కొత్త ఆరోపణలతో బీఆర్ఎస్ ఎదురుదాడి ?

కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుతో పాటు మరికొందరు ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడికౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు.

Update: 2024-09-05 08:43 GMT

కొత్త ఆరోపణలతో బీఆర్ఎస్ గోల మొదలుపెట్టింది. కొత్త ఆరోపణలు ఏమిటంటే కారుపార్టీలోని అగ్రనేతల ఫోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావుతో పాటు మరికొందరు ఫోన్లను కూడా తెలంగాణా ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందని హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎంఎల్ఏ పాడికౌశిక్ రెడ్డి ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తోందనేందుకు ఏవేవో కారణాలను ఆధారులుగా చెబుతున్నారు. కరీంనగర్ పోలీసు కమీషనర్ తో పాటు చాలామంది అధికారుల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని పాడి ఆరోపించారు. కమీషనర్ టెలిఫోన్ కాన్ఫరెన్స్ సీఐకి రావటంలేదని మానుకొడూరు ఎంఎల్ఏ చెప్పటాన్ని పాడి తన ఆరోపణలకు ఆధారంగా చెప్పారు. సీఐకి సీపీ టెలికాన్ఫరెన్స్ రావటంలేదన్న విషయం మానకొండూరు ఎంఎల్ఏకి ఎలా తెలిసిందని ప్రశ్నించారు. ఫోన్లను ట్యాప్ చేయబట్టే కదా పోలీసు శాఖలోని అంతర్గత విషయాలు ఎంఎల్ఏకి తెలిశాయి అన్నది పాడి పాయింట్.

అయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నదనడానికి ఆధారాలు ఏమిటంటే ఎంఎల్ఏ సమాధానం చెప్పలేదు. పైగా ట్యాపింగ్ అంశంపై సీబీఐ దర్యాప్తు చేయించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. అసలు రేవంత్ ప్రభుత్వం మీద ట్యాపింగ్ ఆరోపణలను పాడి ఎందుకు మొదలుపెట్టినట్లు ? ఎందుకంటే ఇఫ్పటికే ఇదే ట్యాపింగ్ ఆరోపణలపై కేసీఆర్ పీకల్లోతు ఇరుక్కుపోయారు కాబట్టే. పదేళ్ళ బీఆర్ఎస్ హయాంలో ప్రత్యేకంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో కేసీఆర్ వందలాదిమంది ఫోన్లను ట్యాప్ చేయించారని ఇప్పటికే బయటపడింది. అప్పట్లో ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకరరావు ఆదేశాలతోనే తాము చాలామంది ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు కొందరు పోలీసు అధికారులు కోర్టులో అంగీకరించారు.

ట్యాపింగ్ వివాదంలో ఇరుక్కుని అరెస్టయిన వారిలో ఏసీపీ రాధాకిషన్ రావు, డీసీపీలు భుజంగరావు, తిరుపతయ్య, డీఎస్పీగా పనిచేస్తున్న ప్రవీణ్ రావుతో పాటు పదుల సంఖ్యలో సీఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్ళు కూడా యధేచ్చగా ట్యాపింగ్ చేసినట్లు బయటపడింది. రాజకీయ వైరంతో బీఆర్ఎస్ పెద్దలు ప్రతిపక్షాల్లోని నేతలతో పాటు అనుమానం ఉన్న ఉన్నతాధికారులు, జడ్జీలు, లాయర్లు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తుల ఫోన్లను ట్యాప్ చేయించారని పోలీసుల విచారణలో పై అధికారులు అంగీకరించారు. ఎవరి దగ్గరనుండి అయినా డబ్బులు గుంజాలంటే వెంటనే ఆ వ్యక్తి ఫోన్ను ట్యాప్ చేయటం, వాళ్ళ రహస్యాలు తెలుసుకోవటం వెంటనే బ్లాక్ మెయిల్ మొదలుపెట్టేసినట్లు అంగీకరించారు. ఇదే సమయంలో ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్ధులు, నేతలను దెబ్బతీసేందుకు కూడా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు అరెస్టయిన అధికారులు అంగీకరించారు.

ఇపుడు విషయం ఏమిటంటే అందరితోను ఫోన్ ట్యాపింగ్ చేయించి, బ్లాక్ మెయిల్ చేయించి డబ్బులు గుంజింది అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకరరావే అని అందరు ఏకగ్రీవంగా సాక్ష్యం చెప్పారు. అయితే ఎవరెవరి ఫోన్లను ట్యాపింగ్ చేయాలనే జాబితాను ప్రభాకర్ రావుకు ఇచ్చింది ఎవరు ? అన్నదే కీలకంగా మారింది. ఇదే విషయమై విచారణ మొదలైన తొలిరోజుల్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) ఉన్నతాధికారులకు ప్రభాకరరావు నుండి ఒక మెయిల్ వచ్చింది. అందులో ప్రభుత్వంలోని పెద్ద తలకాయ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే తాను కిందస్ధాయి అధికారులకు ఆదేశాలు జారీచేసి ఫోన్లు ట్యాప్ చేయించినట్లు అంగీకరించారు. ప్రభుత్వంలోని పెద్ద తలకాయ అన్నారే కాని ఆ తలకాయే కేసీఆర్ అని స్పష్టంగా చెప్పలేదు. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో పెద్దతలకాయ అంటే కేసీఆర్ కాకుండా ఇంకెవరిది ? అన్నదే పాయింట్.

సో, తమ అధినేతపైన వస్తున్న ఆరోపణలు, కేసీఆర్ కు వ్యతిరేకంగా రిజిస్టర్ అయిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను గమనించిన తర్వాత తమను తాము రక్షించుకోవాలంటే ఎదురుదాడి చేయాల్సిందే అన్న ఆలోచనకు కారుపార్టీ వచ్చినట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. అందుకనే పాడి కౌశిక్ రెడ్డితో రేవంత్ ప్రభుత్వం మీద ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు మొదలుపెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    

Similar News