ఈ రోజు రెన్యూపవర్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు పునాదిరాయి భారతదేశ క్లీన్ ఎనర్జీ విప్లవానికి పునాదిరాయి లాంటిదని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం బేతపల్లి గ్రామంలో రెన్యూ పవర్ సంస్థ స్థాపించనున్న రూ.22వేలకోట్ల విలువైన 4.8 గిగావాట్ల హైబ్రిడ్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టుకు శుక్రవారం లోకేష్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... రెన్యూ పవర్ వారి పునరుత్పాదక ఇంధన సముదాయ ప్రారంభోత్సవం సాహసోపేతమైన నిర్ణయానికి, స్థిరమైన ప్రగతికి చిహ్నమని అన్నారు. రూ.22వేల కోట్ల పెట్టుబడితో చేపట్టే ఈ ప్రాజెక్ట్ గ్రిడ్‌లకు శక్తినివ్వడమే కాకుండా... నిరుద్యోగ యువత ఆశయాలకు ఆజ్యం పోస్తుంది, రేపటి వెలుగుకు దారి చూపుతుందని, భావితరాల కోసం ఒక ఉన్నత లక్ష్యంతో పని చేస్తున్నామని వెల్లడించారు.
ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి బ్లూ ప్రింట్
భారతదేశంలో గ్రీన్ పవర్ హౌస్ గా మారుతున్న ఆంధ్రప్రదేశ్ పై నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చిన రెన్యూ చైర్మన్, సిఇఓ సుమంత్ సిన్హా, సంస్థ బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. విజనరీ లీడర్ చంద్రబాబు కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాలను మాత్రమే నిర్మించడం లేదు, రేపటితరం భవిష్యత్తుకు బంగారుబాటలు వేస్తున్నారు. ఆ దార్శనికుడి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ట్రెండ్ ను ఫాలో కావడం లేదు, ట్రెండ్ సెట్ చేస్తోందని అన్నారు.
రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో దూసుకు పోతున్నాం
పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు సంబంధించి 2024లో మేం ఒక ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. 2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక శక్తిని సాధించాలన్నది తమ లక్ష్యమన్నారు. కేవలం 8నెలల వ్యవధిలో క్లీన్ ఎనర్జీ దిగ్గజాలను రాష్ట్రానికి రప్పించగలిగాం. టాటా పవర్ 49,000 కోట్లతో 7వేల మెగా వాట్లు, ఎన్‌టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ 1.86 లక్షల కోట్లు, వేదాంత సెరెంటికా రూ. 50,000 కోట్లతో వెయ్యి మెగా వాట్లు, సెయిల్ ఇండస్ట్రీస్ రూ 6వేల కోట్లతో 1,200 మెగా వాట్లు, బ్రూక్‌ఫీల్డ్ రూ. 50వేల కోట్లతో 8వేల మెగా వాట్లు కోసం ముందుకొచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పై ఆయా కంపెనీల నమ్మకంతోపాటు గ్రీన్ ఎనర్జీ లక్ష్యాల సాధనకు ఏపీ సిద్ధంగా ఉందనడానికి ఇది నిదర్శనమన్నారు. అనంతపురం రెన్యూ పునరుత్పాదక ఇంధన కాంప్లెక్స్ రెండు దశల్లో నిర్మితమవుతుంది. తొలిదశలో రెన్యూ సంస్థ 587మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై రూ.7 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. వివిధ దశల్లో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల సామర్థ్యంగల బ్యాటరీ స్టోరేజి యూనిట్లపై మొత్తంగా రూ. 22 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సముదాయం పెద్దఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది. వీటి వల్ల ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను శక్తివంతం చేస్తుందని లోకేష్ అన్నారు.
త్వరలో రాయలసీమకు హైకోర్టు బెంచి తెస్తాం
త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచి తీసుకువస్తాం, బెంచి ప్రారంభానికి ప్రధాని మోదీని రాయలసీమకు తీసుకొస్తాం. ఏపీ ప్రజల అన్ని కోర్కెలను మోదీ తీరుస్తున్నారు. 2014 రాష్ట్రవిభజన తర్వాత మనల్ని కట్టుబట్టలతో హైదరాబాద్ నుంచి గెంటేశారు. అనంతపురానికి కియా, జాకీ వంటి పరిశ్రమలను చంద్రబాబు తెచ్చారని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో యువతకు అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యసాధనలో భాగంగానే ఈనాడు రెన్యూ ప్రాజెక్టును తెచ్చాం. దీనిద్వారా 10వేలమంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మెగా డిఎస్సీ ద్వారా వచ్చే నెలలోనే 16,347 టీచర్ ఉద్యోగాలను భర్తీచేస్తాం. రెన్యూ వంటి పెద్ద పరిశ్రమలను స్థానిక ప్రజలు ఆహ్వానించాలి. ఇటువంటి సంస్థల వల్ల మన బిడ్డలకు ఉద్యోగాలు లభిస్తాయి.
రెన్యూ సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా మాట్లాడుతూ... రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో ఈరోజు కొత్త శకానికి నాంది పలికాం. విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలో పెట్టుబడిదారులకు అనుకూలమైన విధానాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ముందుకు దూసుకు వెళ్తోంది. మోదీ వికసిత్ భారత్ లక్ష్యానికి చంద్రబాబు విజన్ తోడైంది. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు ఆశయ సాధనలో భాగస్వాములు కావడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఏపీ సింగిల్ విండో అనుమతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపుతున్నాయి. ఇక్కడ రూ.22వేల కోట్లతో ఏర్పాటుచేస్తున్న ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ భారతదేశంలోనే అతిపెద్దది. రాష్ట్రంలో క్లీన్ ఎనర్జీ ఆధారిత ఇంధనాన్ని అభివృద్ధి చేయడానికి మా కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు తమదిగా భావించి స్థానిక రైతాంగం సహకరించాలి. మేం స్థాపించే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ ఎనర్జీ కాంప్లెక్స్ వల్ల యావత్ ప్రపంచం ఎపి వైపు చూస్తోందని సుమంత్ సిన్హా అన్నారు.