రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డును అందుకున్న బాలయ్య

బావమరిది బాలయ్యకు బావ చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌లు అభినందనలు తెలిపారు.;

Update: 2025-04-28 16:19 GMT

టాలీవుడ్‌లో అర్ధ శతాబ్దం పాటు తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ  ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డును అందుకున్నారు. సోమవారం ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రధానం జరిగింది.

50 ఏళ్ల బాలయ్య సినీ ప్రయాణం
బాలకృష్ణ, విశ్వవిఖ్యాత నటుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుమారుడు. 1960 జూన్‌ 10న జన్మించారు. 1974లో తన 14వ ఏట ‘తాతమ్మ కల‘ చిత్రంతో బాల నటుడిగా సినీ రంగంలో అడుగుపెట్టారు. తర్వాత ‘సాహసమే జీవితం‘చిత్రంతో కథానాయకుడిగా తన సినీ కెరీర్‌ను మొదలు పెట్టారు. 1984 నుంచి ఇప్పటి వరకు గత 50 ఏళ్లలో 109 సినిమాల్లో నటించారు. అందులో సామాజిక, పౌరాణిక, జానపద, బయోపిక్, సైన్స్‌ ఫిక్షన్, హిస్టారికల్‌ వంటి వివిధ జానర్లకు చెందిన సినిమాలు ఉన్నాయి. మూడు నంది అవార్డులు, మూడు సీమా అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు, భరతముని అవార్డులు కూడా బాలయ్య అందుకున్నారు. 2025 జనవరి 25న గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీరిలో కళల విభాగంలో బాలకృష్ణకు పద్మభూషణ్‌కు ఎంపిక చేశారు. సినీ రంగంలోను, రాజకీయ రంగంలోను, బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ద్వారా సమాజానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా లభించింది.
బావమరిది బాలయ్యకు బావ చంద్రబాబు అభినందనలు
గౌరవ రాష్ట్రపతి ద్రౌవపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ట్విటర్‌ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. కళ, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలను అధిరోహించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ బాలకృష్ణకు అభినందనలు తెలిపారు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ పద్మభూషణ్‌ పురస్కారం అందుకున్న సందర్భంగా పవన్‌ కల్యాణ్, బాలయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బాలకృష్ణకు ప్రత్యేక స్థానం ఉందని, చారిత్రక, పౌరాణిక, జానపద పాత్రల్లో ఆయన శైలి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందన్నారు. ప్రజా సేవలో కళాసేవలో బాలకృష్ణ మరిన్ని మైలురాళ్లు చేరుకోవాలని ఆకాంక్షించారు.
Tags:    

Similar News