'ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి-పోలవరం కాదు, అందరి ప్రదేశ్'
రాయలసీమపై ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తోందని పలు సంఘాల నాయకులు ఆరోపించారు. నంద్యాలలో రాయలసీమ సౌకర్యాల కోసం ర్యాలీ చేశారు.;
AP అంటే అమరావతి పోలవరం కాదు.. ఇది "అందరి ప్రదేశ్" అని పాలకులు గుర్తెరగాలని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమలో మరమ్మతులకు నోచుకోక శిథిలావస్థలో వున్న ప్రాజెక్టులకు నిధులు లేవని చెబుతున్న ప్రభుత్వం, అమరావతిలో వందల కోట్లు ఖర్చుతో నూతన రిజర్వాయర్లను నిర్మించేందుకు నిర్ణయించడం పట్ల రాయలసీమ సమాజం ఆగ్రహం వ్యక్తం చెస్తోందన్నారు. దశరథరామిరెడ్డి మాట్లాడుతూ పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు 80 tmc ల నీరందిస్తున్న నేపథ్యంలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వవలసిన అవసరం లేదన్నారు.
నాగార్జునసాగర్ - ప్రకాశం బ్యారేజి మధ్యన కృష్ణానది ఉప నదులైన పాలేరు, మున్నేరు, మూసీల నుంచి వచ్చే కృష్ణా జలాలు నిలువ ఉంచుకోవడానికి కృష్ణా డెల్టాకు పులిచింతల రిజర్వాయర్ వుందని చెప్పారు. ఈ నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం శ్రీశైలం రిజర్వాయర్ లో విద్యుత్ ఉత్పత్తి నాగార్జునసాగర్ ఆయకట్టుకు హక్కుగా కేటాయించిన కృష్ణా జలాల పరిమాణానికి లోబడే నీటి విడుదల చేయవలసి వుండగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి వందలాది tmc ల నీటిని దిగువకు విడుదల చేస్తూ శ్రీశైలం రిజర్వాయర్ ను ఎండగడుతూ రాయలసీమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని బొజ్జా మండిపడ్డారు.
శ్రీశైలం రిజర్వాయర్ కనీస నీటిమట్టం 854 అడుగులుగా KRMB రూల్ కర్వ్ ని రూపొందించిందని, క్యారీ ఓవర్ గా 60 tmc లను శ్రీశైలం ప్రాజెక్టులో నిలువ ఉంచుకునే హక్కును బచావత్ ట్రిబ్యునల్ కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ దశాబ్దాలుగా ఏనాడు కూడా శ్రీశైలం ప్రాజెక్టు విధి విధానాలను ఏ ప్రభుత్వం కూడా పాటించలేదని దుయ్యబట్టారు. జనవరి 6, 2021, జులై 6, 2021న విజయవాడలో అఖిలపక్ష సమావేశంలో కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని చేసిన ఏకగ్రీవంగా తీర్మానానికి ఆ నాడు తెలుగుదేశం పార్టీ కూడా పూర్తి మద్దతు ఇచ్చిందన్నారు. నేడు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే మాట మార్చి విజయవాడలో KRMB ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో రాయలసీమ సమాజం దిగ్భ్రాంతికి గురైందని అన్నారు.
2025 ఫిబ్రవరి 9, 10 తేదీలలో విజయవాడలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను CPI రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుకు విపులంగా తెలియచేయడం జరిగిందని, అందులో భాగంగా కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని మంత్రిని కోరామని తెలిపారు. అయితే అఖిలపక్ష నాయకులు చేసిన విజ్ఞప్తిని ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా KRMB ని విజయవాడలో ఏర్పాటు చేస్తామని ఏకపక్షంగా ప్రకటించిన ప్రభుత్వ చర్యను తీవ్రంగా తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశలు, ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే గానీ ఏకపక్ష నిర్ణయాలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు.
రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి పాలకులు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చి నియంతలా వ్యవహరించడం మంచి పరిణామం కాదనీ, ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలను గౌరవించి నిర్ణయాలను తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
కృష్ణానది జలాల పర్యవేక్షణలో అత్యంత క్రియాశీలకంగా వున్న శ్రీశైలం ప్రాజెక్టు ఉన్న కర్నూలులోనే కృష్ణానది యాజమాన్య బోర్డును ఏర్పాటు చేయాలని రాయలసీమ సమాజం కోరుకుంటున్నదని, అందుకు విరుద్ద చర్యలు పాలకులు తీసుకుంటే రాయలసీమ వ్యాప్తంగా ఉద్యమం చేపడుతామని బొజ్జా హెచ్చరించారు.
కర్నూలులో కృష్ణా బోర్డు కావాలని నంద్యాలలో ర్యాలీ
కృష్ణానది యాజమాన్య బోర్డును కర్నూలులో ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ సాగునీటి సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నంద్యాలలో వందలాది మంది రైతులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి వైఎస్సార్సీపీ, సిపిఐ, సిపిఎం, ముస్లిం లీగ్, ఎఐకెయస్ తో పాటు రైతు, వాణిజ్య, వర్తక, కార్మిక సంఘాలతో పాటు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించి ర్యాలీలో పాల్గొన్నారు. నంద్యాలలో పెద్ద బండ దగ్గర ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం నుండి గాంధీ చౌక్ కల్పనా సెంటర్ శ్రీనివాస నగర్ సెంటర్ మీదుగా తాలూకా ఆఫీస్ కార్యాలయం వరకు జరిగిన ర్యాలీలో పలు సెంటర్స్ లో రాజకీయ పార్టీ ప్రతినిధులు ప్రజా సంఘాల ప్రతినిధులు వెనకబడిన ప్రాంతాలపై ప్రభుత్వ ఆలక్ష్యాన్ని తీవ్రంగా నిరసించారు. రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రజా సంఘాలకు అడుగడుగునా స్థానిక ప్రజలు స్వాగతం పలకడమే కాకుండా అనేక ప్రదేశాల్లో మంచి నీళ్లు, మజ్జిగ ఏర్పాటు ప్రజల ఆశల, ఆకాంక్షల స్థాయిని తెలుపుతుందని వక్తలు పేర్కొన్నారు. ర్యాలీ సందర్భంగా పెల్లుబికిన ప్రజల ఆశల, ఆకాంక్షలను ప్రభుత్వం అర్థం చేసుకొని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి దోహదపడుతుందన్న భావనను ఈ సందర్భంగా వక్తలు వ్యక్తపరిచారు.
ర్యాలీ అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేరిట రాసిన లేఖను నంద్యాల తహశీల్దారు ప్రియదర్శిని కి అందించారు. ర్యాలీలో సమితి ఉపాధ్యక్షులు వైయన్ రెడ్డి, CPI నాయకులు రంగనాయకులు, CPM రాజశేఖర్, రైతు నాయకులు ఉప్పలపాటి బాలీశ్వరరెడ్డి, బెక్కం రామసుబ్బారెడ్డి, MC కొండారెడ్డి, IML పార్టీ నాయకులు సలాం, వైఎస్సార్సీపీ నాయకులు సోమశేఖర రెడ్డి, జానో జాగో ముస్లిం వేదిక జాతీయ కార్యదర్శి సయ్యద్ మహబూబ్ భాష, క్రిష్టియన్ JAC నాయకులు జాన్, వ్యాపార సంఘం నాయకులు సత్యనారాయణ, న్యాయవాదులు శంకరయ్య, నాగకృష్ణారెడ్డి, కరిమద్దెల ఈశ్వరరెడ్డిలతో పాటు అనేక ప్రజా సంఘాలు, రైతులు పాల్గొన్నారు.