బలం లేని చోట కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారా?

అనుకున్నంత బలం లేదు. అయినా ఆ నియోజక వర్గాల్లోనే కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. ఎందుకు? ఈ ఎన్నికల్లో ఏమి జరుగుతోంది?

Update: 2024-05-01 09:42 GMT

నాటి బలం కమ్యూనిస్టులకు నేడు లేదు. 1952, 1955 ఎన్నికల్లో దాదాపు అన్ని నియోజక వర్గాల్లోను కమ్యూనిస్టులు పోటీ చేశారు. గెలుపే ధ్యేయంగా పని చేశారు. ప్రధానంగా కాంగ్రెస్, కమ్యూనిస్టుల మధ్యనే పోటీ జరిగింది. అక్కడక్కడ కృషీకార్‌లోక్‌ పార్టీను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా గెలుపు సాధ్యం కాలేదు. కమ్యూనిస్టులు విడిపోయిన తర్వాత బాగా బలహీన పడ్డారు. 1967 తర్వాత కమ్యూనిస్టులు మూడో స్థానంలో కూడా లేకుండా పోయారు. దాదాపు రెండు దశాబ్దాల కాలంగా కమ్యూనిస్టుల పోరాటాలు కూడా తగ్గాయని చెప్పొచ్చు.

