హరీష్ కు గాలమేస్తోందా ?

కేసీయార్, కేటీయార్ నుండి హరీష్ ను దూరంచేయాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుంది.

Update: 2024-07-15 06:01 GMT

బీఆర్ఎస్ కీలక నేత, సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావుకు బీజేపీ గాలమేస్తోందా ? హరీష్ ను ఉద్దేశించి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్-బీజేపీ మధ్య సంబంధాలు ఉప్పునిప్పుగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది కారుపార్టీ నేతల విషయంలో బీజేపీ వైఖరి మారుతున్నట్లు అనుమానంగా ఉంది. బహుశా బీజేపీ రాజకీయ వ్యూహంలో ఇది ఒక భాగమేమో.

కేసీయార్, కేటీయార్ నుండి హరీష్ ను దూరంచేయాలని బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లుంది. అందుకనే హరీష్ ను బండి తెగ మెచ్చుకుంటున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు బాగా మాస్ ఫాలోయింగ్ ఉన్న నేతగా బండి అభివర్ణించటమే విచిత్రంగా ఉంది. హరీష్ బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామని చెప్పారు. తన పనితీరుతో హరీష్ జనాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని బండి ప్రశంసలతో ముంచెత్తారు. హరీష్ ను పార్టీలోకి స్వాగతిస్తునే బండి ఒక కండీషన్ పెట్టారు. అదేమిటంటే తన ఎంఎల్ఏ పదవికి హరీష్ రాజీనామా చేస్తేనే పార్టీలో చేర్చుకుంటామన్నారు. ఇదే సమయంలో ఒకపుడు కేసీయార్ తమ పార్టీగురించి చేసిన కామెంట్లన్నింటినీ బండి గుర్తుచేశారు.

ప్రస్తుతం కేసీయార్ చాలా టెన్షన్లలో ఉన్నారు కాబట్టి పెద్దాయన్ను ఎవరూ ఇబ్బంది పెట్టద్దని బండి తమ పార్టీ నేతలు, క్యాడర్ ను కోరారు. అసలే అనేక టెన్షన్లతో ఇబ్బందిపడుతున్న కేసీయార్ కీలక నేత హరీష్ బీజేపీలో చేరుతారని తెలిస్తే ఏమైపోతారో అని ఎద్దేవా చేశారు. బండి మాటలు చూస్తే తొందరలోనే హరీష్ బీజేపీలో చేరటం ఖాయమన్నట్లే ఉంది. ఇక్కడే కేటీయార్, హరీష్ ఢిల్లీలో కొద్ది రోజులు క్యాంపు వేసిన నేపధ్యం కూడా గుర్తుకొస్తోంది. బండి తాజా వ్యాఖ్యలను గమనిస్తే కేసీయార్ నుండి హరీష్ ను దూరం చేయాలని చాలా ప్లాన్లు వేస్తున్నట్లు అనుమానంగా ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ అధికారప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతు బీజేపీలోకి బీఆర్ఎస్ రాజ్యసభా పక్షాన్ని తొందరలోనే విలీనం చేసేయబోతున్నట్లు పదేపదే చెబుతున్నారు. ముందు రాజ్యసభపక్షాన్ని బీజేపీలో విలీనం చేసేసి తర్వాత హోలు మొత్తంగా కారుపార్టీని కమలంపార్టీలో కలపేస్తారని సామా చెబుతున్నారు. సామా, బండి మాటలు వింటుంటే తొందరలోనే రాజకీయంగా ఆశ్చర్యకరమైన పరిణామాలు జరగటం ఖాయమనే అనిపిస్తోంది.

Tags:    

Similar News