సెక్రటరీ శాండ్ విచ్ అయిపోతున్నారా ?
బుధవారం బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి వెంటనే యాక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు.
కారుపార్టీ ఎంఎల్ఏలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఏ విషయంలో అంటే ఫిరాయింపు ఎంఎల్ఏలపై ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించే విషయంలో. బీఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచి తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ ను ఆదేశించాలని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ కేసును విచారించిన హైకోర్టు ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించింది. హైకోర్టు అలా ఆదేశించిందో లేదో బుధవారం బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అసెంబ్లీ సెక్రటరీని కలిసి వెంటనే యాక్షన్ ప్రాసెస్ మొదలుపెట్టాలని విజ్ఞప్తి చేశారు. పనిలోపనిగా వెంటనే యాక్షన్ తీసుకుని హైకోర్టుకు వివరించాలని కూడా చెప్పారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసెంబ్లీ సెక్రటరి ఏ ఎంఎల్ఏ మీద కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. ఈ విషయం సూచనచేసిన హైకోర్టుకూ తెలుసు, సెక్రటరీని కలిసిన పాడి, కేపీలకు కూడా బాగా తెలుసు. అన్నీ తెలిసినా అదో తుత్తి అన్నట్లుగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాస్త హడావుడి చేశారంతే. ఎంఎల్ఏల అనర్హత నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ మాత్రమే. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందుకు సభా నాయకుడు, ముఖ్యమంత్రి ఆదేశాలు ఉండాల్సిందే. ఇక్కడ రేవంత్ చెప్పందే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తనంతట తానుగా ఎలాంటి నిర్ణయం తీసుకోరని అందరికీ తెలుసు. రేవంత్ చెప్పరు, స్పీకర్ ఏ నిర్ణయమూ తీసుకోరు.
ఈ విషయాలన్నీ తెలిసినా ఫిరాయింపులపై నాలుగు వారాల్లోగా ఏదో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు అసెంబ్లీ సెక్రటరీని ఎందుకు ఆదేశించినట్లు ? ఎందుకంటే అసెంబ్లీ స్పీకర్ ను హైకోర్టు ఆదేశించలేందు కాబట్టి. శాసనవ్యవస్ధలో స్పీకర్ నిర్ణయమే అంతిమం. అందుకని శాసనవ్యవస్ధ అధికారాల్లోకి న్యాయవ్యవస్ధ జొరబడేందుకు లేదు. ఈ విషయం బాగా తెలుసు కాబట్టే హైకోర్టు కూడా స్పీకర్ కు కాకుండా అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్పీకర్ చెప్పందే సెక్రటరీ తనంతట తానుగా ఏ నిర్ణయమూ తీసుకోలేరు. స్పీకర్ ఏమీ చెప్పరు..సెక్రటరీ ఏ నిర్ణయమూ తీసుకోరు.
నాలుగు వారాల తర్వాత హైకోర్టు అడిగితే స్పీకర్ కు ఫైల్ పెట్టామని మాత్రమే అసెంబ్లీ సెక్రటరీ చెప్పగలరు. హైకోర్టు ఆదేశాలను స్పీకర్ ముందుంచటం కన్నా సెక్రటరీ చేయగలిగేదేమీలేదు. హైకోర్టు-స్పీకర్ మధ్య ఇరుక్కుపోయిన సెక్రటరీని ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కలిసి యాక్షన్ ఇనీషియేట్ చేయాలని ఒత్తిడి పెడుతున్నారు. పాపం సెక్రటరీ మాత్రం ఏమిచేస్తారు ? హైకోర్టు ఆదేశాలను స్పీకర్ కు ఫైల్ పుటప్ చేసినట్లే బీఆర్ఎస్ ఎంఎల్ఏల రిక్వెస్టుతో మరో ఫైలును రెడీచేసి స్పీకర్ ముందుంచగలరంతే. మొత్తం మీద హైకోర్టు, స్పీకర్, బీఆర్ఎస్ ఎంఎల్ఏల మధ్య అసెంబ్లీ సెక్రటరీ శాండ్ విచ్ అయిపోతున్నారు.