ఏజెన్సీలో గిరిజనులకు నూరు శాతం ఉద్యోగాలు కలేనా?
ఏజెన్సీలోని ఆదివాసీలకు నూరు శాతం ఉద్యోగాలపై ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్యమాన్ని ఉధృతం చేస్తోంది.;
ఆంధ్రప్రదేశ్‌లోని షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ అమలు చేయాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. మూడు రోజుల క్రితం గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ గిరిజనులకు తాను ఇచ్చిన ఎన్నికల హామీని నెరవేర్చాలని అధికారులతో అన్నారు. దీంతో గిరిజనులకు షెడ్యూల్డ్ ఏరియాలో నూరు శాతం రిజర్వేషన్ మళ్లీ తెరపైకి వచ్చింది.
జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని ఏజెన్సీ గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, డిఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ) పరీక్షలను షెడ్యూల్డ్ ఏరియాలకు ప్రత్యేకంగా నిర్వహించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో జీవో 3ను సుప్రీం కోర్టు రద్దు చేయడానికి కారణాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత సోమవారం (మే 12, 2025) నిర్వహించిన సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, గత ఎన్నికల్లో గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ హామీపై సీఎం చేపడుతున్న చర్యలను ఒక సారి పరిశీలిద్దాం.
సుప్రీం కోర్టు జీవో 3ను ఎందుకు రద్దు చేసింది?
జీవో నెంబర్ 3 అనేది 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు, దీని ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లోని పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం స్థానిక షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. ఈ ఉత్తర్వు 1986లో జారీ చేసిన మరో జీవోపై ఆధారపడింది. ఇది గిరిజన ఉపాధ్యాయులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించింది. అయితే 2020లో సుప్రీం కోర్టు ఈ జీవోను రద్దు చేసింది. దీనికి కారణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
1. రాజ్యాంగ ఉల్లంఘన: సుప్రీం కోర్టు ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం, జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలో ఈ జీవో ఇవ్వటాన్ని అధికార దుర్వినియోగంగా భావిస్తూ ‘ఇష్టానుసారంగా’ (arbitrary) ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. 1992లో ఇందిరా సాహ్నీ కేసులో సుప్రీం కోర్టు రిజర్వేషన్‌లు 50 శాతాన్ని మించకూడదని నిర్దేశించింది. జీవో 3 దీనిని ఉల్లంఘించి. 100 శాతం రిజర్వేషన్‌ను కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పు ఇచ్చింది.
2. సమానత్వ హక్కు ఉల్లంఘన: 100 శాతం రిజర్వేషన్ వల్ల ఇతర వర్గాలు (ఎస్సీ, ఓబీసీ, జనరల్ కేటగిరీ) పూర్తిగా అవకాశాల నుంచి దూరమవుతారని కోర్టు గుర్తించింది. ఇది రాజ్యాంగంలోని సమానత్వ హక్కును (ఆర్టికల్ 14) ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు.
3. డేటా ఆధారం లేకపోవడం: ఈ రిజర్వేషన్ నిర్ణయం తీసుకునే సమయంలో స్థానికేతర ఉపాధ్యాయుల గైర్హాజరీ సమస్యను పరిష్కరించడానికి అని చెప్పినప్పటికీ, దీనికి సంబంధించిన ధృవీకరించదగిన డేటా లేకపోవడాన్ని కోర్టు గుర్తించింది. షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనులు మాత్రమే కాకుండా, ఇతర వర్గాలు కూడా నివసిస్తున్నందున, ఏజెన్సీలోని గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ సమంజసం కాదని తీర్పు ఇచ్చింది.
4. రివ్యూ పిటిషన్‌లో జాప్యం: జీవో 3 రద్దయిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు, అలాగే కొన్ని గిరిజన సంఘాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు 2024లో తిరస్కరించింది. ఈ పిటిషన్‌ను సకాలంలో దాఖలు చేయకపోవడం, తగిన ఆధారాలు లేకపోవడం వల్ల కోర్టు దీనిని కొట్టివేసింది.
సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు
మే 12, 2025న విజయవాడలోని సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
1. 100 శాతం రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నామని హామీ: షెడ్యూల్డ్ ఏరియాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు జీవో 3ను పునరుద్ధరించడం లేదా సమానమైన న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
2. మూడు ఎంపికలపై చర్చ: అధికారులు మూడు ఎంపికలను సీఎంకు వివరించారు. స్థానిక గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్ కల్పించడం. గిరిజన జనాభా నిష్పత్తి ఆధారంగా రిజర్వేషన్ కల్పించడం. సుప్రీం కోర్టు సూచనల మేరకు 50 శాతం రిజర్వేషన్‌తో గిరిజనుల హక్కులను కాపాడడం చేస్తే బాగుంటుందనే సూచనలు వచ్చాయి.
3. న్యాయ నిపుణులతో చర్చలు: సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పాటిస్తూ, జీవో 3ను పునరుద్ధరించడానికి చట్టపరమైన మార్గాలను అన్వేషించాలని, జాతీయ స్థాయిలో న్యాయ మరియు రాజ్యాంగ నిపుణులతో చర్చలు జరపాలని సీఎం ప్రభుత్వంలోని న్యాయ సహాయకులు, సలహాదారులను ఆదేశించారు.
4. గిరిజన సంఘాల అభిప్రాయ సేకరణ: గిరిజన సంఘాలు, సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరించి, వారి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
5. వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యంపై విమర్శలు: గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమయానికి రివ్యూ పిటిషన్ దాఖలు చేయకపోవడం వల్ల గిరిజనులు జీవో 3 ప్రయోజనాలను కోల్పోయారని సీఎం విమర్శించారు.
గత ఎన్నికల హామీపై సీఎం చర్యలు
2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గిరిజనులకు 100 శాతం రిజర్వేషన్‌ను పునరుద్ధరిస్తామని లేదా సమానమైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చేందుకు ఆయన కొన్ని చర్యలు తీసుకుంటున్నారు.
1. చట్టపరమైన మార్గాల అన్వేషణ: సుప్రీం కోర్టు తీర్పులను అధ్యయనం చేసి, రాజ్యాంగ పరిధిలో గిరిజన హక్కులను కాపాడేందుకు చట్టపరమైన రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
2. గిరిజన సంక్షేమ పథకాలు: రిజర్వేషన్‌తో పాటు, గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి విద్య, ఆరోగ్యం, ఇతర సంక్షేమ పథకాలను అమలును మరింత పటిష్టంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు.
3. సామాజిక, రాజకీయ ప్రభావం: ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లోని 19 అసెంబ్లీ, మూడు ఎస్టీ రిజర్వ్‌డ్ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ (టీడీపీ)కి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చవచ్చు.
డిఎస్సీ పరీక్షలపై గిరిజనుల డిమాండ్
గిరిజనులు డిఎస్సీ పరీక్షలను షెడ్యూల్డ్ ఏరియాలకు ప్రత్యేకంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక గిరిజన అభ్యర్థులకు ఉపాధ్యాయ ఉద్యోగాల్లో ప్రాధాన్యత కల్పించవచ్చని వారి ఆకాంక్ష. అయితే ఈ డిమాండ్‌పై సీఎం సమీక్ష సమావేశంలో నేరుగా చర్చ జరగలేదు. కానీ గిరిజనుల ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో భాగంగా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందని అర్థమవుతోంది.
గిరిజన సంఘాల వాదన...
జీవో 3 ద్వారా 4,626 మంది గిరిజన అభ్యర్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందారు. ఇది గిరిజన విద్యా స్థాయిని మెరుగుపరచడంలో సహాయపడింది. స్థానిక గిరిజన ఉపాధ్యాయులు స్థానిక భాష, సంస్కృతిని అర్థం చేసుకుని విద్యను అందించగలరని, దీని వల్ల విద్యార్థుల హాజరు, నేర్చుకునే సామర్థ్యం మెరుగవుతుందని గిరిజన సంఘాలు వాదిస్తున్నాయి.
