ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోనున్నాయా?

ఆరోగ్యశ్రీ వైఎస్‌ఆర్‌ మానస పుత్రిక. అది కొనసాగాలంటే జగన్‌ బిల్లులు చెల్లించాలి. 8 నెలలుగా ఆగిపోయాయి. ఇలా అయితే వైద్య సేవలు అందించ లేమని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి.

Update: 2024-05-21 15:18 GMT


ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ నిలచిపోనుందనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు సక్రమంగా చెల్లింపులు చేయక పోతుండటం వల్ల ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆరోగ్య శ్రీ బిల్లులు సకాలంలో చెల్లించడం లేదనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆరోగ్యశ్రీ పథకంపై ఆధారపడి వైద్య సేవలు పొందే పేద వర్గాల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు తప్పేట్టు లేదు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఏమీ చేయలేక ఎనిమిది మాసాల్లో ఐదుగురు ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈఓలు మారి పోయారు. బిల్లుల చెల్లింపుల విషయంలో గతంలో వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతూ వచ్చిన కొంత మంది యాజమాన్యాలు కూడా తాజాగా వ్యతిరేకిస్తున్నారు. బిల్లుల చెల్లింపులపై అన్ని జిల్లాల్లోని ఆసుపత్రుల యాజమాన్యాలందరూ అసంతృప్తిగానే ఉన్నారు.
వైఎస్‌ఆర్‌ మానసిక పుత్రిక
ఉమ్మడి రాష్ట్రం నుంచి కూడా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తున్నారు. నాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆరోగ్యశ్రీ వైఎస్‌ఆర్‌ మానస పుత్రికగా పేర్కొంటారు. నాటి నుంచి లక్షలాది మంది పేద వర్గాల ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు దీని ద్వారా వైద్య సేవలు అందిస్తూ వస్తున్నారు. విభజన అనంతరం కూడా ఆంధ్రప్రదేశంలో దీనిని కొనసాగించారు. విభజన ముందు వరకు రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పేరుతో పథకం అమలైంది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడిన చంద్రబాబు ప్రభుత్వం దీని పేరు మార్పు చేసింది. రాజీవ్‌ ఆరోగ్యశ్రీకి బదులుగా డాక్టర్‌ నందమూరి తారక రామారావు ఆరోగ్యశ్రీ సేవా పథకంగా పేరు మార్చి అమలు చేస్తూ వచ్చారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తిరిగి పేరు మార్చాలని నిర్ణయించింది. ఆ మేరకు డాక్టర్‌ నందమూరి తారక రామారావు వైద్య సేవా పథకానికి బదులుగా డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీగా పేరు మార్చారు. పేరైతే మార్చారు కానీ వైద్య సేవలు అందించినందుకు బిల్లులు సకాలంలో చెల్లించడంలో మాత్రం వైఫల్యం చెందారు. అధికారులు మాత్రం సానుకూలంగా ఉన్నా బిల్లులు చెల్లింపులు జరక్క పోవడంతో తలలు పట్టుకుంటున్నారు.
అన్ని జిల్లాల్లోను నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు
రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే ఆరోగ్యశ్రీ నెట్‌ వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. అయితే బిల్లులు సకాలంలో చెల్లింక పోవడంతో చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల నుంచి స్వచ్ఛందంగానే తప్పుకున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 1270కిపైగా ప్రైవేటు ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు.సుమారు 3వేల రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందిస్తున్నారు. సుమారు 93 శాతం ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు.
తొలి నాళ్ల నుంచి ఒడిదుడుకులే
ఆరోగ్యశ్రీ అనేది వైఎస్‌ఆర్‌సీపీ ఫ్లాగ్‌షిప్‌ ప్రోగ్రామ్‌. నవరత్నాల్లో ఇది ఒకటి. పైగా సీఎం జగన్‌ తండ్రి వైఎస్‌ఆర్‌ బ్రెయిన్‌ చైల్డ్‌. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఈ పథకానికి ప్రాధాన్యతనిస్తూ అమలు చేయాల్సిన బాధ్యత సీఎం జగన్‌ ప్రభుత్వంపై ఉంది. జగన్‌ సీఎం అయిన తర్వాత వైద్య సేవల రేట్లు కూడా పెంచుతారని భావించారు. కానీ రేట్లు పెంచక పోగా పాత రేట్ల బిల్లుల చెల్లింపుల్లో కూడా శ్రద్ద కనబరచ లేదు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నంచి ఇదే పరిస్థితి నెలకొందనే విమర్శలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో చెల్లింపులు చేయడంలో వైఫల్యం చెందారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. బిల్లులు సక్రమంగా చెల్లిండంతో పాటు పెండింగ్‌ బకాయిలను చెల్లిస్తే కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందించ లేమని ఆంధ్రప్రదేశ్‌ ఆరోగ్యశ్రీ ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్‌ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. గతేడాది డిసెంబరులోను, ఈ ఏడాది మార్చిలోను ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. దాదాపు రూ. 1500 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, జనవరి వరకు కేవలం రూ. 50 కోట్లే చెల్లించారని పెండింగ్‌లో ఉన్న బకాయిలను చెల్లిస్తే కానీ ఆరోగ్యశ్రీ సేవలు అందించ లేమని స్పష్టం చేశాయి. సోమవారం కూడా ఇదే విషయాన్ని వారు మరో సారి స్పష్టం చేశారు. పెండింగ్‌ బకాయిలను చెల్లించక పోతే మే 22 నుంచి అంటే బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తామని స్పష్టం చేశారు.
ఆసుపత్రులు నడపడం కష్టంగా మారుతోంది
ఇదే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు కాన్‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ చైర్మన్, ప్రముఖ ఆంకాలజిస్టు డాక్టర్‌ వి మురళీకృష్ణ దిఫెడరల్‌ ప్రతినిధితో మాట్లాడుతూ బిల్లుల చెల్లింపులపై చాలా ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 8 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదన్నారు. సుమారు రూ. 1500 కోట్ల నుంచి రూ. 1600 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, దీంతో ఆసుపత్రులు నడపడం కష్టంగా మారుతోందన్నారు. గత పది నెలల్లో ఆరు సార్లు బిల్లులు చెల్లించాలని ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా సరిగా స్పందించడం లేదన్నారు. అలా చేసిన ప్రతీ సారి కొద్ది మొత్తాల్లో చెల్లించడం, మిగిలిన బిల్లులపై హామీలివ్వడం తర్వాత చెల్లించక పోవడం జరుగతూ వస్తోందన్నారు. అధికారులు అందరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ బిల్లులు మాత్రం చెల్లింపులు కావడం లేదన్నారు. అందించిన వైద్య సేవలకు బిల్లులు ఆగిపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం, ఆసుపత్రులు నడపడం చాలా కష్టంగా మారుతోందన్నారు. బ్యాంకుల వారు కూడా రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదన్నారు. దీంతో వైద్యుల్లో మోటివేషన్‌ కూడా సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు అడిషనల్‌ సీఈఓ కే బాలకృష్ణను దిఫెడరల్‌ ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా ఆరోగ్యశ్రీ సేవలు ఎట్టి పరిస్థితుల్లో ఆగిపోవని, యదావిధిగా కొనసాగుతాయని, బిల్లులు చెల్లింపుల జరుగుతాయని, ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటందని తెలిపారు.
Tags:    

Similar News