‘అందుకే అధికారంలోకి వచ్చాం’.. కలెక్టర్ల సమావేశంలో పవన్ కల్యాణ్

గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసానికి రెట్టించిన అభివృద్ధిని సాధించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకు అధికారుల సూచనలు ముఖ్యమని వ్యాఖ్యానించారు.

Update: 2024-08-05 10:15 GMT

‘‘ఎన్నికల ముందు వరకు ఎన్నో అవమానాలు భరించాం. కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి కించపరిచేలా మాట్లాడినా మౌనం పాటించాం. గత ప్రభుత్వ హయాంలో విధ్వంసం తప్ప మరేమీ జరగలేదు. ఇప్పుడు అన్నీ మారాలి. రాష్ట్రం అభివృద్ధి చెందాలి’’ అని వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం ప్రతీకార దాడులతో కాదు అభివృద్ధితోనే సమాధానం చెప్తుందన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజల బాగోగుల కోసం, వ్యవస్థల బలోపేతం కోసం పోరాడాం.. దెబ్బతు తిన్నాం.. అక్రమా కేసులతో వేధింపులకు కూడా గురయ్యామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కూడా ఎవరూ ఏనాడు ఇలాంటి ఇబ్బందులు పడలేదని, కేవలం వైసీపీ పాలనలోనే ఇది జరిగిందని ఆయన ఎన్నికల ముందు వరకు రాష్ట్రంలో పరిస్థితిన వివరించారు. దానిని గమనించిన ప్రజలకు ఎన్నికల్లో ఎన్‌డీఏ కూటమి ఆశీర్వదించారని, అధికారంలో కూర్చోబెట్టారని అన్నారు పవన్ కల్యాణ్.

‘వ్యవస్థలను బతికించాలి’

164 అసెంబ్లీ స్థానాలు, 21 ఎంపీ స్థానాలలో మంచి ఓటింగ్ శాతంతో చారత్రాత్మక విజయం సాధించాం. వ్యవస్థలను బతికించాలని, బలోపేతం చేయాలన్న లక్ష్యంతోనే పోరాడి అధికారంలోకి వచ్చామని తెలిపారు పవన్ కల్యాణ్. ప్రజాక్షేత్రంలో అలుపెరగకుండా పోరాడి గెలిచామని అన్నారు. ప్రజలకు మంచి పాలన అందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, అందు కోసం మీ సూచనలు చాలా ముఖ్యమని కలెక్టర్లను కోరారు పవన్. వైసీపీ పాల్పడిన విధ్వంసానికి ఐఏఎస్, ఐపీఎల్‌లు కూడా ఆంధ్రకు రావాలంటే భయపడ్డారని అన్నారు.

పోటీ పడినోళ్లు ఇప్పుడు భయపడుతున్నారు

‘‘రాష్ట్ర విభజన అనంతరం అనేక అవమానాలు ఎదుర్కొన్నాం. రాష్ట్ర సరిహద్దుకు రావాలంటే అడ్డుకున్న పరిస్థితి. ఎన్నో అవమానాలు భరించాం. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఆంధ్రప్రదేశ్‌ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేసింది. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో పనిచేయడానికి పోటీలు పడిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. ఇప్పుడు ఆంధ్రకు రావాలంటే భయపడుతున్నారు. ఐదేళ్లలో అన్ని శాఖలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీది. ప్రజాస్వామ్య పాలన అన్న ఉద్దేశాన్నే వైసీపీ ఛిద్రం చేసింది. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కీలుబొమ్మలా మార్చేయడం ఎంతో బాధించింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

నిజాయితీగా పనిచేయాలి

‘‘గత ప్రభుత్వ పాలనలో పతనమైన వ్యవస్థలను తిరిగి బతికించే దిశగా పనిచేద్దాం. అన్ని శాఖలను పటిష్టం చేస్తాం. ఇందుకోసం అధికారులు వేగంగా, నిజాయితీగా పనిచేయాలి. రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు కూటమి ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తుంది. వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించినంత వరకు వారిని అడ్డుకోవడం జరగదు. గీత దాటితే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి’’ అని తెలిపారు. ఒకప్పుడు సుభిక్ష పాలనకు ఆదర్శంగా ఉన్న ఏపీ.. వైసీపీ ఐదేళ్ల పాలనలో ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనంగా మారిందని విమర్శలు గుప్పించారు.

నేర్చుకోవడానికి సిద్ధం

చంద్రబాబు విజన్‌ను నిజం చేయడానికి కష్టపడటానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని పవన్ కల్యాణ్ అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని కాపాడటానికి, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనాధ్యక్షత, అనుభవం, దార్శనికతను నేర్చుకోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. రాజ్యాంగాన్ని కాపాడటంలో చంద్రబాబు మార్గదర్శకత్వం అందిస్తారని భావిస్తున్నాం. ఈ క్రమంలో మా తరపున ఏమైనా తప్పులు ఉంటే అధికారులు జంకకుండా వాటిని మాకు తెలియజేయాలి. వాటిని మేము తప్పకుండా సరిదిద్దుకుంటాం. ప్రత్యేకించి మా మంత్రుల శాఖలో ఏవైనా లోపాలు కనిపస్తే మా దృష్టికి తీసుకురండి. వాటిని పరిష్కరిస్తాం’’ అని అధికారులకు సూచించారు.

అన్ని గ్రామాలకు తాగునీరు

‘‘రాష్ట్రంలోని ఏ గ్రామం కూడా తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడక సాగించకూడదు. దానిని అరికట్టే దిశగా చర్యలు చేపడతాం. ప్రతి ఒక్కరికీ తాగునీరు ఇంటికే అందించేలా కొళాయి కలెక్షన్‌లు ఏర్పాటు చేయడమే మా లక్ష్యం. ఇందులో భాగంగా 5,40,000 కుళాయిలను అందించాలన్న టార్గెట్ పెట్టుకున్నాం. నైపుణ్య గణన కోసం అధికారుల సలహాలు, సూచనలు అవసరం. వికసిత్ ఆంధ్రప్రదేశ్ సాధించడం కోసం అధికారులు చేసే ప్రతి సూచన చాలా ముఖ్యం. కావున ప్రతి అధికారి కూడా తమ సూచనలు అందించడానికి వెనకడుగు వేయొద్దు’’ అని కోరారు.

పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్ట్

‘‘ఐదేళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జవాబుదారీతనంతో ఉండే ప్రభుత్వం వచ్చింది. ప్రజలకు మేలు చేయడమే లక్ష్యంగా మా కార్యనిర్వహణను సిద్ధం చేస్తున్నాం. అందులో భాగంగానే గ్రామసభలు ఏర్పాటు చేస్తాం. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కూటమి సర్కార్ కసరత్తులు చేస్తోంది. ఇది ఒక మహత్కార్యం. దీనిని పిఠాపురం నుంచి పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభిస్తాం. అక్కడి నుంచి రాష్ట్రవ్యాప్తంగా దీనిని కొనసాగిస్తాం. ఇందులో భాగంగానే 4781 కిలోమీటర్ల రోడ్లు వేయాలని నిర్ణయించి.. ఆదిశగా చర్యలు తీసుకుంటున్నాం’’ అని వెల్లడించారు.

Tags:    

Similar News