ఆకర్ష్ కు కౌంటరుగా ఘర్ వాపసీ

బీఆర్ఎస్ అధిష్టానం మొదలుపెట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం వర్కవుటవుతున్నట్లుంది. కారుపార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎంఎల్ఏల్లో ఒకళ్ళు వెనక్కు వెళ్ళిపోయారు.

Update: 2024-07-31 06:55 GMT

బీఆర్ఎస్ అధిష్టానం మొదలుపెట్టిన ఘర్ వాపసీ కార్యక్రమం వర్కవుటవుతున్నట్లుంది. కారుపార్టీ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎంఎల్ఏల్లో ఒకళ్ళు తిరిగి వెనక్కు వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ నుండి 10 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరిలో మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. బండ్ల ఈనెల మొదటివారంలో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మొదటివారంలో కాంగ్రెస్ లోకి ఫిరాయించిన బండ్ల చివరి వారంలో అంటే 30వ తేదీన తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. అసెంబ్లీలోని శాసనసభాపక్ష కార్యాలయంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారు. అంటే బండ్ల తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోయినట్లుగానే భావించాల్సుంటుంది. లేకపోతే కేటీయార్ తో భేటీ అవ్వాల్సిన అవసరం ఏముంది ? 



ఎప్పుడైతే బండ్ల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారని తెలిసిందో కాంగ్రెస్ లో కలకలం మొదలైంది. 20 రోజుల క్రితమే బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లో చేరిన బండ్ల ఇంతలోనే తిరిగి సొంతపార్టీలోకి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందనే చర్చ పెరిగిపోతోంది. ఈ విషయం ఇలాగుండగానే మరో విషయం బయటపడింది. అదేమిటటే భద్రాచలం బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏ తెల్లం వెంకటరావు కారుపార్టీ నేతలతో భేటీ అయ్యారు. తెల్లం కూడా బీఆర్ఎస్ తరపున భద్రాచలంలో గెలిచారు. అయితే కొద్దిరోజులకే బీఆర్ఎస్ ను వదిలేసి కాగ్రెస్ లోకి ఫిరాయించారు. అలాంటిది ఇపుడు కారుపార్టీ నేతలతో భేటీ అయ్యారని తెలియగానే కాంగ్రెస్ పార్టీలో సంచలనం మొదలైంది. అయితే ఇదే విషయమై తెల్లం మీడియాతో మాట్లాడుతు తాను టీ తాగటానికి మాత్రమే బీఆర్ఎస్ నేతలతో సమావేశమైనట్లు చెప్పారు. తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోతానని జరుగుతున్న ప్రచారంలో వాస్తవంలేదని చెప్పారు.

బీఆర్ఎస్ నేతలతో తన భేటీని తెల్లం సమర్ధించుకుంటున్నారు. భేటీ విషయంలో తెల్లం చెప్పిన కారణం సబబుగానే అనిపిస్తున్నా ఆ కారణాన్ని జనాలు ఎవరూ నమ్మటంలేదు. ఎందుకంటే అంతకుముందే బండ్ల బీఆర్ఎస్ లో చేరటాన్ని జీర్ణించుకోలేకపోతున్న కాంగ్రెస్ నేతలు తెల్లం చెప్పిన కారణంతో కన్వీన్స్ అవటంలేదు. వీళ్ళిద్దరి విషయం ఇలాగుండగానే చేవెళ్ళ ఎంఎల్ఏ కాలే యాదయ్య కూడా తిరిగి కారుపార్టీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది. దాంతో జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో అబద్ధమెంతో తెలుసుకోవటం కాంగ్రెస్ నేతలకు కష్టంగా ఉంది. తాను తిరిగి బీఆర్ఎస్ లోకి వెళుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అబద్ధమని యాదయ్య ప్రకటించినా చాలామంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలతో కాంగ్రెస్ నేతలు వరుసబెట్టి భేటీలవుతున్నారు.



ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గద్వాల ఫిరాయింపు ఎంఎల్ఏ బండ్లకు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతల నుండి సహాయనిరాకరణ పెరిగిపోతోంది. మొదట్లోనే బండ్ల రాకను పార్టీలోని చాలామంది వ్యతిరేకించారు. ముఖ్యంగా జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సరిత తో పాటు ఆమె వర్గీయులు బండ్ల చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే అప్పట్లో పార్టీ సీనియర్ నేతలు సరిత వర్గానికి సర్దిచెప్పటంతో సరిత వర్గీయులు మౌనంగా ఉండిపోయారు. దాంతో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే పార్టీలో చేరిన తర్వాత రెండువర్గాల మధ్య వివాదాలు మరింతగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హ వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్ వేసింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఒకవేళ కోర్టు గనుక అనర్హత వేటు వేయాలని ఆదేశిస్తే అప్పుడు తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళన బండ్లలో పెరిగిపోతోందని సమాచారం.

ఇతర పార్టీల్లో నుండి కాంగ్రెస్ లోకి ఎంఎల్ఏలు ఫిరాయించారంటే అర్ధముంది. కారణం ఏమంటే వాళ్ళ వ్యక్తిగత, ఆర్ధిక, వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవటం కోసమే. ఇపుడు ఫిరాయించిన వాళ్ళల్లో కూడా ఇలాంటి ప్రయోజనాలను ఆశించే కాంగ్రెస్ లో చేరారు. అలాంటిది మళ్ళీ బండ్ల కాంగ్రెస్ లో నుండి తిరిగి బీఆర్ఎస్ లోకి ఎందుకు వెళిపోయినట్లు ? ఏమాశించి కాంగ్రెస్ లోకి వచ్చారు ? తిరిగి ఎందుకని వెనక్కు వెళ్ళిపోయారో అర్ధంకావటంలేదు.




 ఇక ఫిరాయింపులపై అనర్హత వేటు వేయమని హైకోర్టు ఆదేశించే అవకాశంలేదు. ఒకవేళ ఆదేశించినా స్పీకర్ పట్టించుకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే గతంలో జరిగిన ఫిరాయింపులు, కోర్టు సూచనలే దీనికి ఉదాహరణగా నిలిచాయి. అయినా సరే ఫిరాయింపులను తిరిగి పార్టీలోకి రప్పించటానికి బీఆర్ఎస్ అధినేత ఘర్ వాపసీ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఫిరాయింపుల్లో విడివిడిగా మాట్లాడుతు ఎవరికి ఇవ్వాల్సిన హామీలను వాళ్ళకు ఇస్తున్నారట. ఎందుకంటే పిరాయింపులందరి అవసరాలు ఒకలాగుండవు కదా అందుకనే ప్రతి ఫిరాయింపులతో కారుపార్టీ నేతలు కేసీఆర్ తరపున మాట్లాడుతున్నట్లు సమాచారం.

చూస్తుంటే ఘర్ వాపసీ కార్యక్రమం వర్కవుతవుతున్నట్లే ఉంది. అందుకనే ముందుగా బండ్ల కాంగ్రెస్ నుండి తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోయారు. తెల్లం, యాదయ్య విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమే అయితే ఘర్ వాపసీ కార్యక్రమం సక్సెస్ అయినట్లే అనుకోవాలి. బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారంటే అర్ధముంది. వ్యాపార, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పార్టీలు ఫిరాయిస్తున్నారని సరిపెట్టుకోవచ్చు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన మూడువారాలకే తిరిగి కాంగ్రెస్ లోనుండి బండ్ల ఎందుకని బీఆర్ఎస్ లోకి మళ్ళీ వెనక్కు వెళిపోయారో అర్ధంకావటంలేదు. మొత్తంమీద ఘర్ వాపసీ కార్యక్రమంలో ఇంకెతమంది ఫిరాయింపు ఎంఎల్ఏలు తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోతారనే విషయం ఆసక్తిగా మారింది. పై ముగ్గురు ఎంఎల్ఏలతో మాట్లాడటానికి తెలంగాణా ఫెడరల్ ప్రయత్నిస్తే వాళ్ళ ఫోన్లు స్విచ్చాఫ్ చేసున్నాయి.

Tags:    

Similar News