ఇక వాలంటీర్లు ఉండరు.. అంతా గ్రామ సేవకులేనా!

వాలంటీర్ వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ ఫోకస్ పెట్టిందా? వారిని ప్రభుత్వ పథకాల నగదు అందించే బాధ్యత నుంచి తప్పిస్తుందా? అసలు ఏపీ ప్రభుత్వం ఎలాంటి మార్పులు తీసుకురావాలనుకుంటుది?

Update: 2024-07-04 10:10 GMT

పాలనను ప్రజల ఇంటి గడపకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ తీసుకొచ్చిన వ్యవస్థే వాలంటీర్. ప్రభుత్వం అందించే ప్రతి పథకాన్ని వారు ప్రజల చెంతకు తీసుకెళ్లారు. వాలంటీర్ల సహాయంతో ప్రజలు అన్ని పథకాలను ఇంట్లో ఉండే పొందారు. కానీ వాలంటీర్లు జగన్‌కు ఇన్ఫార్మర్లుగా మారారంటూ ఎన్నికల ప్రచారంలో టీడీపీ, జనసేన నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 32వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, అందులో వాలంటీర్ల హస్తం కూడా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. 

అదే విధంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీరు వ్యవస్థను రద్దు చేస్తుందని, దాని వల్ల వేల మంది వాలంటీర్లు రోడ్డుపడటమే కాకుండా.. ఏ ప్రభుత్వ పథకం పొందాలన్నా ప్రజలు కూడా చెప్పులరిగేలా మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వస్తుందని వైసీపీ శ్రేణులు చెప్పుకొచ్చాయి. కానీ తాము వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని చంద్రబాబు, పవన్ కల్యాణ్ హామీలు కూడా ఇచ్చారు. 

అయితే ఎన్నికల్లో అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రికార్డ్ బ్రేక్ మెజార్టీ అందుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఇప్పటివరకు వాలంటీర్ వ్యవస్థ గురించి ఎవరూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదు.

ఇటీవల దీనిపై స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అతి త్వరలోనే వాలంటీర్ వ్యవస్థపై ఒక నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఈ నేపత్యంలో వాలంటీర్ వ్యవస్థపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకునే దిశగా ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఇప్పటికే వాలంటీర్ వ్యవస్థను ఎలా కొనసాగించాలి? ఏమైనా మార్పులు చేయాలా? చేయాల్సి ఉంటే అవి ఏంటి? వాటికి ఏ విధంగా అమలు చేయాలి? వారి జీతాల పరిస్థితి ఏంటి? అనే అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 

ఈ నేపథ్యంలోనే వాలంటీర్ వ్యవస్థ, వాలంటీర్ల విధులు, జీతబత్యాలు, ఉద్యోగ వ్యవధి వంటి పలు కీలక అంశాల్లో మార్పులు తీసుకురావాలని కూడా మేధావులు సిఫార్సు చేస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలన్న ఆలోచనపై ప్రస్తుతం కసరత్తులు జరుగుతున్నాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వాలంటీర్ల కోసం కొత్తగా నియామకం చేపట్టాలని, పాత వారిని మూడేళ్లకు మించి కొనసాగించకూడదని మేధావులు చెప్తున్నారని సమాచారం.

మూడేళ్లలో శిక్షణ

ఇందులో భాగంగానే వారు మూడేళ్ల పాటు వాలంటీర్‌గా ఉద్యోగం చేసిన కాలంలోనే ప్రతి వాలంటీర్‌కు ఏదో ఒక వృత్తిపరమైన శిక్షణ కూడా ఇప్పించే విధంగా ప్రభుత్వం చర్చలు సాగిస్తోంది. వారికి శిక్షణ పూర్తి కాగానే మంచి ఉద్యోగం లభించేలా ప్రభుత్వం సహకారం అందించాలని భావిస్తున్నారట. ఈ మేరకు వాలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, వారి జీతాలను కూడా రూ.10 వరకు పెంచాలని ప్రభుత్వం మంతనాలు చేస్తోందని సమాచారం. ఈ విషయంలో కేవలం నిపుణులు, శాఖాధికారులే కాకుండా ప్రజల అభిప్రాయాలు కూడా స్వీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ మార్పులు చేర్పులను అమల్లోకి తీసుకొచ్చి మళ్ళీ వాలంటీర్లను ప్రజల మధ్యకు పంపాలని కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తోందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.

పేరు మార్పుకు ఆలోచన

ఇందులో భాగంగానే వాలంటీర్ వ్యవస్థ పేరును కూడా మార్చాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు సేవక్‌గా మార్చాలన్న తన ఆలోచనను కూడా ప్రభుత్వం అధికారుల ముందు ఉంచినట్లు సమాచారం. అంతేకాకుండా వాలంటీర్లను స్థానిక సంస్థల పరిధిలోకి తీసుకొచ్చి.. వారికి కొన్ని బాధ్యతలను అప్పగించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వారిని రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు డబ్బులు అందించే బాధ్యతల నుంచి తప్పించాలని కూడా ప్రభుత్వం చర్చిస్తోందని తెలుస్తోంది.

Tags:    

Similar News