మీరు వైద్యులేనా..తల్లడిల్లిన తండ్రి
ఆరోగ్యం కుదుట పడేంత వరకు రాజమండ్రి జీజీహెచ్‌లోనే ఉంచాలని వేడుకున్నా కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు.;
By : Admin
Update: 2025-01-27 09:45 GMT
ప్రజలకు ఉతింగా వైద్య సేవలు అందించాల్సిన ప్రభుత్వ వైద్యులు పేషంట్ల పాలిట యములుగా మారుతున్నారు. జబ్బులతో వచ్చిన రోగులను నయం చేసి పంపాల్సిన డాక్టర్లు ఆ గురుతర బాధ్యతలను విస్మరిస్తున్నారు. ఆసుపత్రులకు వస్తున్న పేద ప్రజల పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణం పోయాల్సిన వైద్యులే ప్రాణాలను తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు, ప్రభుత్వ వైద్య రంగానికి కళంకంగా మారుతున్నారు. రాజమండ్రి ప్రభుత్వ వైద్యులే దీనికి నిదర్శనం. రాజమండ్రి జీజీహెచ్ అధికారుల నిర్వాకమే ఉదాహరణ.
రాజమండ్రి నగరంలోని బొమ్మూరు ప్రాంతానికి చెందిన పెనుమళ్ల రమ్య స్మృతి మానసిక సమస్యలతో ఇబ్బందులు పడుతోంది. అయినా తల్లిదండ్రులు ఆమెను బాగా చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. తమకు అందుబాటులో ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి చికిత్సలు చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోని సైకియాట్రీ వార్డులో అడ్మిట్ చేశారు. అక్కడ వైద్యులు, సిబ్బంది పర్యవేక్షణ సరిగా లేదు. ముందుగానే మాసనసిక స్థితి లేని రమ్య స్మృతి అక్కడున్న కీపాడ్ సెల్ ఫోన్‌ను మింగేసింది. అప్రమత్తమైన వైద్యులు వెంటనే చికిత్సలు చేసి సెల్ ఫోన్‌ను తొలగించారు. అయితే సెల్ ఫోన్‌ను వెలికి తీసే సమయంలో వైద్యలు సరైన జాగ్రత్తలు తీసుకో లేదు. ఈ క్రమంలో రమ్య ఆరోగ్యం మరింత క్షీణించింది. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రమ్య అన్నవాహిక పూర్తిగా దెబ్బ తినింది. దీనికి చికిత్సలు అందించాల్సిన రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు, దానిని పక్కన పెట్టి రోగిని వేరే ఆసుపత్రికి తరలించాలని నిర్ణయించారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని రమ్య కుటుంబ సభ్యులకు చెప్పారు. రోగి ఆరోగ్యం నిలకడయ్యేంత వరకు ఇక్కడే ఉంచి చికిత్సలు చేయాలని బతిమాలుకున్నా ఆ వైద్యులు కనికరించ లేదు. బలవంతంగా రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యను తరలించారు. అక్కడకి తీసుకెళ్లిన రెండు గంటల్లోనే ఆమె చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారు జామున మృతి చెందింది.
మరణించిన విషయం తెలుసుకున్న రమ్య తండ్రి విలవిలాడి పోయాడు. బోరున విలపించాడు. సెల్ ఫోను తొలగించే ప్రక్రియలో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు చేసిన పొరపాటు వల్లే తన కుమార్తె రమ్య మరణించిందని కన్నీరు మున్నీరయ్యాడు. రమ్య మానసిక స్థితి సరిగా లేదని, ఆమె ఆరోగ్యం కుదుట పడేంత వరకు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచాలని అక్కడి వైద్యులను కాళ్లా వేళ్లా పడినా కనికరించలేదని వాపోయాడు. ఎంత బతిమాలుకున్నా వినలేదు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తన కుమార్తెను తరలించారు. రాజమండ్రి నుంచి కాకినాడకు చేరేందుకే రెండు గంటల సమయం పట్టింది. ఈ రెండు గంటల సమయంలోనే తన కుమార్తె రమ్య ఆరోగ్యం మరింత క్షీణించిందని బోరున విలపించాడు. రాజమండ్రి జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన కూతురు రమ్య మృతి చెందిందని వాపోయాడు.