రైతులను హీనంగా హేళనలు చేస్తారా
కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం ఒక తాకట్టు వ్యాపారంగా మారిందని మేరుగ నాగార్జున మండిపడ్డారు.;
యూరియా అడుగుతున్న రైతులను కూటమి ప్రభుత్వ మంత్రులు హీనంగా హేళననలు చేస్తున్నారని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన్ని పండుగా రైతులు చేసుకున్నారని, కానీ కూటమి ప్రభుత్వం మాత్రం వ్యవసాయాన్ని తాకట్టు వ్యాపారంగా మార్చేసిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో యూరియాని అందక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. యూరియా సమస్యలు పరిష్కరించి రైతులను ఆదుకోవలసిన ప్రభుత్వం దానిని మానేసి, మంత్రులు ఓ పక్క హేళనలు చేస్తోంటే.. మరో వైపు వ్యవసాయాన్ని మానుకోవాలని సీఎం చంద్రబాబు అంటున్నారని మండిపడ్డారు.
రూ. 280 యూరియా బస్తా రూ. 600లకు బ్లాక్‌లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంటే కూటమి ప్రభుత్వం చోద్యం చూస్తోందన్నారు. రైతు భరోసా కింద రైతులకు రూ. 40వేలు ఇవ్వాల్సి ఉంటే.. కేవలం రూ. 5వేలు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శలు గుప్పించారు. కష్టపడి పండించిన ఏ పంటకు కూడా గిట్టుబాటు ధరలేదన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. తమపై కూటమి ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడేది లేదని, రైతుల పక్షాన పోరాటం చేస్తామన్నారు.