ఏపీ లిక్కర్‌ కేసు–మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

తిరిగి 11వ తేదీన సరెండర్‌ కావాలని విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశించింది.;

Update: 2025-09-06 06:51 GMT

ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణంలో కీలక నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరైంది. ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, ఆ ఎన్నికల్లో నిర్వహించే ఓటింగ్‌లో పాల్గొనేందుకు బెయిల్‌ మంజూరు చేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటింగ్‌ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత సెప్టెంబరు 11వ తేదీన తిరిగి సరెండర్‌ కావాలని ఎంపీ మిథున్‌రెడ్డిని ఏసీబీ కోర్టు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌ లిక్కర్‌ స్కామ్‌లో ఎంపీ మిథున్‌రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఆయనను ఏ4 నిందితుడిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నిందితుల జాబితాలో చేర్చింది. తన అరెస్టు తప్పదని భావించిన మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం అనేక ప్రయత్నాలు చేశారు. తొలుత ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ మిథున్‌రెడ్డికి ఊరట లభించలేదు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా మిథున్‌రెడ్డి పిటీషన్‌ తిరస్కరణకు గురైంది. కోర్టు ఆదేశాల మేరకు విచారణ కోసం జూలై 19న విజయవాడ సిట్‌ కార్యాలయానికి వచ్చారు. సుదీర్ఘంగా సిట్‌ విచారణ జరిపిన తర్వాత అదే రోజు రాత్రి సిట్‌ అధికారులు ఎంపీ మిథున్‌రెడ్డిని అరెస్టు చేశారు.
నాటి నుంచి నేటి వరకు ఆయన రిమాండ్‌ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్నారు. అయితే తన బెయిల్‌ ప్రయత్నాలు మాత్రం మానలేదు. కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పిటీషన్‌లు దాఖలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం రావడంతో తనకు మధ్యంత బెయిల్‌ మంజూరు చేయాలని పిటీషన్‌ దాఖలు చేశారు. ఈ ఎన్నికల్లో తాను పాల్గొనాల్సి ఉందని, అందువల్ల బెయిల్‌ మంజూరు చేయాలని కోర్టును కోరారు. అయితే మిథున్‌రెడ్డి బెయిల్‌ పిటీషన్‌కు అర్హత లేదని, ఉపరాష్ట్రపతి ఎన్నికలను సాకుగా చూపి బెయిల్‌ కోరడం సహేతుకం కాదని సిట్‌ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. అయితే మిథున్‌రెడ్డి పిటీషన్‌పై సానుకూలంగా స్పందించిన విజయవాడ ఏసీబీ కోర్టు ఉపరాష్ట్రపతి ఎన్నికలను దృష్టిలో మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Tags:    

Similar News