పదవి.. నిర్ణయం కోసం.. ఆశావహుల నిరీక్షణ..

టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పోటీ ఎక్కువైంది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పదవుల తరువాత ఆ పోస్టుకు అంత ప్రాధాన్యం ఉంది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఈఓ, జేఈఓ, సీవీఎస్ఓ పోస్టుల కోసం ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి.

Update: 2024-06-09 14:48 GMT

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధిక సీట్లు సాధించిన విషయం తెలిసిందే. కొన్ని రోజుల్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. సీఎంగా ఎన్. చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు అయిన విషయం తెలిసిందే. ఇదిలావుండగా, దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ ఆధ్మాత్మిక లోకంలో టీటీడీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. తిరుమల శ్రీవారి చెంత పదవుల కోసం పైరవీలు ప్రారంభమయ్యాయి. ప్రాంతాల వారీగా ఇప్పటికే సమీకరణల ద్వారా అదృష్ట పరీక్షకు సమాయత్తం అయ్యారనేది సమాచారం. ఇటీవల తెలంగాణ నుంచి డిప్యుటేషన్ ముగించుకుని వచ్చిన చిత్తూరు జిల్లాకు చెందిన ఐఏఎస్ అధికారిఈఓగా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ఆయన తిరుమలలో సుదీర్ఘకాలం జేఈఓగా పనిచేశారు.

ఎందరో ఆశావహులు
టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ పదవిని ఆశిస్తున్న ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈసారి టీడీపీకి తోడు జనసేన, బీజేపీ కూడా మిత్రపక్షంగా ఉండడం వల్ల ఆ పార్టీల నేతలు కూడా క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రసారాలు సాగిస్తున్న ఓ ఛానల్ అధిపతి కూడా మొదటి వరుసలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, తిరుపతి నుంచి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు పసుపులేటి హరిప్రసాద్ ఆ పార్టీ చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. టీడీపీకి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ రాష్ర్ట అధికార ప్రతినిధి జీ. భానుప్రకాష్ రెడ్డి ఆ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. వారిద్దరూ గతంలో టీటీడీ బోర్డు సభ్యులుగా పనిచేశారు.
బాబు మదిలో కార్యాచరణ!
ఇదిలావుండగా, టీటీడీలో ఇప్పటికే అసవన్య పరిస్థితుల రాజ్యమేలుతున్నట్లు అపవాదు మూటగట్టుకుంది. నిధుల వినియోగంలో ఆశ్రితపక్షపాతం రాజ్యమేలి, ఇష్టానురాజ్యంగా వ్యవహరించారని ఇప్పటి వరకు టీడీపీ నేతలు తీవ్ర స్ధాయిలో ఆరోపణలు చేశారు. ఈ ప్రాంత పరిస్థితి, ప్రధానంగా టీటీడీలో సంపూర్ణ అవగాహన కలిగిన టీడీపీ అధ్యక్షుడు, సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న ఎన్. చంద్రబాబు మదిలో ఇప్పటికే కార్యచరణ ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఆయన అభీష్టాన్ని ఎవరూ మార్చలేరనేది ఆ నాయకుడి మాట. అందువల్ల ఈసారి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మాజీ ఎంపీ, క్షత్రియ నేతకు అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ సీపీ నుంచి బయటికి వచ్చిన బీసీ సామాజికవర్గ నేత, మాజీ ఎంఎల్సీ జంగా కృష్ణమూర్తి, ఎన్.టీ.ఆర్ కృష్ణా జిల్లా నుంచి కూడా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే... వారిలో కాపు సామాజికవర్గానికి అవకాశం ఉండకపోవచ్చనే బలమైన భావన ఉంది. బోర్డు సభ్యుల నియామకంలో సాధారణంగానే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ర్ట నుంచి ప్రాతినిధ్యం ఉంటుంది.
ఆరోపణలకు ఆస్కారం లేకుండా...
ఎవరికి అవకాశం ఇచ్చినా, లాభాపేక్ష, ఆరోపణలు లేని వ్యక్తికి అవకాశం ఉటుందని భావిస్తున్నారు. అదుకు కారణం కూడా లేకపోలేదు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఓ మహిళా ఎమ్మెల్యేకు అవకాశం లభించింది. ’నా కారులో, నడిచి వెళితే .. నా బ్యాగులో బైబిల్ ఉంటుంది‘ అని ఓ ఛానల్ కు ఓ సందర్భంలో ఇచ్చిన ఇం టర్వ్యూ క్లిప్పింగ్ వైరల్ అయింది. దీంతో ఆమెతోనే ’నేను ఆ పదవి తీసుకోవడం లేదు‘ అని చెప్పించడం ద్వారా టీడీపీ అగ్రనేతలు నష్టనివారణ చర్యలు తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం కడప జిల్లా మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన పుట్టా సుధాకర్ యాదవ్ కూడా క్రిష్టియన్ అనే అపవాదును తన పదవీకాలం పూర్తయ్యే వరకు భరించారు. గతకాలం నాటి ఈ పరిస్థితి పునవావృతం కాకుండా, జాగ్రత్తలు తీసుకుంటారనే విశ్వాసం అధికార పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
కాపులకు సందేహమే..!
కులాల సమీకణలు ప్రామాణికంగా తీసుకుంటే, టీటీడీ ఛైర్మన్ పదవి కాపులు (బలిజ) సామాజికవర్గానికి దక్కకపోవచ్చనేది అంచనా. తిరుపతి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు ఆ వర్గానికి చెందిన వ్యక్తి అందువల్ల, టీటీడీ చైర్మన్ పదవి, బీసీ లేదా, రెడ్డి సామాజికవర్గాల్లో ఒకరికి దక్కవచ్చు. పలనాడుకు చెందిన బీసీ నేత, ఉత్తరాంధ్ర క్షత్రియ నేత పేరు బలంగా వినిపిస్తోంది.
ప్రక్షాళన తప్పదు

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినా, చంద్రబాబు విఐపీ కంపార్టుమెంట్ నుంచి వెళ్లడానికే ప్రాధన్యం ఇస్తారు. ఈ మాటను గుర్తు చేసిన ఓ నేత టీటీడీని గత ఐదేళ్లలో అనేక రకాల విమర్శలకు గురి చేశారు. ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడం ద్వారా ఆ పరిస్థితలు పునరావృతం కాకుండా పాలక మండలి సభ్యుల నియామకం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయంపై బీజేపీ చిత్తూరు జిల్లా నేత సామంచి శ్రీనివాస్ ఫెడరల్ ప్రతినిధితో మాట్లడుతూ, ’ వివాద రహితులే కాదు. సేవాభావం కలిగిన వ్యక్తులను ఛైర్మన్, సభ్యులుగా నియమించాలి’ అన్నారు. కూటమి పాలనలో నిర్ణయాలు కూడా అలాగే ఉండబోతాయనే విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.
ఇంత ప్రాధాన్యం ఎందుకంటే..
టీటీడీ పాలక మండలిలో 13 లేదా 25 మంది ధర్మకర్తల మండలి సభ్యులు, ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులు టీటీడీ ఈఓ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. పాలక మండలి సమావేశం జరిగే ముందు రోజు వచ్చే సభ్యులకు ఉచితంగా గది కేటాయిస్తారు. వాహన సదుపాయం, అటెండర్, పీఏ ఉంటారు. వారికి దర్శన కోటా విషయం పరిశీలిస్తే రోజుకు 12 నుంచి 24 మందికి బ్రేక్ దర్శనాలు చేయించడానికి వెసులుబాటు ఉంటుంది. ప్రత్యేక దర్శనాల కోటాలో 20 మందికి దర్శనం చేయించడానికి ఆస్కారం ఉంటుంది. వారి సిఫారసు లేఖలపై కూడా ఆర్జిత సేవా టికెట్లు కేటాయిస్తారు. ఆయితే..
గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంలో కేంద్ర క్యాబినెట్ కు తలదన్నే రీతిలో సుమారు 90 మంది సభ్యలను నియమించి, వివాదం చేకెత్తించారు. ఆ తరువాత ఈ విషయం కోర్టుకు చేరడంతో చక్కదిద్దుకున్నారు.
Tags:    

Similar News