‘విజయవాడ వరద ప్రభుత్వం సృష్టించే’.. మాజీ మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు

విజయవాడ వరదలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తొలిసారి స్పందించారు. వరదలు వచ్చి తగ్గిపోయి పలు ప్రాంతాలు ముంపు నుంచి బయపడుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడటం కీలకంగా మారింది.

Update: 2024-09-09 15:03 GMT

విజయవాడ వరదలపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తొలిసారి స్పందించారు. వరదలు వచ్చి తగ్గిపోయి పలు ప్రాంతాలు ముంపు నుంచి బయపడుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడటం కీలకంగా మారింది. వరదలు వచ్చిన ఎనిమిది రోజుల తర్వాత మాట్లాడిన మాజీ మంత్రి.. కూటమి ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేశారు. సహాయక చర్యలు అందించడంలో, వరదలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. విజయవాడలో ఎనిమిది రోజులుగా చంద్రబాబు చేస్తున్నదంతా పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనని ఎద్దేవా చేశారు. విజయవాడలో వచ్చిందంతా కూడా కూటమి ప్రభుత్వం సృష్టించిన విపత్తేనని అన్నారు. వరదల సమయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు చాలా బాధాకరమని, వరదల్లో చిక్కుకున్న ప్రజలు ఆకలిదప్పులకు అల్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలు వచ్చినప్పుడు ప్రజలను కాపాడాల్సిన ప్రభుత్వమే నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఫొటోలు దిగడంపై చూపిన మొగ్గు సహాయక చర్యలపై చూపుంటే ఇన్ని మరణాలు సంభవించి ఉండేవి కాదంటూ వ్యాఖ్యానించారు.

విపత్తుకు ప్రభుత్వమే కారణం

‘‘విజయవాడ వరద విపత్తుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. చంద్రబాబుకు పబ్లిసిటీపై ఉన్న శ్రద్ధ ప్రజలకు రక్షించడం, వారికి పునరావాసం కల్పించడంపై లేదు. వారికి సహాయక చర్యలు అందుతున్నాయా లేదా అని కూడా పట్టించుకోలేదు. బుడమేరు నుంచి వరద ముంపు ఉందని డీఈ హెచ్చరికలను కూడా సర్కార్ లెక్క చేయలేదు. 20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని కొందరు అధికారులు చెప్పారు. స్వరాజ్యం వచ్చిన తర్వాత వరదల విషయంలో ఇంత నిర్లక్ష్యం వహించిన ప్రభుత్వం ఏదీ లేదు. తాను అమరావతిలో ఉన్నా కాబట్టి వరదలు రావని చంద్రబాబు భ్రమ పడ్డారా?’’ అంటూ అమర్‌నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇవన్నీ ప్రభుత్వ హత్యలే

‘‘మునిగిపోతారని తెలిసి కూడా ప్రజలకు ముంపుకు వదిలేస్తారా? విజయవాడ వరదల మరణాలు అన్నీ కూడా సర్కార్ చేసిన హత్యలే. అల్లూరి జిల్లాలో గతంలో వర్షాలు వస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షితంగా రక్షించాం. కానీ ఇప్పుడు మాత్రం కూటమి సర్కార్ వరదలు వస్తాయని తెలిసి కూడా నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం అసాధ్యమని కొందరు అధికారులు బాహాటంగానే చెప్తున్నారు. దీనికి సీఎం చంద్రబాబు, అధికారులు బాధ్యత వహించాలి. ప్రకాశం బ్యారేజీ గేట్లను గుద్దుకున్న పడవలు వైసీపీ నాయకులవని విష ప్రచారం చేస్తున్నారు. అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే కదా.. దీనిపై సమగ్ర విచారణ చేయించండి’’ అని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News