ఇండియా కూటమిలో ఈ ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో కమ్యూనిస్టులు పోటీ చేస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత 16 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌తో కలిసి కమ్యూనిస్టులు రంగంలోకి దిగారు. గుంటూరు పార్లమెంటు నుంచి సీపీఐ, అరుకు పార్లమెంట్‌ నుంచి సీపీఎంలు పోటీగి దిగాయి.
ఈ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టుల బలమెంత?
వారు ఎంచుకున్న సీట్లు కమ్యునిస్టులకు బలమైన నియోజక వర్గాలేనా? లేకుంటే కాంగ్రెస్‌ ఇచ్చింది కదా అని ఏదో ఒకటి తీసుకున్నారా? కొన్ని నియోజక వర్గాలు కమ్యూనిస్టులు బలమైన ఓటు బ్యాంకు ఉన్నవి కాదని ఆ పార్టీల్లోనే చర్చ సాగుతోంది. పొత్తులో భాగంగా కొన్ని బలమైన నియోజక వర్గాలను కూడా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌కు వదిలేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమై ఉండొచ్చనే చర్చ కూడా ఆ పార్టీల్లో చర్చ సాగుతోంది. సీపీఐ 8, సీపీఎం 8 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీకి దిగారు.
సీపీఎం అభ్యర్థులు ఈ స్థానాల్లోనే పోటీ చేస్తున్నారు
కురుపాంలో సీపీఎం అభ్యర్థిగా మండంగి రమణ బరిలో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లల్లో ఇక్కడ సీపీఐ గెలిచింది. కురుపాంకు ముందు నాగూరు నియోజక వర్గంగా ఉండేంది. 2009లో కురుపాంగా మారింది. 2004లో పొత్తులో భాగంగా సీపీఎం గెలిచింది. అది మినహా స్వతహాగా పోటీ చేసి గెలిచిన సందర్భం లేదు.
గాజువాక నుంచి ఎం జగ్గునాయుడు సీపీఎం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఇది 2009లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సీపీఎం పోటీ చేసినా కనీసం మూడో స్థానంలో కూడా నిలవ లేక పోయింది. అంతకు ముందు పర్వాడ గా ఉండేది. 1952లో ఎం వీరభధ్రం సీపీఐ నుంచి గెలిచారు. 1955లో ఆయన ఓడి పోయారు.
గన్నవరం నుంచి కళ్లం వెంకటేశ్వరరావు సీపీఎం అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. 1955, 1962 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పుచ్చలపల్లి సుందరయ్య గెలిచారు. 1978లో మరో సారి సుందరయ్య గెలిచారు. 1967, 1968లో జరిగిన బై ఎలక్షన్, 1972 ఎన్నికల్లో సీపీఎం పోటీ చేసి ఓడి పోయింది. నాడు కమ్యునిస్టులకు బలమైన నియోజక వర్గమైన గన్నవరంలో నేడు కనీసం గ్రామాల్లో శాఖలు కూడా లేకుండా పోయాయి. ఇప్పుడు గన్నవరంలో కమ్యూనిస్టుల వైపు చూసే వారు కానీ, ప్రచారం చేసే వారు కానీ కరువయ్యారని ఆ పార్టీలోనే చర్చ సాగుతోంది.
విజయవాడ సెంట్రల్‌ నుంచి సిహెచ్‌ బాబురావు సీపీఎం అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. పట్టణంలో కార్మిక వర్గాల్లో కొద్దో గొప్పో పట్టున్నా ఓటింగ్‌కు వచ్చే సరికి సీపీఎం వారిని పట్టించుకోవడం లేదు. 1972 తర్వాత కమ్యూనిస్టులు ఈ నియోజక వర్గం నుంచి పోటీ చేసినా కనీసం మూడో స్థానంలో కూడా లేరు. 2009కి పూర్వం కంకిపాడు కింద ఈ నియోజక వర్గం ఉండేది. 2009తర్వాత ఒకసారి కాంగ్రెస్, టీడీపీ, ఆ తరువాత వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్యనే పోటీ జరుగుతోంది. సీపీఎం పోటీ చేసినా మూడో స్థానానికే పరిమితమవుతోంది.
మంగళగిరి నియోజక వర్గం స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్లల్లో కమ్యూనిస్టులకు బలమైన గడ్డ. రాను రాను ఇక్కడ కూడా వారిని జనం మరచి పోయారు. 1962, 1972లో వేములపల్లి శ్రీకృష్ణ సీపీఎం నుంచి గెలిచారు. అనంతరం ఎన్నికల్లో ఓడి పోయారు. తర్వాత ఆ పార్టీ మనుగడ లేకుండా పోయింది.
నెల్లూరు సిటీ నియోజక వర్గం 2009లో ఏర్పడింది. గతంలో నెల్లూరు నియోజక వర్గం కింద ఉండేది. నెల్లూరు సిటీ నియోయజక వర్గంలో కమ్యూనిస్టులు ప్రాభవం కోల్పోయారని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి సీపీఎం అభ్యర్థిగా మూలం రమేష్‌ పోటీ చేస్తున్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో సీపీఎం అభ్యర్థిగా గౌస్‌ దేశాయ్‌ పోటీలో ఉన్నారు. 1967 నుంచి కమ్యూనిస్టులకు ఇక్కడ అవకాశం లేకండా పోయింది.
సీపీఐ అభ్యర్థులు ఎక్కడెక్కడంటే..
విశాఖ పశ్చిమ నుంచి సీపీఐ అభ్యర్థిగా అత్తిలి విమల పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా కార్మిక వర్గంలో కమ్యూనిస్టులకు కాస్త పట్టున్నా ఓటింగ్‌లో మాత్రం ఆ పట్టు లేదు.
2009లో గుంటూరు పశ్చిమ ఏర్పడింది. అప్పటి నుంచి కమ్యూనిస్టుల ప్రాబల్యమే ఇక్కడ లేదు.
ఏలూరు అసెంబ్లీ నుంచి సీపీఐ అభ్యర్థిగా బండి వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. ఆ నియోజక వర్గం పరిస్థితి కూడా కమ్యూనిస్టులకు గడ్డుగానే ఉంది. నిజానికి ఇక్కడ 1952, 1962లో సీపీఐ గెలిచింది. 1955,1967లో ఓడి పోయింది. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసినా నామ మాత్రమే.
విజయడా పశ్చిమ నుంచి సీపీఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు పోటీలో ఉన్నారు. 2004లో పొత్తుల్లో భాగంగా సీపీఐ గెలిచింది. పొత్తులు లేకుండా నేరుగా ఇక్కడ సీపీఐ గెలవ లేదు. గతంలో మూడు సార్లు పోటీ చేసినా ఓటమి పాలైంది.
అనంతపురం అర్భన్‌ నుంచి సీపీఐ అభ్యర్థిగా సీ జాఫర్‌ రంగంలో ఉన్నారు. ఇక్కడ తొలి ఎన్నికల్లో తరిమెల నాగిరెడ్డి సీపీఐ నుంచి సీపీఎం నుంచి ఒక సారి గెలిచారు. తర్వాత కమ్యూనిస్టులకు గెలుపు దూరమైంది. అక్కడ కూడా కార్మిక వర్గమే కమ్యూనిస్టులకు అండగా ఉంటోంది.
తిరుపతి నుంచి సీపీఐ అభ్యర్థిగా పి మురళీ పోటీలో ఉన్నారు. ఇక్కడ కమ్యూనిస్టులకు స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఓటర్లు అవకాశం ఇవ్వ లేదు.
రాజంపేట నుంచి సీపీఐ అభ్యర్థిగా బుక్కే విశ్వనాథ నాయక్‌ రంగంలో ఉన్నారు. ఇక్కడ కూడా ద్విసభ్య నియోజక వర్గంలో సీపీఐ గెలిచింది. తర్వాత కమ్యూనిస్టుల ప్రభావమే లేకుండా పోయింది.
ప్రత్తికొండ నుంచి సీపీఐ అభ్యర్థిగా పి రామచంద్రయ్య పోటీలో ఉన్నారు. 1955లో సీపీఐ పోటీ చేసి ఓటమి పాలైంది. తర్వాత నుంచి కనీసం రెండో స్థానంలో కూడా కమ్యూనిస్టులు కనిపించ లేదు.
కమలాపురం నుంచి 1952లో సీపీఐ గెలిచింది. 1955,1962లో ఓడి పోయింది. తర్వాత నుంచి కమ్యూనిస్టుల ప్రభావం ఇక్కడ కనిపించ లేదు. సీపీఐ అభ్యర్థిగా కడప జిల్లా కార్యదర్శి గాలి చంద్ర పోటీలో ఉన్నారు.
గుంటూరు పార్లమెంట్‌ అభ్యర్థిగా సీపీఐ నుంచి జంగాల అజయ్‌కుమార్‌ పోటీలో ఉన్నారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి నేటి వరకు కనీసం రెండో స్థానంలో కూడా కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ నిలబడలేకపోయింది.
అరకు పార్లమెంట్‌ నుంచి సీపీఎం అభ్యర్థిగా పి అప్పలనర్సు పోటీలో ఉన్నారు. 2009లో అరకు పార్లమెంట్‌ ఏర్పడింది. అంతకు ముందు పార్వతీపురం పార్లమెంట్‌గా ఉండేది. 2009లో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసిన బాబురావు టీడీపీ పొత్తుతో గెలిచారు. తర్వాత కమ్యునిస్టుల ఊసే లేదు.
Tags:    

Similar News