గత ప్రభుత్వం చెప్పుకున్న దానికి భిన్నంగా వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో నెలకొన్న ఖాళీలు, వాటి పర్యవసానంపై చర్చ అనంతరం ప్రాధాన్యతల ఆధారంగా ఈ ఖాళీలను భర్తీ చేయడానికి త్వరలో ఒక సమగ్ర ప్రణాళికను రూపొందించాలని మంత్రి ఆదేశించారు. సత్వర నియామకాల కోసం ఈ ప్రక్రియను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధి నుంచి రాష్ట్ర వైద్య సేవల నియామక బోర్డుకు మార్చడానికి తగు చర్యల్ని చేపట్టాలని మంత్రి అధికారులకు సూచించారు. గత 11 నెలలుగా వివిధ విభాగాల్లో జరిగిన నియామకాలపై మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలు తెలుసుకున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి త్వరలో ఏడాది పూర్తి కానున్నందున వైద్య,ఆరోగ్య శాఖలోని 9 విభాగాల పనితీరును, సాధించిన ఫలితాల్ని వైద్య,ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారంనాడు సమగ్రంగా సమీక్షించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు వివిధ విభాగాధిపతులు ఇతర ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
గత 11 నెలలుగా నమోదైన వైద్యులు, సహాయక సిబ్బంది హాజరు, ఓపీ, ఐపీ సేవల తీరు, మౌలిక సదుపాయాల కల్పన, గత ప్రభుత్వ వారసత్వంగా సంక్రమించిన సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, వివిధ విభాగాల్లో ఖాళీలు, బడ్జెట్ వ్యయం తీరుతెన్నులు, స్వర్ణాంధ్రప్రదేశ్–2047 విజన్ డాక్యుమెంట్ లో ఆరోగ్య రంగానికి సంబంధించిన లక్ష్యాల సాధనకు మార్గాలు, ప్రభుత్వ వైద్య సేవల పట్ల ప్రజాభిప్రాయం వంటి పలు అంశాలపై సుదీర్ఘంగా సమీక్ష జరిగింది.
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో అవినీతికి అడ్డుకట్ట
గత ప్రభుత్వ రాజకీయ జోక్యం, అక్రమాలతో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవలో నెలకొన్న అవినీతికి తక్షణమే అడ్డుకట్ట వేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. అవినీతితో కూడిన ఈ దోపిడీ వల్ల విలువైన ప్రజాధనం దారిమళ్లిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతున్న ఆసుపత్రులు, అందుకు సహకరిస్తున్న దళారులు, అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4,300 కోట్లు ఖర్చు చేసి గత ప్రభుత్వం చేసిన బకాయిలను తీర్చడం జరిగిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కూడా భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరిగాయని మంత్రి తెలిపారు. కూటమి ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించేందుకు మిశ్రమ పద్ధతిని త్వరలో అమల్లోకి తీసుకురావాలని మంత్రి స్పష్టం చేశారు.
ఆయుష్‌కు ప్రాధాన్యత
ఎంతో ప్రజాదరణ పొందుతున్న ఆయుష్ వైద్య సేవల్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో ఆయుష్ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని మంత్రి సత్యకుమార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ రంగం పునరుజ్జీవనానికి కేంద్రం సాయంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని...ఇందులో భాగంగా గత ఆర్థిక సంవత్సరానికి రూ.83 కోట్ల నిధుల్ని సాధించామని తెలుపుతూ...ఇందుకు భిన్నంగా 2021–24 మూడేళ్ల కాలంలో గత ప్రభుత్వం ఆయుష్ రంగంపై ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టలేదని తెలిపారు. ఈ విభాగంలో 50 శాతానికి పైగా ఉన్న ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయుష్ సేవల నేపథ్యంలో రాష్ట్రంలో మెడికల్ టూరిజం పెరిగే అవకాశముందని మంత్రి అన్నారు.
ఔషధ, సుగంధ మొక్కల సాగుకు ప్రోత్సాహం
ఆరోగ్య, వాణిజ్యపరంగా ఎంతో ప్రయోజనకరమైన షధ, సుగంధ మొక్కల సాగును పెంచాల్సిన అవసరముందని, ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు. అటువంటి 30 రకాల మొక్కల పెంపకానికి రాష్ట్రంలో అనువైన వాతావరణం ఉందని, వీటి ఆరోగ్య వాణిజ్య విలువలపై రైతుల్లోచైతన్యాన్ని కలిగించాలని ఆయన సూచించారు. ఈ దిశగా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారుల్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు.