జగన్ నాయకత్వంపై నమ్మకం తగ్గిందా?
జకియా బీజేపీలో చేరడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జగన్ వైఫల్యమా.. బీజేపీ అధికారమా..;
By : The Federal
Update: 2025-05-16 01:50 GMT
తిరుగుబాటుకు ప్రతిరూపంగా, 10 ఏళ్లు ప్రతిపక్షంగా, 5 ఏళ్లు అధికార పక్షంగా వెలుగొందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తుపానులో చిక్కుకున్న నావలా తయారైంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది నేటి రాజకీయ నీతి. రాజకీయంగా బలహీన పడిన వైసీపీని ఇక తిరిగి లేవనీయకుండా చేయాలన్న వ్యూహంతో ప్రత్యర్థి పార్టీలు పన్నిన వ్యూహంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విలవిల్లాడుతున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు జరిగి 8 నెలలు కాకుండానే 9మందికి పైగా పెద్దతలకాయలు పార్టీ ఫిరాయించాయి. వీరిలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు ఉన్నారు. సాక్షాత్తు జగన్ కుడిభుజం అనుకున్న విజయసాయిరెడ్డే పార్టీకి సలాం కొట్టి జగన్ కి ప్రత్యర్థిగా మారారు. మొత్తం మీద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇదో సంధికాలం. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖానమ్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరడం రాజకీయంగా అనూహ్య పరిణామం. దీంతో నిన్న మొన్నటి వరకు MLA's, MLC's లేని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలిలో బీజేపీ సభ్యుల సంఖ్య ఎగబాకుతోంది.
వైసీపీని వెంటాడుతున్న కుంభకోణాలు, అరెస్టులు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రంగా ఇప్పటికే అనేక స్కాంలు వెంటాడుతున్నాయి. పలువురు అరెస్ట్ అయ్యారు. తాజాగా ఏపీ లిక్కర్ స్కాం తెరపైకి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్‌కు అత్యంత సన్నిహితులు, ప్రజాప్రతినిధులు, ముఖ్య సలహాదారులు అరెస్టులు, కోర్టులు, బెయిళ్లతో బెంబేలెత్తుతున్నారు. సుప్రీంకోర్టు కూడా ఇటీవల లిక్కర్ స్కాంలో పలువురికి ముందస్తు బెయిల్‌ను తిరస్కరించింది. ఈ పరిణామాలు వైసీపీ నేతల్లో భయం, అసంతృప్తి కలిగిస్తున్నాయి. దీంతో చాలా మంది తమ భవిష్యత్ భద్రత కోసం ఇతర పార్టీల వైపు చూస్తున్నట్టు సమాచారం.
నాయకత్వం పట్ల వ్యతిరేకత?
వైసీపీ ఎమ్మెల్సీలు వరుసగా పార్టీకి గుడ్‌బై చెబుతున్న వేళ, జగన్ నాయకత్వంపై పార్టీలో అసంతృప్తి పెరిగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీపై కేసులు, స్కాంలు, ఆరోపణలు, అరెస్టుల భయంతో పాటు పార్టీ అధినేత వైఖరి పట్ల కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఓ బలమైన పార్టీ నాయకునిగా ఉన్నా తన వారిని కాపాడలేకపోవడమే కారణంగా చెబుతున్నారు పలువురు నేతలు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్సీలు- జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జకియా ఖానుమ్ రాజీనామా చేశారు.
బీజేపీ బలం పెంచుకునే వ్యూహం...
మరోవైపు బీజేపీ మాత్రం ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటోంది. రాష్ట్రంలో తమ బలం పెంచుకునేందుకు, ప్రత్యేకించి శాసనమండలిలో పట్టు పెంచుకోవాలనే లక్ష్యంతో వైసీపీని లొంగదీస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను బీజేపీ రాజకీయంగా ఉపయోగించుకుంటోందన్న విమర్శల నేపథ్యంలో ఇతర పార్టీలలో ఇమడలేని వారు కమలం పార్టీని ఆశ్రయిస్తున్నారు. ఇవి ఒంటరి నిర్ణయాలుగా కనిపించవచ్చు కానీ దీని వెనుక నిగూఢమైన రాజకీయ నేపథ్యం ఉంది.
