క్షతగాత్రులను పరామర్శించిన చంద్రబాబు.. ఆందోళనలో కార్మిక సంఘాలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నంలోని మెడికోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్రమాదంలో గాయపడిన వారు అక్కడే చికిత్స పొందుతున్నారు.

Update: 2024-08-22 07:44 GMT

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. విశాఖపట్నంలోని మెడికోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. అచ్యుతాపురం ఫార్మా సెజ్ ప్రమాదంలో గాయపడిన వారు అక్కడే చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా వారిని పరామర్శించడానికి సీఎం అక్కడకు చేరుకున్నారు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏడుగురు క్షతగాత్రుల ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారికి అందించే వైద్యం విషయంలో రాజీ పడొద్దని, ఎంత ఖర్చయినా ప్రభుత్వం భరిస్తుందని భరోసా ఇచ్చారు. అనంతరం క్షతగాత్రులకు, వారి కుటుంబీకులను కలిసి మాట్లాడారు. వారికి మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని వారికి భరోసా ఇచ్చారు. అంతేకాకుండా వారికి అందుతున్న వైద్యం గురించి కూడా వారిని కనుక్కున్నారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.

అధికారులతో ప్రత్యేక సమావేశం..

మరికాసేపట్లో చంద్రబాబు.. పేలుడు ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించనున్నారు. అక్కడ జరుగుతున్న దర్యాప్తుపై అధికారులతో మాట్లాడనున్నారు. ప్రమాదం జరగడానికి అసలు కారణంపై ఆయన అధికారులతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాధ్యులను వదిలి పెట్టొద్దని, ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు చేసిన నివేదిక కోరనున్నట్లు తెలుస్తోంది.

‘బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలి’

మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం అందిస్తామన్న కలెక్టర్ ప్రకటనపై కార్మిక సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. కానీ ఇలాంటి ప్రమాదాలు పునరావృత్తం కాకుండా సరైన చర్యలు చేపట్టాలని, పరిహారం అందించి చేతులు దులుపు కోవడం సరైన పద్దతి కాదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా క్షతగాత్రులకు కూడా కంటితుడుపు చర్యగా ఏదో కొంత మొత్తాన్ని అందించడం కాకుండా.. వారికి ఇతర అవకాశాలు కల్పించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. క్షతగాత్రులకు పరిహారంతో పాటు వారికి వేరే ప్రాంతాల్లో ఉపాధి అందించే దిశగా చర్యలు చేపట్టాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. మరి వారి డిమాండ్లపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News