రతన్‌ టాటా మృతికి ఏపీ క్యాబినెట్‌ సంతాపం

ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్ రతన్‌ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. గురువారం క్యాబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది. రతన్‌ టాటా మృతి చెందిన నేపథ్యంలో వాయిదా వేసింది.

Update: 2024-10-10 09:00 GMT

అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ రతన్‌ టాటా మృతికి సంతాపం ప్రకటించింది. మంత్రి వర్గ సమావేశమైన వెంటనే రతన్‌ టాటా మృతికి నివాళులు అర్పించి మంత్రి వర్గంలో చర్చించాల్సిన అజెండాలోని అంశాలను వాయిదా వేసింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ అమరావతి నుంచి బయలుదేరి ముంబాయి వెళ్లారు. రతన్‌ టాటా పార్థీవ దేహానికి వీరు నివాళులు అర్పిస్తారు.

ముంబాయిలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో రతన్‌ టాటా పార్థీవ దేహాన్ని ప్రముఖులు, ప్రజల సందర్శనార్థం ఉంచారు. మధ్యాహ్నం 3:30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం అవుతుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో రతన్‌ టాటాకు అంత్యక్రియలు నిర్వహించనుంది. సచివాలయంలోని క్యాబినెట్‌ హాలులో రతన్‌ టాటా చిత్ర పటాన్ని ఉంచి తొలుత సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. తర్వాత మంత్రులందరూ నివాళులు అర్పించారు. రతన్‌ టాటా గొప్ప పారిశ్రామిక వేత్తని, సంపాదించడమే ధ్యేయంగా కాకుండా పది మంది అభివృద్ధి బాటలో పయనించాలని కోరుకున్న వారిలో ఈయన ఒకరని పలువురు మంత్రులు పేర్కొన్నారు.

ముందుగా నిర్ణయించిన ప్రకారం గురువారం ఆంధ్రప్రదేశ్‌ క్యాబినెట్‌ సమావేశం జరగాల్సి ఉంది. చెత్త పన్ను రద్దు, దీపావళికి మూడు ఉచిత గ్యాస్‌ సిలీండర్లు, కొత్త మునిసిపాలిటీలలో పోస్టు భర్తీ, దేవాలయాలకు పాలక మండళ్ల నియామకాలు, ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలల కాలానికి బడ్జెట్‌ ప్రవేశ పెట్టడం వంటి పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. అయితే రతన్‌ టాటా మరణం నేపథ్యంలో అజెండాలోని అంశాలను వాయిదా వేసి సమావేశాన్ని ముగించారు.
Tags:    

Similar News