మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్
బాలకృష్ణ కూడా ఓ పురస్కారాన్ని అందుకున్నారు. అబుదాబిలో ఐఐఏఫ్ 2024 అవార్డుల ఫంక్షన్ జరుగుతోంది.
సినీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి మరో ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకున్నారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అవార్డును తన ఖాతాలో జమ చేసుకున్నారు. సినీరంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఐఐఎఫ్‌ఏ 2024 పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డుల ప్రధానం ఫంక్షన్ ప్రస్తుతం అబుదాబి వేదికగా ఘనంగా జరుగుతోంది. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి, సినిమాలకు ఈ అవార్డులను ప్రధానం చేస్తారు. ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా కేటగిరీ కింద ప్రధానం చేసే అవార్డు ఈ ఏడాదికి గాను చిరంజీవిని వరించింది. ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండియన్ సినిమా అవార్డును ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్‌కు, ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సమంతకు, గోల్డెన్ లెగసీ అవార్డును బాలకృష్ణకు, ఔట్ స్టాండింగ్ ఎక్సెలెన్స్ అవార్డును రిషబ్ శెట్టికి అందించారు. ఇక ఉత్తమ చిత్రం కింద దసరా ఎంపిక కాగా, ఉత్తమ నటుడుగా నాని పురస్కారాలను అందుకున్నారు. ఉత్తమ విలన్‌గా దసరలో నటించిన షైన్ టామ్ అవార్డును అందుకున్నారు. ఉత్తమ చిత్రం(తమిళం)గా జైలర్, ఉత్తమ నటుడుగా(తమిళం) విక్రమ్(పొన్నియిన్ సెల్వన్ 2), ఇదే సినిమాలో నటించిన ఐశ్వర్యారాయ్‌కి ఉత్తమ నటిగాను, ఇదే సినిమా డైరెక్టర్ మణిరత్నంకు ఉత్తమ డైరెక్టర్‌గాను, మ్యూజిక్ అందించినందుకు ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఏఆర్ రెహమాన్‌కు అవార్డులు అందించారు. ఉత్తమ విలన్(తమిళం) ఎస్‌జే సూర్య, ఉత్తమ విలన్(కన్నడ)లో తెలుగు నటుడు జగపతిబాబు, ఉత్తమ సహాయ నటుడు(తమిళం) జయరామ్ అవార్డులు అందుకున్నారు.