పోలీసులకు తుపాకులే ఆయుధాలని హోంమంత్రి ఎందుకన్నట్టు?

ప్రస్తుత సమాజంలో పోలీసులకు గన్ ఆయుధమైతే ప్రజలకు ఫోన్ ఆయుధమని హోం మంత్రి వంగలపూడి అనిత అనడాన్ని తప్పుబడుతున్నారు నెటిజన్లు.

Update: 2024-10-15 13:05 GMT

ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా? పోలీసులకు తుపాకులు ఇచ్చింది చట్టం ప్రకారం నడుచుకోవడానికా లేక మారణాయుధాలతో వాళ్ల ఇచ్చింవచ్చినట్టు ప్రవర్తించడానికా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత సమాజంలో పోలీసులకు గన్ ఆయుధమైతే..సామాన్య ప్రజలకు ఫోన్ ఆయుధమని హోం మంత్రి వంగలపూడి అనిత అనడాన్ని తప్పుబడుతున్నారు. రాష్ట్రంలో తుపాకీ రాజ్యం తెస్తారా? లేక సమాజంలో శాంతి భద్రతలను కాపాడేందుకు వినియోగిస్తారో ఆమె చెప్పాలని కోరుతున్నారు.

ఇంతకీ ఆమె ఏమన్నారంటే...
ప్రస్తుత సమాజంలో పోలీసులకు గన్ ఆయుధమన్నారు. కళ్లముందు ఘోరాలు జరుగుతుంటే దానికి బాధ్యత వహించాల్సింది ప్రభుత్వమే, సాక్షాత్తు రాష్ట్ర హోం మంత్రి తుపాకులతో సమాజంలో శాంతిభద్రతలు కాపాడాలని చూస్తే తీవ్ర పరిణామాలు సంభవిస్తాయని సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అత్యాచారాలు జరిగినపుడు గతంలో తెలుగురాష్ట్రాలలో కొందర్ని కాల్చివేసిన సంఘటనలను ప్రస్తావిస్తున్నారు. " "
ఆమె చెప్పిందేమిటంటే..
వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో డీజీపీ ద్వారకా తిరుమల రావుతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోం మంత్రి అనిత మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిన్నారులు, మహిళలపై జరిగే అఘాయిత్యాలను ఉపేక్షించేది లేదనే క్రమంలో పోలీసులకు తుపాకులు ఆయుధాలన్నారు.
"కళ్ల ముందు జరిగిన ఘటలపై స్పందించి ముందుకు వస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచి అండగా ఉంటాం. బాపట్ల జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలలో మహిళలపై జరిగిన అత్యాచార కేసులలో విచారణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో అక్టోబర్ 12న అత్తాకోడళ్లపై జరిగిన అఘాయిత్యం చాలా దురదృష్టకరం.
ఓ వైపు దసరా నవరాత్రులు, మరో వైపు శ్రీవారి బ్రహ్మోత్సవాల బందోబస్తులో పోలీసులు నిమగ్నమై ఉన్నా.. టెక్నాలజీ ఉపయోగించి ఈ కేసును 48 గంటల్లో ఛేదించాం. సీసీ కెమెరాలను ధ్వంసం చేసి నేరానికి పాల్పడినా 200కి.మీ ప్రయాణించి, కొండలు, గుట్టలు ఎక్కి చాకచక్యంగా పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన అనుమానితులను ఐదుగురిని రిమాండ్ కు పంపారు. ఈ ఐదుగురిలో ముగ్గురు మైనర్లతో పాటు 32 దోపిడీ కేసుల చరిత్ర కలిగిన నేరస్థుడున్నాడు. మైనర్లంతా ఈ మధ్యలోనే ఈ గ్యాంగ్ లోకి వచ్చారు" అని చెప్పారు.
112, 100 నంబర్లకు ఫోన్ చేస్తే చాలు...
నేరం చేయాలంటే భయపడేలా నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. ఎక్కడ ఏ సంఘటన జరిగినా 112,100 నంబర్లకు ఫోన్ చేసి చెబితే పోలీస్ వ్యవస్థ క్షణాల్లో స్పందిస్తుందన్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, ప్రైవేట్ స్థలాల్లో సీసీ కెమెరాలను కూడా పోలీస్ భద్రత వ్యవస్థతో అనుసంధానం చేసి నేరాలను నియంత్రించేందుకు వ్యూహం రచించినట్లు హోం మంత్రి తెలిపారు. అనుకోని ఘటనలు జరగకముందే ప్రజలు, వ్యాపారులు తమ ఇళ్లు, వ్యాపార సంస్థల దగ్గర అమర్చుకున్న సీసీలను అనుసంధానం చేసుకుంటే నిరంతరం పోలీస్ వ్యవస్థ నిఘా పెట్టి ఇబ్బందికర ఘటనలు జరగకుండా అప్రమత్తం చేస్తుందన్నారు. డ్రోన్లు వినియోగించి ముఖ్య ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కార్యాచరణ రూపొందించనట్లు తెలిపారు.
పోలీసులకు మంచి రోజులు..
చర్చిలు, మసీదులు, ఆలయాలు, బాలికలు, మహిళల హాస్టళ్లు, స్కూళ్లు, కాలేజీల వంటి ప్రాంతాల్లో మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘా పెంచుతామన్నారు హోం మంత్రి అనిత. సీసీ కెమెరాల ఏర్పాటు లేకపోవడం వల్ల రథాలకు నిప్పంటించడం, విగ్రహాల విధ్వంసం వంటి ఘటనలను గత ప్రభుత్వంలో ఎన్నో చూశామని గుర్తు చేశారు.
మహిళల అఘాయిత్యాలపై కూటమి ప్రభుత్వం వేగంగా స్పందించే తీరు ప్రతిపక్షాలకు తెలియకున్నా ప్రజలకు తెలుసన్నారు. 4 నెలల కాలంలో జరిగిన నేరాల్లో నిందితులను పట్టుకోలేని కేసే లేకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో పోలీసులకు మంచి రోజులు వచ్చినట్లు ఆమె స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో ఎంఓపీఎఫ్(మోడర్నైజేషన్ ఆఫ్ ఫోర్స్) కనీస నిధులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ఏఎంసీ (యాన్వువల్ మెయిన్టెనెన్స్ కాస్ట్) లో రూ.10 కోట్లు, మ్యాచింగ్ గ్రాంట్ కింద రూ.61 కోట్లు విడుదల చేశామన్నారు. పోలీస్ వెహికిల్స్ మరిన్ని పెంచేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోలింగ్ నిరంతరం జరుగుతుందన్నారు.


Tags:    

Similar News