వైసీపీని నిర్వీర్యం చేసేందుకు టీడీపీ–జనసేన–బీజేపీ కలిసే నాటకం ఆడుతున్నాయా? అనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రస్తుత రాజకీయ వాతావరణంలో వైసీపీని దెబ్బతీయాలన్న లక్ష్యం కూటమిలోని మూడు పార్టీల లక్ష్యంగా కనిపిస్తోంది. అయితే, దీన్ని "నాటకం"గా అభివర్ణించే కన్నా వైసీపీ నాయకత్వ శైలిపై పెరుగుతున్న వ్యతిరేకత, శక్తుల సమీకరణ, రాజకీయ ప్రయోజనాల కలయికగా చూడటం సముచితమని రాజకీయ విశ్లేషకుడు ఆర్. కృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.
లిక్కర్ స్కాం, అవినీతి ఆరోపణలు – వైసీపీ ప్రభుత్వంపై లిక్కర్ మాఫియా వ్యవహారంలో ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ముఖ్య సలహాదారులు, ఎంపీలు అరెస్టుల ముప్పును ఎదుర్కొంటున్నారు. వైసీపీ నాయకత్వంపై నమ్మకం తగ్గుతోంది. జగన్ పక్కన ఉన్న నేతలు వివాదాల్లో చిక్కుకుంటున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వంపై విశ్వాసం దెబ్బతింటోందా లేదా అని ఆయన ప్రశ్నించారు.
కూటమి రాజకీయాల్లో రాష్ట్రంలో బలహీనంగా ఉన్నా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. కేసుల నుంచి విముక్తి కలగాలన్నా, భవిష్యత్‌లో భద్రత ఉండాలన్నా ఢిల్లీతో సత్ సంబంధాలు ఉండడం అవసరం. అందువల్లే నేతలు బీజేపీ వైపు మొగ్గుతున్నారు. రాజకీయంగా బలహీనమై ఉన్నా సురక్షిత స్థానంలో ఉంటామన్న నమ్మకంతో బీజేపీ వైపు ఆకర్షణ పెరుగుతోంది.
టీడీపీని ఎందుకు కాదన్నారు?
గతంలో అసంతృప్తి నేతలు టీడీపీ వైపు లేదా జనసేనను ఆశ్రయించేవారు. కానీ ముస్లిం అయిన జకియా ఖానమ్ మాత్రం హిందూత్వ బీజేపీని ఎంచుకోవడం విశేషం. కారణం – ఆమె రాజకీయ స్థిరత్వాన్ని కోరుకుంటున్నారు. టీడీపీలో నడిచే ముఠా రాజకీయాల కంటే బీజేపీలో అజ్ఞాత శాంతినే ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
టీడీపీ ఇప్పటికే సుదీర్ఘకాలం రాష్ట్ర రాజకీయాల్లో పాగా వేసిన పార్టీ. 2019 తర్వాత ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాల్లో బలమైన పునాది వేసుకుంటోంది.
జనసేనకు యువతలో ఆకర్షణ ఉన్నా నిర్మాణాత్మక పార్టీ కాదనే అభిప్రాయం ఉంది.
బీజేపీ – రాష్ట్రంలో ఓట్ల పరంగా బలహీనమైనా, కేంద్రంలో అధికార శక్తిని, CBI, ED, IT వంటి సంస్థల ప్రభావాన్ని వ్యూహాత్మకంగా వినియోగిస్తోంది. రాష్ట్రంలో బలం తక్కువే అయినా అత్యధిక ఒత్తిడి తేగల సత్తా బీజేపీకి ఉంది. ఈ ముగ్గురు కలిసి ప్రత్యక్షంగా కాకపోయినా, ఒకదాని చర్య మరొకదానికి సానుకూలంగా ఉండేలా వ్యవహరిస్తున్నాయని స్పష్టంగా కనిపిస్తోంది.
సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే జకియా బీజేపీని ఎంచుకున్నట్టు తెలుస్తోంది. అవినీతి ఆరోపణలలో చిక్కుకున్న జకియాను మిగతా పార్టీలు వద్దన్నాయా అనే చర్చ సాగుతోంది. ఆమెను 2022లో వైసీపీ తరఫున శాసనమండలికి గవర్నర్ నామినేట్ చేశారు. వైఎస్సార్‌సీపీలో పదవీ అవకాశాన్ని అందుకున్నా.. జకియా ఖానమ్ రెండేళ్లుగా పార్టీతో అంటీ ముట్టనట్టున్నారు. బీజేపీలో చేరాలన్న తన రాజకీయ నిర్ణయం విస్మయాన్ని కలిగించింది. అయితే ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నదేమీ కాదు.
జకియా ఖానమ్ టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం సిఫారసు లేఖలను అమ్మినట్టు ఆరోపణలు రావడం ఆమె రాజకీయ భవిష్యత్తును మసకబార్చింది. తిరుమల వన్‌టౌన్ లో కేసు నమోదైంది. దీంతో ప్రజల్లో నెగటివ్ ఇమేజ్ ఏర్పడింది. పార్టీ వర్గాలనుంచీ విమర్శలు మొదలయ్యాయి. వైఎస్సార్‌సీపీలో కొనసాగడం అంత ఈజీ కాదన్న సంకేతాలు ఆమెకు అప్పుడే మొదలయ్యాయి.
ఈ వ్యవహారానికి ముందు ఆమె తన అనుచరులతో కలిసి టీడీపీ నేత నారా లోకేష్‌ను కలవడం, శాలువాతో సత్కరించడం రాజకీయంగా ప్రాధాన్యం పొందింది. అదే సమయంలో ఆమె టీడీపీలోకి వెళ్లవచ్చన్న చర్చలు ఉధృతమయ్యాయి. కానీ… అవినీతి ఆరోపణల తరువాత టీడీపీ శ్రేణుల్లోనూ ఆమెపై వ్యతిరేకత ఏర్పడినట్లు భావించవచ్చు.
ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన ను కాదనుకుని, బీజేపీ వైపు మొగ్గుచూపడం అనేది "సురక్షిత రాజకీయ వ్యూహం"గా భావించవచ్చునని ఓ తెలుగుదేశం నాయకుడు చెప్పారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ, కేంద్ర ఏజెన్సీల కనుసన్నలో ఉన్న నేతలు అనేక మంది ఇప్పటికే బీజేపీ పంచన చేరారు. అటువంటి వారిలో వై.ఎస్. చౌదరి (సుజనా చౌదరి), సీఎం రమేశ్, ఆదాల ప్రభాకర్ రెడ్డి లాంటి వారెందరో ఉన్నారు.
ఈ సంకేతాలు ఏమి చెబుతున్నాయి?
బీజేపీ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉండటం వల్ల రాజకీయంగా ‘సేఫ్ హెవన్’ అన్న అభిప్రాయం ఉంది. కేంద్ర ఏజెన్సీలు తమ జోలికి రావన్న అభిప్రాయం ఉంది. దీనికి తోడు రాష్ట్రంలో బీజేపీ ఎదగాలంటే స్థానిక నేతలు అవసరం ఉంది. ఇది ఉభయ తారకం లాంటిది.
ఈ క్రమంలోనే జకియా ఖానమ్ రాజీనామాను, పార్టీ మారడాన్ని చూడాలి. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థలో వ్యక్తిగత భద్రత, రాజకీయ లావాదేవీల కలయికకి నిదర్శనంగా భావించాలి.
వైఎస్సార్‌సీపీలో అసంతృప్తి, టీడీపీలో అనుమానం, బీజేపీలో ఆదరణ – ఇవన్నీ కలిసిన తరుణంలో ఆమె చదువు గానీ, సామాజిక ప్రభావం గానీ కాదు ఆమెను బీజేపీ వైపు వెళ్లనీయకుండా ఆపలేకపోయాయి.వ్యవస్థాగత శక్తులతో సంబంధాలే నిర్ణయాత్మకంగా మారాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ, బీజేపీలోకి చేరిన అనేకమంది నేతలు గతంలో లిక్కర్ స్కాం, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం, క్రిమినల్ కేసులు వంటి వివాదాలలో ఆరోపణలను ఎదుర్కొన్న వారే. బీజేపీని ఓ మార్గంగా ఉపయోగించుకున్నవారనే విశ్లేషకుల అభిప్రాయం.