల దాడులకు పాల్పడిన ఘటనతో వసతి గృహంలో తీవ్ర భయానక వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News