జగన్‌కు హైకోర్టు చురకలు.. కోర్టుకు రావాల్సిందేనని ఆదేశాలు..
ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఏదో ఒక కేసులో వైసీపీ, ఆ పార్టీ నేతలు ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ఇప్పుడు జగన్ కూడా..
ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఏదో ఒక కేసులో వైసీపీ, ఆ పార్టీ నేతలు ప్రజల నోళ్లలో నానుతూనే ఉన్నారు. ప్రభుత్వం మారడం, మళ్ళీ టీడీపీ ప్రభుత్వం రావడం, చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో గతంలో టీడీపీ కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడుల కేసు దర్యాప్తులో వేగం వచ్చింది. ఈ కేసుల్లో చాలా మంది వైసీపీ సీనియర్ నేతల పేర్లు ఉన్నాయి. వారి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడంతో పాటు వారికి అరెస్ట్ నుంచి మినహాయింపు ఇవ్వడానికి కూడా హైకోర్టు నిరాకరించింది. దీంతో చాలా మంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో తాజాగా జగన్.. న్యాయస్థానం ముందు హాజరై తీరాల్సిందేనంటూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. పాస్‌పోర్ట్ విషయంలో తనకు 5 ఏళ్లకు రెన్యూవల్ సదుపాయం కల్పించాలన్న జగన్ వాదనను విజయవాడ కోర్టు తిరస్కరించడంతో ఇదే వ్యవహారంపై జగన్.. హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఈరోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ కోర్టుకు రావాల్సిందేనని, ఆ విషయం ఆయనకు కూడా తెలుసంటూ జగన్ తలంటింది న్యాయస్థానం. ఎన్ఓసీ జారీ విషయంలో కోర్టు ముందు హాజరై జగన్ రూ.20 సొంత పూచి కత్తు కట్టాలన్న విజయవాడ కోర్టు నిర్ణయం విషయంలో కూడా తాను జోక్యం చేసుకోలేనని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలకు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని, ప్రజా జీవితంలో ఉన్న పిటిషనర్ వైఎస్ జగన్‌కు ఈ విషయం బాగా తెలుసుంటూ వ్యాఖ్యానించింది ఉన్నతన్యాయస్థానం.
జగన్ తీరు అలానే ఉంది
‘‘విజయవాడ ప్రత్యేక కోర్టులో 2018లో దాఖలైన పరువు నష్టం దావా కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ కేసు విచారణలో సహ నిందితుడు పాల్గొంటూనే ఉన్నారు. అదే విధంగా జగన్ కూడా పాల్గొంటారని భావించడం సహజం. కానీ అలా జరగలేదు. అప్పటి నుంచి ఈ కేసు పెండింగ్‌లోనే ఉంటూ వచ్చింది. ఇప్పుడు తాజాగా పాస్‌పోర్ట్ రిన్యూవల్కు విజయవాడ కోర్టు జగన్ ఆశించినట్లు ఐదేళ్లకు కాకుండా ఏడాదికే ఇవ్వడం వల్లే హైకోర్టును ఆశ్రయించారు. ప్రత్యేక కోర్టు షరతు పెట్టడంతోనే పాస్‌పోర్ట్ ఎన్ఓసీ కోసం జగన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని బట్టి చూస్తే జగన్ కేవలం తనకు అవసరం అయినప్పుడు మాత్రమే న్యాయవిచారణకు హాజరవుతున్నట్లు ఉంది’’ అని హైకోర్టు ఆక్షేపించింది.
సమన్లు సమాచారం మాత్రమే ఇస్తాయి..
‘‘పరువు నష్టం కేసులో సమన్లు అందకపోవడంతో తనను పూచీకత్తు సమర్పించలని ప్రత్యేక కోర్టు ఆదేశించలేదనే జగన్ వాదన సరికాదు. సమన్లు కేవలం సదరు కేసులో పెండింగ్‌లో ఉందని, విచారణ ప్రక్రియలో పాల్గొనాలని సమాచారాన్ని మాత్రమే తెలియజేసే పత్రాలు. పరువు నష్టం కేసులో న్యాయవాది సహాయంతో జగన్ తనకు సానుకూల ఉత్తర్వులు కూడా పొందారు. కోర్టు విచారణకు సహకరిస్తానని, దానికి లోబడి ఉన్నా చెప్తూనే పూచీకత్తు సమర్పించాలని ఇచ్చిన ఆదేశాలను జగన్ ప్రశ్నిస్తున్నారు. అది సరైన పద్దతి కాదు’’ అని న్యాయస్థానం తెలిపింది. అంతేకాకుండా కోర్టుకు హాజరైతే భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడతాయన్న జగన్ వాదనపై కూడా న్యాయస్థానం స్పందించింది. రాజకీయ ప్రముఖుల కేసులను విచారించే కోర్టు దగ్గర ఈ భద్రతాపరమైన ఇబ్బందులు కలగడం వంటివి సర్వసాధారణమని తెలిపింది.
అసలేంటీ పాస్‌పోర్ట్ సమస్య..
వైఎస్ జగన్ తాను సీఎంగా ఉన్న సమయంలో డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌తో విదేశీ పర్యటనలు చేశారు. ఇప్పుడు అధికారం పోవడంతో ఆయన డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్‌ను అధికారులు రద్దు చేశారు. దీంతో సాధారణ పాస్‌పోర్ట్ రెన్యూవల్ కోసం వైఎస్ జగన్.. సీబీఐ కోర్టును ఆశ్రయించారు. జగన్ పాస్‌పోర్ట్‌ను ఐదేళ్లకు రెన్యువల్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. వెంటనే జగన్.. విజయవాడ స్థానిక పాస్‌పోర్ట్ కార్యాలయంలో పాస్‌పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆయన వేసిన 2018 పరువు నష్టం కేసు ఇంకా పెండింగ్‌లో ఉందని, కావున ఎన్ఓసీ తీసుకురావాలని పాస్‌పోర్ట్ కార్యాలయ అధికారులు కోరారు. దీంతో మరోసారి కోర్టు మెట్లెక్కారు వైఎస్ జగన్. ఎన్ఓసీ కోసం విజవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. అయితే జగన్ పాస్‌పోర్ట్ ఏడాదికి మాత్రమే రిన్యువల్ చేయాలంటూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దాంతో పాటుగా రూ.20వేల సొంతపూచీకత్తు కూడా సర్పించాలని తెలిపింది. కాగా ఈసారి జగన్ ప్రత్యేక కోర్టు వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగానే పూచీకత్తు విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.