వైసీపీ మాజీ ఎంపీ సురేష్ అరెస్ట్.. వైసీపీలో పెరుగుతున్న టెన్షన్..

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు.

Update: 2024-09-05 09:53 GMT

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఏపీ పోలీసు ప్రత్యేక బృందాలు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశాయి. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. ముందుగా ఆయనను అరెస్ట్ చేయడానికి ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేష్ నివాసానికి చేరుకున్న పోలీసులకు ఇంట్లో ఎవరూ లేకపోవడం కాస్తంత ఆశ్చర్యం కలిగించింది. అక్కడే 15 నిమిషాలపాటు వేచి చూసిన పోలీసులు.. సురేష్ ఫోన్ కూడా స్విచ్ అని వస్తుండటంతో దర్యాప్తులో మరో అడుగు ముందుకేశారు. నందిగం సురేష్ ఫోన్ సిగ్నల్స్‌ను ట్రేస్ చేయడం ప్రారంభించిన పోలీసులు.. ఆయన హైదరాబాద్‌కు వెళ్లినట్లు రూఢీ చేసుకున్నారు. అనంతరం పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ మియాపూర్‌లోని ఆయన నివాసంలో సురేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో విజయవాడ డిప్యూటీ మేయర్ శైలజా రెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హైకోర్టు నిర్ణయంతో వైసీపీకి టెన్షన్..

టీడీపీ కార్యాలయంపై, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ నేతలు, కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా వారికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి న్యాయస్థానం నిరాకరించింది. దీంతో బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు వెళతామని, అందుకుగానూ తమకు అరెస్ట్ నుంచి రెండు వారాల మినహాయింపు ఇవ్వాలని వారు కోరారు. అందుకు వ్యతికంగా టీడీపీ తరపు న్యాయవాది వాదనలు వినిపించడంతో అందుకు కూడా హైకోర్టు ససేమిరా అంది. దీంతో రాష్ట్రంలో ఈ కేసుల్లో నిందులను అరెస్ట్ చేయడం కోసం పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు పలువురు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. వారి కోసం కూడా పోలీసులు గాలింపులను ముమ్మరం చేశారు.


కూటమి బుదర రాజకీయం: వైసీసీ

నందిగం సురేష్ అరెస్ట్‌పై వైసీపీ పార్టీ ఘాటుగా స్పందించింది. వరద విపత్తులో కూడా కూటమి ప్రభుత్వం బురద రాజకీయం చేస్తోందంటూ పార్టీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘‘మాజీ ఎంపీ, దళిత నాయకుడు నందిగం సురేష్‌ని అక్రమ కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. విజయవాడలో వరద బాధితుల హాహాకారాలు పట్టించుకోకుండా.. కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారు. వరద విలయతాండవం చేసిన సింగ్‌నగర్‌లో బాధితులకు బుధవారం వరకు సాయం చేసిన డిప్యూటీ మేయర్ భర్త శ్రీనివాస్‌ను కూడా అరెస్ట్ చేశారు. వరద వంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు సాయంగా ఉండాల్సిన పోలీసులను ఇలా స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటుంన్నందుకు సిగ్గుపడాలి’’ అని ఘాటైన పోస్ట్ పెట్టింది.

అజ్ఞాతంలో జోగి రమేష్

మాజీ మంత్రి జోగి రమేష్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో ఉన్నారు. హైకోర్టు తన నిర్ణయం వెల్లడించిన రోజు రాత్రి నుంచే జోగి రమేష్ ఫోన్ కలవడం లేదని, ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎప్పుడు, ఎందుకు వెళ్లారు? అన్న విషయాలు కూడా మిస్టరీగానే ఉన్నాయి. దీంతో జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఆయనను అరెస్ట్ చేయడానికి అదనపు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దించాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ముందస్తు బెయిల్ పిటిషన్ల అంశంపై హైకోర్టు నిర్ణయం చెప్పడానికి ముందు రోజు. ప్రస్తుతం జోగి రమేష్ కోసం గాలింపులను ముమ్మరం చేసినట్లు ఆయన చెప్పారు.

Tags:    

Similar News