ఆంధ్ర ఎన్నికల్లో ‘ నమో’ పేరు ఎందుకు వినిపించట్లేదు?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ప్రధాని నరేంద్ర మోదీ పేరును ప్రచారంలో ఎక్కడా ఉపయోగించడం లేదు. ఇందులో బీజేపీ నాయకులు కూడా ఉన్నారు. ఆంధ్రలో మోదీ వేవ్ లేదా..
By : Jinka Nagaraju
Update: 2024-04-25 09:14 GMT
దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి, అధికార వైఎస్సార్సీపీ పార్టీలు జోరుగా క్యాంపెన్ చేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నాయి. అయితే ఎన్డీఏ కూటమి తరఫున దేశంలోని అన్ని ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ వైపుకి మాత్రం చూడట్లేదు. మోదీ చరిష్మాని ఉపయోగించుకోవడం కంటే.. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడంపైనే తెలుగు దేశం, జనసేన, స్థానిక బీజేపీ నాయకత్వం ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు కనపిస్తోంది. ఎందుకిలా..
బీజేపీ నాయకుల ప్రసంగాలు
అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్‌నే ఉదాహరణగా తీసుకుందాం. ఇటీవల పెందుర్తిలో జరిగిన సభలో రమేశ్ మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆరు హామీల సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని బీజేపీ-టీడీపీ-జనసేన కూటమి కార్యకర్తలను కోరారు. జగన్ అనే రాక్షసుడిని తరిమికొట్టినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పిలుపునిచ్చారు.
సీఎం రమేష్ ఒకప్పుడు చంద్రబాబుకు నమ్మిన బంటు. ఆ పార్టీ నుంచే రాజ్యసభకు ఎంపికయ్యాడు. అయితే 2019 లో వైఎస్సారీసీపీ చేతిలో టీడీపీ దారుణ పరాజయం తరువాత ఆయన బీజేపీలో చేరారు. అయితే ఆయన ప్రసంగంలో ఎక్కడా మోదీ పేరును కనీసం ప్రస్తావించలేదు.
అలాగే, రాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కూడా ప్రధాని మోదీ పేరును ప్రచారంలో ఉపయోగించుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తన సమావేశాలలో, పురందేశ్వరి.... జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మిత్రపక్షాలు ఎలా ప్రచారం చేస్తున్నాయి..
తెలుగుదేశం అధినేత చంద్రబాబు గానీ, ఇటు జనసేన ఛీప్ పవన్ కల్యాణ్ గానీ ఇద్దరు మోదీ పేరు ప్రస్తావించకుండానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 23న శ్రీకాకుళం జిల్లాలోని ఆముదాలవలస, గజపతినగరంలో జరిగిన బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ “జగన్ మోహన్ రెడ్డి వైఫల్యాలు”, తమ పార్టీ ప్రకటించిన ఆరు హామీల గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు.. తప్పితే.. ఒక్కసారి కూడా ప్రధాని మోదీ పేరును ఎత్తలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా మాట్లాడూ.. జగన్ ఎందుకు ఓడించాలో తెలిపారు. కానీ ఆయన ప్రసంగంలోనూ మోదీ పేరు లేదు. మే 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభకు ఏకకాలంలో ఎన్నికలు జరగనున్నాయి.
ఎందుకు ఈ జాగ్రత్త?
ఆంధ్రలో ఎన్డీఏ కూటమి మోదీ పేరును పెద్దగా బయటకు తీయట్లేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరగుతుందా.. లేక యాధృచ్చికంగా జరుగుతుందా అని ఒకసారి ఆలోచిస్తే.. ఉద్దేశపూర్వకంగానే తీయట్లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నమాట. మోదీ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహం రాష్ట్రంలో చల్లారలేదని బిజెపితో సహా ఆంధ్రాలోని ప్రతి పార్టీకి తెలుసు. అందుకే ఆయన పేరు ప్రచారంలో పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆంధ్ర ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా 2014లో రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, బీజేపీ రెండూ కారణం. రాష్ట్రం రాజధాని హైదరాబాద్‌ను తెలంగాణకు కోల్పోయింది. ఆంధ్రకు పరిహారంగా ప్రత్యేక హోదాను ఇస్తామని వాగ్దానం చేసింది.
ప్రజల తీర్పుతో కంగుతిన్న జాతీయ పార్టీలు
విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు జాతీయ పార్టీలకు ఘోర పరాభవం ఎదురైంది. అసెంబ్లీ, లోక్‌సభలో ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోవడమే కాకుండా వారి ఓట్ల శాతం కూడా ఒక్క శాతం దిగువకు పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 7.22 శాతం నుంచి 2019లో 0.98 శాతానికి తగ్గింది.
