బీసీ కులాల ఐక్యత కోసం మేధావుల సమావేశం

విజయవాడలో బీసీ మేధావుల సభ జరిగింది. తమిళనాడులో మాదిరి బీసీలకు ఏపీలో తగిన ప్రాధాన్యత లేదని వారు అభిప్రాయ పడ్డారు.

Update: 2024-12-21 15:14 GMT

బీసీ కులాలు ఐక్యంగా ఉద్యమాలు నిర్వహిస్తే రాజ్యాధికారం వైపు అడుగులు వేయవచ్చని పలువురు బీసీ మేధావులు అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం విజయవాడలోని పున్నమి రిసార్ట్స్ లో జరిగిన సమావేశం బీసీల సమస్యలపై అధ్యయనం చేయడంతో పాటు వారు రాజ్యాధికారం వైపు అడుగులు ఎలా వేయాలో ఆలోచించింది. తమిళనాడు రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, రిజర్వేషన్ లు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు తమిళనాడులో ఇచ్చారనే విషయంపై చర్చ జరిగింది. కరుణానిధి బీసీల కోసం తమిళనాడులో చేసిన అంశాలపై కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మయ్య రాసిన ‘ద్రవిడ సూరీడు కరుణానిధి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.

దేశంలో మండల్ కమిషన్ సిఫార్స్ లు అమలు జరిగి ఉంటే బీసీలకు ఎంతో మేలు జరిగి ఉండేదనే చర్చ కూడా జరిగింది. విపి సింగ్ మండల్ కమిషన్ సిఫార్స్ లు అమలు చేసేందుకు నిర్ణయం తీసుకోవడం వెనుక జనతాదళ్ (యు) నాయకుడు శరద్ యాదవ్ ఉన్నారని, ఆయనకు అప్పట్లో 70 మంది ఎంపీల మద్దతు ఉందని, ఆ మద్దతును ఉపసంహరించుకుంటానని బెదిరించడంతో విపి సింగ్ మండల్ సిఫార్స్ లకు ఆమోదం తెలిపారనే అంశం తెలంగాణ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పి చిరంజీవి వెల్లడించడం విశేషం. అదే సమయంలో దేవీలాల్ జాట్టు కులస్తులను ఓబీసీలో చేరాలని వీపీ సింగ్ పై వత్తిడి తెచ్చినట్లు చిరంజీవి చెప్పారు. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో బీసీలకు ఎంతో కొంత న్యాయం జరిగిందని, ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు బీసీల గురించి ఆలోచించలేదనే అభిప్రాయం కూడా మేధావులు వ్యక్తం చేశారు. అప్పట్లో బిజేపీ అగ్రనేత అధ్వానీ రథయాత్ర నిర్వహించడంతో ఈ అంశాలన్నీ అడుగున పడ్డాయనే విషయం బీసీలు గుర్తించాలనే అంశాన్ని వక్తలు లేవనెత్తారు.

బీసీలు ఒక్క వేదిక మీదకు రావడం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్నా ఐక్యంగా పనిచేయడం మాత్రం జరగటం లేదనే అంశం చర్చకు వచ్చింది. ప్రస్తుతం ఏపీలో మూడు కులాలకు తప్ప రాష్ట్ర రాజకీయాల్లో బీసీ కులాల నుంచి అగ్రస్థానంలో ఉన్న ఒక్క బీసీ నాయకుడు కూడా లేకపోవడం ఆశ్చర్యాన్ని గొలిపే అంశమని రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ పూర్ణచంద్రరావు పేర్కొన్నారు. చాలా కాలం ఆయన ఉమ్మడి ఏపీలో ఐపీఎస్ అధికారిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. రిటైర్డ్ అయిన తరువాత బీసీలు నిర్వహించే సభలు, సమావేశాలకు హాజరవుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి రవీంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కొలను కొండ శివాజి, ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్ రావు, బీసీ నాయకుడు రమణ ఇంకా పలువురు బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News