ఆంధ్రలో ప్రచారాల జోరు.. ఈరోజు ఎక్కడెక్కడంటే..

ఎన్నికల ముందర ఆంధ్రలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నాయి. ప్రధాన పార్టీల అధినేతలయితే రోజుకు రెండు, మూడు సభలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకం అవుతున్నారు.

Update: 2024-05-06 03:17 GMT

ఆంధ్రలో ప్రచారాల జోరు మరింత పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల అధినేతలందరూ సుడిగాలి మాదిరిగా అన్ని నియోజకవర్గాలను చుట్టేసేలా ప్రచారాలను చేస్తున్నారు. దాదాపు ప్రతి నియోజకర్గంలో తిరుగుతూ, సభలు, రోడ్‌షోలు అంటూ ప్రజలకు చేరవ్వడానికి ఎక్కడలేని ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారాలు చేస్తుంటే.. పార్టీ అధినేతలు రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాల హోరెత్తిస్తున్నారు. ప్రతి సభలో ప్రజలకు తాము చేసే సంక్షేమం గురించి ప్రతి పార్టీ అధినేత పూసగుచ్చినట్లు చెప్తున్నారు. అదే విధంగా ఇటీవల వారి మేనిఫెస్టోలను కూడా విడుదల చేశాయి టీడీపీ, వైసీపీ. ఇన్నాళ్లూ ఆంధ్రలో ఉనికి కూడా లేని కాంగ్రెస్ కూడా ఇప్పుడు ప్రచారంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. అదే విధంగా మరింత జోష్‌తో పార్టీ అధిపతులు తమ ప్రచారాలను సాగిస్తున్నారు. వారు ఈరోజు ఎక్కడెక్కడ ప్రచారం చేయనున్నారంటే..

సీఎం వైఎస్ జగన్ ఈరోజు మూడు నియోజకవర్గాల్లో ప్రచార సభలు నిర్వహించనున్నారు. అక్కడి ప్రజల కష్టాలను తెలుసుకోనున్నారు. ఆయన ప్రచారం ఈరోజు ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు బాపట్ల జిల్లా రేపల్లెలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం సెంటర్‌లో ప్రచార సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు పల్నాడు జిల్లా మాచర్లలో రెండో సభ, ఆ తర్వాత ఆయన కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మచిలీపట్నంలో మూడో ప్రచార సభ నిర్వహించనున్నారు.

టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు కూడా ‘ప్రజాగళం’ పేరిట జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం ఆయన నంద్యాల పార్లమెంటు పరిధిలోని పాణ్యం నియోజకవర్గంలో పర్యటించి అక్కడ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత సాయంత్రం సమయంలో అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ప్రధాని మోదీతో కలిసి సభ నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ పాల్గొననున్న నేపథ్యంలో అనకాపల్లి బహిరంగ సభ ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఈ సభలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం.

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఈరోజు సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌తో కలిసి ఉదయం 9:30 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. కడప కాంగ్రెస్ కార్యాలయంలో ఈ ప్రెస్‌మీట్ జరగనుంది. ఈ ప్రెస్‌మీట్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రెస్‌మీట్ అనంతరం ఆమె ప్రొద్దుటూరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

ఉదయం 11 గంటలకు షర్మిల.. రామేశ్వరం 4రోడ్ల జంక్షన్ నుంచి ఈరోజు ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అందులో భాగంగానే ఆమె ఆర్ట్స్ కాలేజ్ ఎక్స్ రోడ్ , రిషి అపార్ట్‌మెంట్స్, వాసవి కల్యాణ మండపం ప్రాంతంలో పర్యటించి అక్కడి ప్రజలతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత భగత్ సింగ్ కాలని, సంజీవ్ నగర్, శ్రీనివాస్ నగర్, శివాలయం సెంటర్లో పర్యటించి సభ నిర్వహిస్తారు. మధ్యాహ్నం నుంచి జిన్నా రోడ్, అమృతనగర్, ఖాదర్ బాద్ మీదుగా షర్మిల ప్రచారం సాగనుంది.

Tags:    

Similar News