2014లో టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకుని కాషాయ పార్టీ నాలుగు అసెంబ్లీ సీట్లు, రెండు లోక్‌సభ సీట్లు గెలుచుకుంది. కానీ 2019లో అసలు ఖాతానే తెరవలేదు. ఆ తర్వాత జరిగిన పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సత్తా చాటలేకపోయింది. పట్టభద్రుల నియోజకవర్గాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విశాఖ సీటును కూడా నిలబెట్టుకోలేకపోయింది. దేశ వ్యాప్తంగా ప్రభావం చూపిన ‘మోదీ వేవ్’ ఆంధ్రాలో మాత్రం బీజేపీని కాపాడలేకపోయింది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్
ఆంధ్రప్రదేశ్‌లో మోదీ అంటే అనేక వ్యతిరేక విషయాలు గుర్తుకు వస్తుంటాయని పౌర సమాజ సంస్థ జన చైతన్య వేదిక వల్లంపల్లి లక్ష్మణ్ రెడ్డి అన్నారు. ‘‘రెండు కారణాల వల్ల మోదీపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఒకటి, తప్పుడు వాగ్దానాలు చేయడం, రెండు రక్తాన్ని చిందించి సాధించుకున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని చూడటం. రాష్ట్రంలోని ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో మోదీ పేరు చెప్పి ప్రజల ఆగ్రహాన్ని చవిచూడలనుకోవడం లేదు.
ప్రత్యేక హోదా తిరస్కరణ
ఆంధ్రప్రదేశ్ మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా నిరాకరించడంలో కుట్ర కనిపిస్తోంది. “మోదీ పదేళ్ల పాలనలో దేశంలోని శక్తివంతమైన ఆంధ్ర వెనుకబడి ఉంది. స్పెషల్ స్టేటస్ తిరస్కరించడం ద్వారా ఆంధ్రా, గుజరాత్‌కు పోటీగా మారకుండా మోదీ ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారు' అని ఆయన అన్నారు. ఆంధ్రాకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత చలసాని నరేంద్ర దృష్టిలో మోదీకి జనాల్లో పెద్దగా ఆదరణ లేదు.
“అతను చేసిన ప్రతి వాగ్దానము - ప్రత్యేక హోదా నుంచి వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్‌ల వరకు - ఏదో ఒక సాకుతో నిలిపివేశారు. జగన్ రాజధాని అమరావతిని ధ్వంసం చేసినప్పుడు ఆయన కాపాడలేకపోయారు. కాబట్టి, ఎన్నికల్లో మోదీ గురించి మాట్లాడడం వల్ల వచ్చే లాభం కన్నా.. నష్టం ఎక్కువ.” అని ఆయన అన్నారు.
జగన్ మోహన్ రెడ్డి పై “సాఫ్ట్ కార్నర్”?
టీడీపీ శ్రేణులు కూడా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై ప్రధాని మోదీ అనుసరిస్తున్న వైఖరి నచ్చట్లేదు. జగన్ పై ప్రధానికి సాప్ట్ కార్నర్ ఉందని అనుమానిస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత మార్చి 17న చిలకలూరిపేటలో జరిగిన బహిరంగ సభను ఉటంకిస్తూ.. తన ప్రసంగంలో మంత్రులను మాత్రమే దోపిడీదారులుగా ప్రధాని అభివర్ణించారని టీడీపీ నేత ఒకరు గుర్తు చేశారు. ఇందులో జగన్ పేరు ఎత్తకపోవడం టీడీపీ క్యాడర్ కు మింగుడుపడడం లేదు. రాజకీయ బలవంతం వల్లే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని చెప్పారు. ''మోదీ గురించి గొప్పగా మాట్లాడితే ఆంధ్రాలో ఎదురుదెబ్బ తగులుతుంది'' అని అన్నారు.
అయితే, ఆంధ్రా పరిస్థితిపై బీజేపీ వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఆంధ్రా ఎన్నికల్లో అంతిమంగా లబ్ధి పొందేది బీజేపీయేనని బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. “మేము గెలిచిన స్థానాలతో సంబంధం లేకుండా, చంద్రబాబు నాయుడు లేదా జగన్ గెలిచినా, అన్ని లోక్‌సభ స్థానాలు (25) మనవే. మోదీ ప్రభుత్వానికి మద్దతివ్వడం తప్ప వారికి వేరే మార్గం ఉండదు’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నేత ఒకరు పేర్కొన్నారు.