వెదురు తడికెలు కేరాఫ్ విజయవాడ
అన్ని కాలాల్లో వెదురు తడికెలకు గిరాకీ;
విజయవాడ నగరంలో వెదురు తడికెలకు గిరాకీ పెరుగుతోంది. సంప్రదాయ హస్తకళగా, గృహ అవసరాలలో ఒక ముఖ్యమైన వస్తువుగా వెదురు తడికెలు ఉంటున్నాయి. ఈ తడికెలు ఎండ, వాన, గాలి, చలి వంటి విభిన్న వాతావరణ పరిస్థితులలో ఉపయోగ పడుతున్నాయి. ధనిక, పేద తేడా లేకుండా ఈ తడికెలు కొనుగోలు చేస్తున్నారు. పెద్దల ఇండ్లలోనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వేసవిలో విజయవాడలో ఉష్ణోగ్రతలు తరచూ 40 డిగ్రీలను దాటుతాయి. వెదురు తడికెలు కిటికీలకు, వరండాలకు లేదా ఇంటి ముందు వేలాడ దీసి ఎండ నుంచి రక్షణ చాలా మంది పొందుతున్నారు. ఈ తడికెలు గాలి సంచారాన్ని అనుమతిస్తూనే సూర్యరశ్మిని నిరోధిస్తాయి. దీనివల్ల ఇంటి లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది.
వర్షాకాలంలో తడికెలు వర్షపు నీరు ఇంట్లోకి చిమ్మకుండా అడ్డుకుంటుంటాయి. వీటిని తాత్కాలిక గోడలు లేదా షెల్టర్‌గా కూడా ఉపయోగిస్తున్నారు.
చలికాలంలో తడికెలు చల్లని గాలుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని గృహాలలో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలలో...
వెదురు బొంగులతో తయారు చేసిన షెల్టర్లు అమరావతిలోని డాక్టర్ మంతెన సత్యనారాయణ ప్రకృతి వైద్యశాలలో ఉన్నాయి. వెదురు బొంగులను చుట్టూ దడిలా కట్టి పైన కూడా అలాగే తడికలా కట్టి కుటీరంలా తయారు చేశారు. ఆశ్రమంలో మూడు చోట్ల ఇలాంటివి ఉన్నాయి. ముఖ ద్వారం నుంచి లోపలికి వెళ్లగానే రైట్ సైడ్ లో ఏర్పాటు చేసిన రిసెప్షన్ కేంద్రంలో అప్పుడప్పుడు డాక్టర్ కూర్చొంటుంటారు. అన్ని వైపుల నుంచి గాలి లోపలికి వస్తూ చల్లదనాన్ని ఇస్తున్నాయి. ఈ బొంగులకు వుడ్ పెయింట్ వాడటం వల్ల టేకు రంగులో కనిపిస్తుంటాయి.
ఆరోగ్య రక్షణకు తడికలు...
వెదురు తడికెలు దుమ్ము, ధూళి చిన్న కీటకాల నుంచి ఇంటిని కాపాడతాయి. ఇది శ్వాసకోశ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా అలర్జీలు లేదా ఆస్తమా ఉన్నవారికి ఉపయోగాన్ని ఇస్తుంది. సహజమైన వెదురు పదార్థం వల్ల రసాయన ఉత్పత్తులతో పోలిస్తే ఇవి పర్యావరణ అనుకూలమైనవి. ఆరోగ్యానికి హాని కలిగించవు.
సౌందర్యం, సంప్రదాయం...
వెదురు తడికెలు గృహాలకు సాంప్రదాయ సౌందర్యాన్ని జోడిస్తాయి. విజయవాడలోని అనేక గృహాలు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ తడికెలను అలంకరణగా కూడా ఉపయోగిస్తాయి. కొన్ని సందర్భాల్లో వీటిని పండుగల సమయంలో తాత్కాలిక షామియానాలు లేదా పందిరిలా ఉపయోగిస్తారు.
వ్యవసాయంలో తడికెలను పంటలను ఎండ నుంచి కాపాడటానికి లేదా తాత్కాలిక నీడ ఏర్పాటు చేయడానికి ఉపయోగిస్తారు. చేపలు, కూరగాయలు వంటి వస్తువులను ఎండబెట్టడానికి కూడా వీటిని వాడతారు.
ఏడాది పొడవునా ఉపాధి...
వెదురు తడికెలను అల్లే కళాకారులు ఏడాది పొడవునా ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే వేసవిలో అమ్మకాలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ఒక్కో తడికె ధర సైజు, నాణ్యతను బట్టి 100 నుండి 500 రూపాయల వరకు ఉంటుంది. ఈ హస్తకళలో నైపుణ్యం కలిగిన కళాకారులు రోజుకు 2-3 తడికెలను తయారు చేయగలరు. దీనివల్ల వారికి స్థిరమైన ఆదాయం లభిస్తుంది.
పర్యావరణ అనుకూలత..
వెదురు ఒక పునరుత్పాదక వనరు, ఇది త్వరగా పెరుగుతుంది. పర్యావరణానికి హాని కలిగించదు. అందువల్ల, వెదురు తడికెలు ఉత్పత్తి స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు దోహదపడుతుంది. తడికెలు అన్ని ఆర్థిక వర్గాల వారికి ఉపయోగపడుతున్నాయి. పేద కుటుంబాల నుంచి సంపన్న వర్గాల వరకు, ప్రతి ఒక్కరూ వీటిని వాడుతున్నారు, ఇది సామాజిక సమతౌల్యాన్ని ప్రోత్సహిస్తుంది.
రంగుల అద్దకాలు
తడికెలు అల్లిన తరువాత వినియోగదారుడు కోరిన రంగు వేసి దానిపై రెగ్జోనా క్లాత్ కుట్టి ఇస్తారు. ఈ క్లాత్ వేయడం వల్ల దుమ్ము దానిపై పడితే జారి పోతుంది. ఎప్పుడైనా ఒక సాని నీళ్లు కొడితే వెంటనే దుమ్ము లేకుండా పోతుంది. రంగులు వేయడం వల్ల వెదురు అనే ఫీలింగ్ పోయి మంచి టేకు కర్ర పీలింగ్ వస్తుందని తడికెలు అల్లుతున్న వారు చెప్పారు.
ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధితో తడికెలు అల్లే కూలీ కుల్లా సుధాకర్ (40) మాట్లాడుతూ తాను 15 సంవత్సరాల నుంచి ఈ పనిచేస్తున్నానన్నారు. తడికెలు అల్లినందుకు రోజుకు రూ. 500 లు ఇస్తారని చెప్పారు. ఆరె అప్పరావు మాట్లాడుతూ నాకు మూడు అల్లే ప్రదేశాలు ఉన్నాయి. ఒక్కొక్కరు ఒక్కో ప్రంతంలో కూర్చుని తడికెలు అల్లుతుంటే కొందరు రంగులు వేస్తారని తెలిపారు. అడుగు రూ. 55 నుంచి 60లకు అమ్ముతామని చెప్పారు.
స్థానికంగానే వెదురు బొంగులు అందుబాటులో...
విజయవాడలోని ఆర్టీసీ బస్టాండ్ కు సమీపంలో కృష్ణలంక సర్వీస్ రోడ్డపై టింబర్ డిపోలు ఉన్నాయని, అందులో వెదురు బొంగులు కొనుగోలు చేస్తామని పిల్లి రాజు తెలిపారు. 40 సంవత్సరాలుగా ఈ వ్యాపారం చేస్తున్ననని, ఇదే జీవనోపాధిగా మారిందన్నారు.
ఫారెస్ట్ ఆఫీసు ఎదురుగానే...
విజయవాడలో రెడ్ సర్కిల్ నుంచి పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లే దారిలో ఫారెస్ట్ గెస్ట్ హౌస్ కు ఎదురుగా రోడు పక్క ఈ షాపులు ఉన్నాయి. సుమారు 30 షాపుల వరకు ఉంటాయి. నిత్యం తడికెలు అల్లుతూ, రంగులు వేస్తేనే ఉంటారు. ఫారెస్ట్ కార్యాలయానికి ఎదురుగా ఉన్నందున వెదురు బొంగుల దొంగ వ్యాపారం వంటి సమస్యలు వారికి ఇప్పటి వరకు ఎదురు కాలేదు. టింబర్ డిపోలో బొంగులు కొనుగోలు చేస్తే అందుకు సంబంధించిన బిల్లు ఇస్తారు. రేటు అంటే ఒక్కో బొంగు సైజును బట్టి రేట్లు ఉంటాయని కొనుగోలు దారులు తెలిపారు.
విజయవాడలో వెదురు తడికెలు కేవలం గృహ అవసరాలకు మాత్రమే కాకుండా, స్థానిక ఆర్థిక వ్యవస్థకు, సాంస్కృతిక వారసత్వానికి కూడా ఉపయోగ పడుతున్నాయి. ఇవి ఆరోగ్య రక్షణ, వాతావరణ రక్షణ, జీవనోపాధి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సంప్రదాయ హస్తకళగా, వెదురు తడికెలు ఆధునిక జీవనశైలిలో కూడా తమ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాయి. ఈ హస్తకళను పరిరక్షించడం మరియు ప్రోత్సహించడం ద్వారా, విజయవాడ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి మరింత దోహదపడవచ్చు