50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించడం వల్ల జీవో 3ను సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ, గిరిజనులకు ప్రత్యేక హక్కులను కల్పించేందుకు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ (పేరా 5(1) అవకాశం ఇచ్చింది. ఈ షెడ్యూల్ కింద గవర్నర్‌కు షెడ్యూల్డ్ ఏరియాల్లో రిజర్వేషన్‌లను నియంత్రించే అధికారం ఉంది. ఈ అంశాన్ని ఉపయోగించి కొత్త చట్టాన్ని రూపొందించడం లేదా రాజ్యాంగ సవరణ ద్వారా పరిష్కారం చూపాలని గిరిజనులు కోరుతున్నారు.
జీవో నెంబరు 3లో ఏముందంటే...
జీవో నెంబర్ 3 (Government Order No. 3) అనేది 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు. షెడ్యూల్డ్ ఏరియాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను 100 శాతం స్థానిక షెడ్యూల్డ్ ట్రైబ్ (ఎస్టీ) అభ్యర్థులకు రిజర్వ్ చేయడానికి సంబంధించినది. ఈ జీవో 1986లో జారీ చేసిన గత ఉత్తర్వులపై ఆధారపడింది.
1.100 శాతం రిజర్వేషన్: షెడ్యూల్డ్ ఏరియాల్లోని (ఐదవ షెడ్యూల్ కింద నిర్వచించబడిన) ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను స్థానిక గిరిజన (ఎస్టీ) అభ్యర్థులకు పూర్తిగా రిజర్వ్ చేయడం దీని ఉద్దేశ్యం. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించడం వారి విద్యా స్థాయిని మెరుగుపరచడం.
2. స్థానికేతరుల నియామక నిషేధం: ఈ జీవో ప్రకారం షెడ్యూల్డ్ ఏరియాల్లోని ఉపాధ్యాయ పోస్టులకు స్థానికేతర అభ్యర్థులను (గిరిజనేతరులు, ఇతర షెడ్యూల్డ్ ఏరియాల నుంచి వచ్చినవారు) నియమించకూడదు. దీని ద్వారా స్థానిక గిరిజనులకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.
3. గిరిజన విద్యకు ప్రోత్సాహం: స్థానిక గిరిజన ఉపాధ్యాయులు స్థానిక భాష, సంస్కృతి, సమస్యలను బాగా అర్థం చేసుకోగలరని, దీని వల్ల గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని ఈ జీవో ఉద్దేశ్యం. గతంలో స్థానికేతర ఉపాధ్యాయులు గైర్హాజరీ సమస్యల కారణంగా విద్యా నాణ్యత దెబ్బతిన్నదని ఈ జీవో ఉటంకించింది.
4. ఐదవ షెడ్యూల్ ఆధారం: ఈ జీవో రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ కింద గవర్నర్‌కు ఉన్న అధికారాలను ఆధారంగా చేసుకుంది. ఇది షెడ్యూల్డ్ ఏరియాల్లో గిరిజనుల హక్కులను కాపాడేందుకు ప్రత్యేక నిబంధనలను కల్పిస్తుంది.
నల్లమల చెంచులకు డిఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించాలి
నల్లమల చెంచు గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలని రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ డైరెక్టర్ చెవుల అంజయ్య కోరారు. ఈ మేరకు నల్లమల చెంచు (పీటీజీ) గిరిజనులకు ప్రత్యేకంగా నిర్వహించడం ద్వారా ఆ కుటుంబాల్లో వెలుగులు నింపిన వారవుతారన్నారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కు అర్జీ ఇచ్చామని, ఆమె ప్రత్యేకంగా ఫైల్ పుటప్ చేశారని చెప్పారు.
ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూడాలి
ఆదివాసీలకు న్యాయం చేసే జీవో 3ను కోర్టు కొట్టేసినందున దానికి ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి సాయం చేస్తానని హామీ ఇచ్చారని ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ మన్యం జిల్లా ఉపాధ్యక్షులు బిడ్డిక శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆయన ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ సీఎం జీవో 3కు ప్రత్యామ్నాయం చూస్తానని హామీ ఇచ్చారని, విద్య, ఉద్యోగాల్లో ఏజెన్సీలోని షెడ్యూల్డ్ ఏరియాలో మా ఉద్యోగాలు మాకే ఇవ్వాలన్నారు. ఏజెన్సీ వారు మైదాన ప్రాంతం వారితో పోటీ పడాలంటే ఒక్కరికి కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదన్నారు. ప్రస్తుతం ఏజెన్సీలో 8వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జీవో 3 ఆగిపోవడం వల్ల షెడ్యూల్డ్ ఏరియాలో కేవలం కేవలం 24 పోస్టులు మాత్రమే ఉన్నాయన్నారు. తమకు దక్కుతున్నాయన్నారు. ఈ పరిస్థితి నుంచి బయట పడాలంటే ప్రత్యామ్నాయం సీఎం తీసుకు రావాలన్నారు. తమ ఆందోళన కొనసాగుతుందని చెప్పారు.
డాక్టర్ EAS శర్మ జీవో నెంబరు 3పై ముఖ్యమంత్రి చంద్రబాబు కు లేఖ.
మన రాష్ట్రంలో ఆదివాసీ ప్రాంతాల్లో, షెడ్యూల్డ్ గ్రామాలలో, అధ్యాపకుల పోస్టుల విషయంలో, ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కలిగించడం కోసం, రాష్ట్రప్రభుత్వం ఒక ప్రత్యేకమైన చట్టాన్ని ప్రవేశపెడుతుందని మీరు చేసిన ప్రకటనపై రాష్ట్రంలో ఆదివాసీ ప్రజలు హర్షిస్తున్నారు.
నా ఉద్దేశంలో ఆదివాసీల సంక్షేమం దృష్టిలో ఇది మంచి నిర్ణయం.
1986లో డాక్టర్ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో, అప్పటి ట్రైబల్ వెల్ఫేర్ కమిషనర్ గా నేను, అప్పటి సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి S R శంకరన్, రాజ్యాంగం 244వ ఆర్టికల్ ద్వారా ప్రవేశపెట్టిన 5వ షెడ్యూల్, పారా 5(1) క్రింద, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో అధ్యాపకుల స్థానిక పోస్టులలో, స్థానిక ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కలిగించే ప్రతిపాదనను ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ గార్ల ఆమోదం తీసుకుని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.
ప్రభుత్వం అటువంటి రిజర్వేషన్ లు కలిగించడం వలన ఆదివాసీలకు అదనంగా ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా, వారి సంస్కృతికి పరిరక్షణ కలిగించినట్లు అయింది.
అధ్యాపకుల పోస్టుల రిజర్వేషన్, అప్పటి ప్రభుత్వం GOMs No 275 (SW) 3-11-1986 ద్వారా జారీ చేయడం జరిగింది. కొంత మంది గిరిజనేతరులు, అందుకు వ్యతిరేకంగా హైకోర్టును, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు.
కోర్టు, ట్రిబ్యునల్ ల ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని, ఆదివాసీ రిజర్వేషన్లను పరిరక్షించే ఉద్దేశంతో, అప్పటి ప్రభుత్వం GOMs No 3 dated 10-1-2000 ను జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా గిరిజనేతరులు, మళ్ళీ హైకోర్టు ను, తరువాత సుప్రీమ్ కోర్టును CA No 3609/2002 ద్వారా ఆశ్రయించారు.
ఆ కేసు (CA No 3609/2002) లో సుప్రీం కోర్టు వారు, రాష్ట్రం జారీ చేసిన GOMs No 3, రాజ్యాంగం 14,16 Articles కు వ్యతిరేకంగా ఉందని, ఏ పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని ఉల్లంగించకూడదని 22-4-2020 న తీర్పు ఇచ్చారు. నా ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున 5వ షెడ్యూల్ ద్వారా రాజ్యాంగం, ఆదివాసీల ప్రత్యేక హక్కుల పరిరక్షణ కోసం కలిగించిన ప్రాముఖ్యత గురించి విపులంగా వాదించి ఉంటే, కోర్టు GOMs No 3 రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని తీర్పు ఇచ్చి ఉండదు.
