ఏపీ ప్రజలకు విపత్తుల నిర్వహణ సంస్థ అలెర్ట్

రాష్ట్రంలో రేపు, ఎల్లుండి వడగాలులు వీచే అవకాశాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు.

Update: 2024-04-09 14:06 GMT

ఆంధ్రలో ఎండలు మండుతున్నాయి. ఇవి వేసవి ప్రారంభ రోజులే అయినా ఎండలు మాత్రం అల్లాడిస్తున్నాయి. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తుతున్నారు. వైద్యులు, అధికారులు కూడా ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని, తప్పని పరిస్థితుల్లో బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

అందులోనూ వేసవిలో వీచే వడగాలులతో ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని, ఏ మాత్రం అలసత్వంగా ఉన్నా వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని, శరీరం డీహైడ్రేట్ అయిపోయి కళ్లు తిరిగుతాయని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా రాష్ట్ర ప్రజలకు కీలక సూచనలను చేసింది.
రానున్న కొన్ని రోజుల పాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు మండలాల్లో తీవ్ర స్థాయి నుంచి మోస్తరు స్థాయి వడగాలులు వీస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ మేరకు ఆంధ్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. దాని ప్రకారం..
బుధవారం అంటే ఏప్రిల్ 10వ తారీఖున 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 134 మండలాల్లో వడగాలులు వీస్తాయి. అదే విధంగా గురువారం రోజున 16 మండలాల్లో తీవ్ర వడగాలులు, 92 మండలాల్లో వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.
అంతేకాకుండా బుధవారం తీవ్ర వడగాల్పులు వీచే మండలాలు.. మన్యంలో రెండు, శ్రీకాకుళంలో 8, విజయనగరంలోని వేపాడ మండలాలు ఉన్నాయి. అదే విధంగా వడగాలులను చవిచూడనున్న మండలాలు.. శ్రీకాకుళంలో 17, విజయనగరంలో 25, పార్వతీపురం మన్యంలో 11, అల్లూరి సీతారామరాజులో 10, విశాఖపట్నంలో 3, అనకాపల్లిలో 16, కాకినాడలో 10, కోనసీమలో 9, తూర్పుగోదావరిలో 19, పశ్చిమగోదావరిలో 4, ఏలూరులో 7, కృష్ణా, ఎన్‌‌టీఆర్ జిల్లాలో 2, వాటితో పాటు పల్నాడు, అమరావతి మండలాల్లో వడగాలులు వీస్తాయని విపత్తు సంస్థ వారు అంచనా వేస్తున్నారు.
ప్రజలు ఈ జాగ్రత్తలు పాటించాలి
తీవ్ర వడగాలులు వీయనున్న నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలకు నీడపట్టున ఉండాలని, వీలైనంత వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని అధికారులు హెచ్చరించారు. వృద్ధులు, బాలింతలు, చిన్నారులు, గర్భిణీలు మరింత అప్రమత్తంగా ఉండాలని, వీలైనంతగా ద్రవ పానీయాలు తీసుకోవాలని కూర్మనాథ్ సూచించారు. అంతేకాకుండా కూల్‌డ్రింక్స్, మసాలా ఆహార పదార్థాలు, ఎక్కువ నూనె వేసిన ఆహారానికి దూరంగా ఉండాలని చెప్పారు.


Tags:    

Similar News