ఏపీ గవర్నర్‌కు ఢిల్లీలో అవమానం
సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోనే అవమానం జరిగింది.;
By : The Federal
Update: 2025-05-14 15:48 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రథమ పౌరుడు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌కు ఢిల్లీలో అవమానం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ లవ్ అగర్వాల్ ప్రొటోకాల్ ఉల్లంఘించి గవర్నర్‌ను అవమానించారు. బుధవారం రాష్ట్రపతి భవన్‌లో జరిగే నూతన భారత ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారానికి ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాత్రే ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌కు ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేరుకున్నారు.
గవర్నర్ ఢిల్లీ పర్యటనలో ప్రోటోకాల్ నిబంధనలు పాటించాల్సి ఉంది. దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ను ప్రొటోకాల్ ప్రకారం అక్కడి ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను రిసీవ్ చేసుకోవలసి ఉంది. ముఖ్యమంత్రి వెళ్లినా, గవర్నర్ వెళ్లినా ప్రోటోకాల్ నింబంధనల ప్రకారం ఏపీ రెసిడెంట్ కమిషనర్ వారిని మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలకాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్ ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించారు. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్‌ను వెళ్లి కలవడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ చేయలేదు. దీంతో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న లవ్ అగర్వాల్ మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడం సరైంది కాదని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ నిబంధనల ఉల్లంఘనలపై లవ్ అగర్వాల్‌ను వివరణ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది.
లవ్ అగర్వాల్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి. గతంలో ఆయన పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాలకు కలెక్టర్‌గా కూడా పని చేశారు. తర్వాత ఆయన డిప్యూటేషన్ మీద సెంట్రల్ సర్వీసులకు వెళ్లిపోయారు. కరోనా సమయంలో ఢిల్లీలో కీలకంగా వ్యవహరించారు. అప్పుడు ఆయన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలో జాయింట్ కమిషనర్‌గా ఉన్నారు. తర్వాత డిప్యూటేషన్ పూర్తి అయిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. అయితే ఆయనను ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా కూటమి ప్రభుత్వం నియమించింది.