సుప్రీంకోర్టు వారి 2020 తీర్పు రాగానే, అప్పటి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, రాజ్యాంగం 5వ షెడ్యూల్ 5వ పారా క్రింద ప్రత్యేకమైన చట్టాలను తక్షణం ప్రవేశ పెట్టి, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో స్థానిక ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్లకు చట్టపరంగా పరిరక్షణ కలిగించాలని నేను విజ్ఞప్తి చేశాను. రెండు తెలుగు రాష్ట్రాలు సుప్రీంకోర్టు లో రివిజన్ పిటిషన్లు దాఖలు చేశాయి. కాని ప్రత్యేకమైన చట్టం ద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం కారణంగా, కోర్టు రివిజన్ పిటిషన్ లను తిరస్కరించింది.
అప్పటి ప్రభుత్వ న్యాయనిపుణులు, అప్పటికే 5వ షెడ్యూల్ పారా 5(2) క్రింద ముసాయిదా చట్టాలను తయారు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆంధ్ర ప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ నన్ను కూడా సంప్రదించారు. కాని ఎన్నిసార్లు నేను పదేపదే రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసినా, వారు ఏ కారణం వల్లనో ఆ దిశలో ముందుకు పోలేదు.
మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గా బాధ్యత తీసుకున్న సమయంలో మళ్ళీ మీ ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ 13-6-2024 రాసిన లేఖ జత పరిచాను.
షెడ్యూల్డ్ గ్రామాల్లో స్థానిక గిరిజనులకు అధ్యాపకుల పోస్టులలో 100 శాతం రిజర్వేషన్ కోసం ప్రవేశపెట్టాల్సిన చట్టం మీద, కేవలం ప్రభుత్వంలో న్యాయనిపుణులే కాకుండా, ఆ విషయాన్ని కూలంకుషంగా అధ్యయనం చేసిన న్యాయవాది పల్లా త్రినాథ రావు ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయనిపుణులు తయారు చేసిన ముసాయిదా చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని, కొన్ని మార్పులతో ముసాయిదా తయారు చేశారు.
సుప్రీమ్ కోర్టు వారు గతంలో ఏ పరిస్థితిలో మొత్తం రిజర్వేషన్లు 50 శాశం పరిమితిని ఉల్లంఘించకూడదు అని ఇచ్చిన ఆదేశాన్ని, ప్రత్యేకంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఆదివాసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం అవసరం. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని 100 శాతం రిజర్వేషన్ చట్టంలో ప్రత్యేకంగా ఒక సెక్షన్ చేరిస్తే, అస్పష్టత ఉండదు.
అటువంటి చట్టాన్ని ప్రవేశపెట్టడంలో, మీ ముందున్న ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా మీ ప్రభుత్వం ఆలస్యం చేయకుండా ప్రత్యేక చట్టాన్ని ప్రవేశపెట్టాలని నా విజ్ఞప్తి.
షెడ్యూల్డ్ ప్రాంతంలో అధ్యాపకుల పోస్టుల, ఇతర పోస్టుల విషయంలో, దేశంలో మొట్టమొదటిసారి ఆదివాసీలకు 100 శాతం రిజర్వేషన్ కలిగించే చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం, N T రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. అటువంటి నిర్ణయాన్ని పరిరక్షించే బాధ్యత మీ ప్రభుత్వానికి ఉందని గుర్తించాలి.
1986లో రాష్ట్ర ప్రభుత్వం అధ్యాపకుల పోస్టులే కాకుండా, ఇతర విభాగాల స్థానిక పోస్టుల (ఉదాహరణకు, గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లో పోస్టులు, గ్రామ అసిస్టెంట్ పోస్టులు) విషయంలో కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రత్యేక చట్టం అటువంటి అన్ని విభాగాల పోస్టులకు వర్తించాలి. మీరు సూచించిన విధంగా ఆలస్యం చేయకుండా మీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నాను.