రక్తం మరిగిన ఘాట్ రోడ్‌లో.. కారు టైర్ పేలి ఘోర ప్రమాదం..

చిత్తూరు జిల్లా రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. నిన్నటికి నిన్న.. ఎదురు రోడ్డులో వస్తున్న బస్సును అతివేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.

Update: 2024-09-14 08:21 GMT

చిత్తూరు జిల్లా రోడ్లు రక్తమోడుతున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక రోడ్డు ప్రమాదం జరుగుతూనే ఉంది. నిన్నటికి నిన్న.. ఎదురు రోడ్డులో వస్తున్న బస్సును అతివేగంగా వస్తున్న లారీ ఢీకొన్న ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈరోజు కారు టైరు పేలడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తుదిశ్వాస విడిచారు. ఈ ఘటన బెంగళూరు-చిత్తూరు హైవేలో మొగిలి దగ్గర జరిగింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని రోడ్డును క్లియర్ చేసే పనులు ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు.

అసలేం జరిగిందంటే..

చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండల కేంద్రం నుండి అరగొండకు వేళ్ళు రహదారి (బెంగళూరు చెన్నై జాతీయ రహదారి) ప్లైఓవర్ బ్రిడ్జిపై ఇన్నొవా కారు టైరు పేలింది. దీంతో కారు అదుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ఇద్దరు మరణించారు. మిగిలిన ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్య సిబ్బంది నుంచి అందుతున్న సమాచారం.

ప్రమాదాలకు కేరాఫ్‌గా ఘాట్ రోడ్లు

ఘాట్ రోడ్లంటే ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఘాటు రోడ్‌లలో జరుగుతున్న ప్రమాదాలు అధికంగానే ఉంటున్నాయి. ప్రతి రోజూ ఎక్కడో ఒక చోట ఘాట్‌రోడ్‌లో ప్రమాదం జరిగడం ప్రాణాలు పోవడం జరుగుతూనే ఉంది. భారీ ట్రాఫిక్, అతివేగానికి కాస్తంత నిర్లక్ష్యం కూడా జోడీ కావడంతోనే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని అధికారులు భావిస్తున్నారు. వాటిని కట్టడి చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం అంతంత మాత్రంగానే ఉంటుందని, అవగాహన ఉన్న వారు కూడా అతివేగంగా డ్రైవ్ చేస్తున్నారని, కొందరు వారు వేగంగా డ్రైవ్ చేస్తూ ఇతరుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నారని అధికారులు ఆందోలన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై అతి త్వరలోనే ప్రత్యేక సమీక్ష కూడా నిర్వహించాలని చూస్తున్నట్లు సమాచారం.

మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు..

చిత్తూరు జిల్లాలో మూడు రోజుల్లో మూడు ప్రమాదాలు జరిగాయి. ఈ మూడు ప్రమాదాలు కూడా ఘాట్ రోడ్లలోనే జరగడం గమనార్హం. ఈ ప్రమాదాలు ఘాట్‌ రోడ్ ప్రయాణించాలంటే భయపెట్టేలా ఉన్నాయి. ఈనెల 12న టమాటా లోడ్‌తో వెళ్తున్న లారీ.. మలుపు దగ్గర అదుపుతప్పి పక్కనే ఉన్న కారుపై పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు మదుర్మణం పాలయ్యారు. ఈ నెల 13న పలమనేరు పరిధిలోని మొగిలి ఘాట్ రోడ్‌లో బస్సును ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఎనిమిది మంది మరణించారు. మరో 30 మంది గాయపడ్డారు. ఈరోజు తిరుపతి వెళ్లొస్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు టైరు పేలడంతో ప్రమాదం జరిగి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస ప్రమాదాల నేపథ్యంలో చిత్తూరు ఘాట్ రోడ్లపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులు బావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News