బాబు, లోకేష్ కెమిస్ట్రీ అదిరింది!

ఏపీ పేరెంట్, టీచర్ మెగా మీట్ 2.0లో సీఎం, ఆయన కుమారుడు లోకేష్ లు హైలెట్ అయ్యారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడిన తీరు తమాషాగా నవ్వుకునేలా చేసింది.;

Update: 2025-07-11 11:30 GMT

పేరెంట్, టీచర్ మెగా మీట్ 2.0లో సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ల 'కెమిస్ట్రీ' పండింది. సోషల్ సైన్సెన్స్ దండగని చెప్పిన చంద్రబాబే ఆయన కుమారుడు లోకేష్ సహా పలువురు విద్యార్థులకు 45 నిమిషాల సామాజిక శాస్త్ర పాఠం చెప్పడం పలువుర్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. తండ్రి పాఠం, తనయుడి శ్రద్ధ, విద్యార్థుల వినమ్రత కొట్టొచ్చినట్టు కనిపించాయి.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల సంభాషణలో ఒక వెరైటీ కనిపించింది. చంద్రబాబు తన భార్య భువనేశ్వరి గురించి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఎలా ఆమె కుమారుడిని చదివించిందో చెప్పారు. లోకేష్‌ను కేంబ్రిడ్జ్, స్టాన్‌ఫోర్డ్‌లో చదివేలా ప్రోత్సహించినందుకు ఆమెను ప్రశంసించారు. ‘నా విధుల కారణంగా నేను పేరెంట్ మీటింగ్‌లకు హాజరు కాలేకపోయాను, కానీ భువనేశ్వరి లోకేష్ కోసం బాగా కష్టపడింది’ అని సీఎం చెప్పటం విశేషం. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జులై 10, 2025న జరిగిన మెగా పేరెంట్, టీచర్ మీటింగ్ (PTM) 2.0 కార్యక్రమంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

సీఎం అయిన తన తండ్రి బోధనలో విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ విద్యార్థిగా కూర్చొని, ఆయన మాటలను ఆసక్తిగా వినడం ద్వారా ఒక వినమ్రతను ప్రదర్శించారు. ఈ తండ్రీ-కొడుకుల కెమిస్ట్రీ, వారి సంభాషణలోని హాస్యం, పరస్పర గౌరవం ప్రజలను ఆకట్టుకుంది. ఒక సందర్భంలో చంద్రబాబు లోకేష్‌ను ‘మంత్రిగారు’ అని సంబోధించడం, ఆయన సాంకేతిక నైపుణ్యాన్ని ప్రశంసించడం, సమావేశానికి ఒక సరదా కోణాన్ని జోడించింది.


టెక్నాలజీని పక్కన బెట్టి సామాజిక శాస్త్రం బోధించారు...

ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక ఉపాధ్యాయునిగా వ్యవహరించి, 10వ తరగతి విద్యార్థులకు 45 నిమిషాల సామాజిక శాస్త్ర పాఠం బోధించారు. సహజ, అసహజ వనరులు, ఇంధనం, విద్యుత్ ఉత్పత్తి, పేటెంట్లు, నీటి వనరులు, సాంకేతికత వంటి అంశాలను ఆయన వివరించారు. ఈ సమయంలో లోకేష్ విద్యార్థులతో కలిసి కూర్చొని, ఆసక్తిగా పాఠం వినడం విశేషం. ఈ దృశ్యం తండ్రీ, కొడుకుల సమన్వయాన్ని, విద్యా వ్యవస్థ పట్ల వారి నిబద్ధతను స్పష్టం చేసిందనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.

లోకేష్ ను హైలెట్ చేసిన చంద్రబాబు

చంద్రబాబు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి మార్కుల గురించి అడిగి, తల్లిదండ్రులతో స్కూల్ పనితీరు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన లోకేష్‌ను ఉద్దేశించి, ‘మీకు మంత్రి గారు ఉన్నారు. ఆయన సాఫ్ట్‌వేర్ రంగంలో బాగా పట్టున్న వ్యక్తి. మంచి సలహాలు, సూచనలు ఇస్తారు’ అని పేర్కొన్నారు. ఈ మాటలు లోకేష్ సాంకేతిక నైపుణ్యాన్ని, విద్యా సంస్కరణలలో ఆయన పాత్రను హైలైట్ చేశాయి.

లోకేష్ తన వంతుగా విద్యా రంగంలో తీసుకొస్తున్న సంస్కరణల గురించి వివరించారు. “విద్య అనేది పేదరికాన్ని ఎదుర్కొనే సుప్రీం ఆయుధం. ఆంధ్రప్రదేశ్ విద్యా రంగంలో భారతదేశానికి ఒక మోడల్‌గా నిలుస్తుంది” అని ఆయన పేర్కొన్నారు. LEAP (Learning Excellence in Andhra Pradesh) కార్యక్రమం ద్వారా 9,600 వన్-క్లాస్-వన్-టీచర్ మోడల్ పాఠశాలల ఏర్పాటు, సెమెస్టర్‌ల వారీగా టెక్స్ట్‌బుక్‌ల ద్వారా స్కూల్ బ్యాగుల భారం తగ్గించడం, తల్లికి వందనం పథకం ద్వారా 67.27 లక్షల తల్లులకు రూ. 10,000 కోట్ల ఆర్థిక సహాయం వంటి సంస్కరణలను ఆయన వివరించారు.


స్కూలుకు డుమ్మా కొడుతున్నావా...?

ఈ సమావేశంలో చంద్రబాబు, లోకేష్ తల్లిదండ్రులతో సంభాషించడం ఒక ముఖ్య ఘట్టం. చంద్రబాబు తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ. 15,000 ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థితో సీఎం నేరుగా మాట్లాడుతూ గత నెలలో 15 రోజులు స్కూలు జరిగింది. ఒక రోజు ఆఫ్ సెంట్... ఎందుకు? డుమ్మాకొట్టావా? అని అడిగారు. వెంటనే తల్లి జోక్యం చేసుకుని సార్ పిల్లోడికి జ్వరం వచ్చి స్కూలుకు రాలేదు సర్, మావాడు మాకు తెలియకుండా స్కూలు మానుకోడు సర్ అని చెప్పారు. ’పిల్లలను ప్రతిరోజూ స్కూల్‌కు పంపండి, డుమ్మా కొట్టకుండా చూడండి‘ అని తల్లిదండ్రులను సీఎం కోరారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అధిక నాణ్యత గల యూనిఫామ్‌లు, బ్యాగులు, షూలు, టెక్స్ట్‌బుక్‌ల గురించి ఆయన హైలైట్ చేశారు.


ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ సంస్థలతో సమానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత YSRCP ప్రభుత్వం విద్యార్థుల టెక్స్ట్‌బుక్‌లపై అప్పటి ముఖ్యమంత్రి ఫోటోలు ముద్రించడాన్ని లోకేష్ విమర్శించారు. ఈ సమావేశం ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల విద్యా పురోభివృద్ధిని గమనించడానికి, స్కూల్ వ్యవస్థలో సూచనలు అందించడానికి అవకాశం కల్పించారు.

కొత్తచెరువు మెగా PTM 2.0 కార్యక్రమం చంద్రబాబు, లోకేష్‌ల నాయకత్వంలో విద్యా రంగంలో ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. వారి సంభాషణలు, తండ్రీ, కొడుకుల పరస్పర గౌరవం, విద్యార్థులు, తల్లిదండ్రులతో వారి సంబంధం ఈ కార్యక్రమాన్ని ఒక ఘట్టంగా మార్చాయి.

Tags:    

Similar News