ఆంధ్రాలో రేపట్నుంచే మోతమోగే రిజిస్ట్రేషన్ చార్జీల అమలు

ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగనుంది. పన్నుల భారం ప్రజలపై ఉండదంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఓ రేంజ్ లో చార్జీలు పెంచింది.;

Update: 2025-01-31 03:04 GMT
ఆంధ్రప్రదేశ్ లో భూముల రిజిస్ట్రేషన్ చార్జీల మోత మోగనుంది. పన్నుల భారం ప్రజలపై ఉండదంటూనే చంద్రబాబు ప్రభుత్వం ఓ రేంజ్ లో చార్జీలు పెంచింది. కొత్త మార్కెట్ విలువలు 2025 ఫిబ్రవరి 1 అంటే రేపు శనివారం నుంచే అమల్లోకి రానున్నాయి. రిజిస్ట్రేషన్ విలువల హేతుబద్ధీకరణ పేరిట పెంచిన ధరలపై సామాన్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నా.. తప్పని పరిస్థితుల్లో చార్జీలు పెంచినట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చార్జీల పెంపు మరో 24 గంటల్లో అమల్లోకి రానున్న నేపథ్యంలో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బాగా రద్దీ ఏర్పడింది.
రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొత్త మార్కెట్‌ విలువలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. ఆయా ప్రాంతాల అభివృద్ధి ప్రతిపాదికన 10% నుంచి 20% వరకు ఇవి పెరిగాయి. కొన్నిచోట్ల పెంపు బాగా ఎక్కువగానే ఉంది.
భూములతోపాటు నిర్మాణాల విలువల పెంపు కూడా ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన వివరాలనూ రిజిస్ట్రేషన్ల శాఖ సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయాలకు పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిర్మాణాల విలువలపై సగటున 6% శాతం వరకు పెంపు ఉంది. కొత్త మార్కెట్‌ విలువల అమలుకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖను ఆదేశించింది.
రిజిస్ట్రేషన్‌ విలువల పెంపును దృష్టిలో పెట్టుకొని.. క్రయ, విక్రయదారులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వద్ద రద్దీ నెలకొంది. రాష్ట్రమంతటా అదే పరిస్థితి నెలకొన్నప్పటికీ విశాఖ, కాకినాడ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, ఇతర నగరాల్లో బాగా రద్దీ కనపించింది.
రోజూ సగటున 40 రిజిస్ట్రేషన్లు ఉండే కార్యాలయాల్లో 60, 80 చొప్పున వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దస్తావేజులు పెరిగిపోవడంతో సర్వర్‌పై ఒత్తిడి పెరిగింది. రిజిస్ట్రేషన్ల నిర్వహణకు అధిక సమయం పట్టింది. చలానాల చెల్లింపులకూ నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో క్రయ, విక్రయదారులు అవస్థలు పడ్డారు.
నిర్మాణాల విలువలు సైతం..
ఇకపై జనం ఎక్కడ ఇల్లు కట్టుకోవాలన్నా వేలల్లోనే ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మేజర్ పంచాయితీలు, పంచాయితీలు అనే మినహాయింపు లేకుండా ఈ పెంపు సర్వత్రా ఉంది. నివాస భవనాల విభాగంలో.. అపార్టుమెంట్‌ ఫ్లాట్ అయి ఉండి, గ్రౌండ్‌+ఫస్ట్‌+సెకండ్‌ ఫ్లోర్‌ నిర్మించాలనుకుంటే చదరపు అడుగుకు రూ.1,490, రూ.1,270, రూ.900ల చొప్పున ఖరారు చేశారు. ఇదేవిధంగా మూడో అంతస్తు ఆపైన వాటికి అదనంగా రూ.30, రూ.25, రూ.20గా నిర్ణయించారు.
వాణిజ్య భవనాల విభాగంలో.. గ్రౌండ్‌ ఫ్లోర్‌కు రూ.1,800, రూ.1,540, రూ.1,060 (చదరపు అడుగుకు) చొప్పున నిర్ణయించారు. మొదటి అంతస్తుకు రూ.1,700 రూ.1,480, రూ.1,010, రెండో అంతస్తు, ఆ పైన ప్రతి ఫ్లోర్‌కు రూ.1,590, రూ.1,380 రూ.950 చొప్పున చెల్లించాలి. సినిమా హాళ్లు, కర్మాగారాలకు చదరపు అడుగుకు రూ.950 రూ.880 రూ.690 చొప్పున ఖరారు చేశారు.
పెంకుటిల్లు, రేకుల షెడ్లు, ఇతర వాటికి రూ.740, రూ.580 రూ.420, చవిటి మిద్దెలకు రూ.420, రూ.320, రూ.240 చొప్పున (చదరపు అడుగుకు) ఖరారు చేశారు. వీటితోపాటు మరికొన్ని నిర్మాణాల విలువలు కూడా పెరిగాయి.
భూముల రిజిస్ట్రేషన్ చార్జీలు, నిర్మాణ చార్జీలు ఒకేసారి పెరగడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల నాయకులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Tags:    

Similar News