‘చిత్తశుద్దితోనే మంచి’.. స్వర్ణ గ్రామ పంచాయతీలో పవన్ కల్యాణ్

పంచాయతీలను సుసంపన్నం చేయాలనే సుదూర లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు.

Update: 2024-08-23 07:22 GMT

పంచాయతీలను సుసంపన్నం చేయాలనే సుదూర లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందడుగు వెళ్తోందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకేరోజున గ్రామ సభలు నిర్వహించి పంచాయతీ రాజ్ శాఖ బలోపేతానికి కట్టుబడి ఉన్నామని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారి పల్లెలో ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరిట నిర్వహించిన గ్రామ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిత్తశుద్ధితో ఆలోచిస్తేనే మంచి జరుగుతుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, స్వర్ణ గ్రామాలు చేసుకోవాలన్నదే కూటమి లక్ష్యమని వివరించారు. గ్రామాలు పచ్చగా ఉంటేనే ప్రజలు కూడా సుఖసంతోషాలతో ఉంటారని అన్నారు.

గ్రామ సభ చాలా ముఖ్యం

‘‘గ్రామాభివృద్ధి చేయాలంటే అందులో గ్రామ సభలు నిర్వహించడం అత్యంత ప్రముఖమైన అంశం. ఉన్న నిధులతో పాటు వచ్చిన నిధులను కూడా దారి మళ్లించి జేబులు నింపుకున్న దుస్థితి గ్రామాలు గత ఐదేళ్లలు చూశాయి. గత ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం పంచాయతీరాజ్‌ను మళ్ళీ గాడిలో పెట్టాలని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపాలని యోచిస్తోంది. అందుకు కావాల్సిన ప్రణాళికలనూ సిద్ధం చేస్తోంది. మొత్తం 13,326 పంచాయతీలు బలపడితే రాష్ట్రానికి ఉన్న అప్పులను తీర్చేయొచ్చు’’ అని వివరించారు.

మంత్రదండం ఏమీ లేదు..

ఈ సందర్భంగానే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటూ వస్తున్న విమర్శలు, ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఘాటుగా స్పందించారు. చిటికెలో అద్భుతాలు చేయడానికి చేతిలో మంత్రదండం ఏమీ లేదంటూ ఎద్దేవా చేశారు. ‘‘మేము బాధ్యతల నుంచి పారిపోము. బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించడానికి నిరంతరం పనిచేస్తాం. గుండెల నెండా నిబ్బదత ఉంది. ఆంధ్రప్రదేశ్‌కు సీఎం చంద్రబాబు అనుభవం చాలా అవసరం. లక్షల మందికి ఒకటో తేదీనే పింఛన్లు ఇవ్వగలిగాం. నాకన్నా బాగా ఆలోచించే వాళ్ల వెంట నడవడానికి నేనేమీ చిన్నబుచ్చుకోను, సంకోచించను. పాలన అనుభవం ఉన్న చంద్రబాబు దగ్గర ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవాలన్న తపన నాకుంది’’ అని అన్నారు.

Tags:    

Similar News