హెలికాఫ్టర్ కూలి అనంతపురం ఎంపీ చెల్లెలు మృతి

ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది.;

Update: 2025-05-08 12:10 GMT
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోవడంతో ఆరుగురు మరణించారు. ఉత్తరకాశీ (Uttarkashi) జిల్లాలోని గంగానాని సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారిగా గుర్తించారు. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు అధికారులు నిర్ధరించారు.

వేదవతి భర్త భాస్కర్‌ గాయాలతో బయటపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం రుషికేశ్‌ ఎయిమ్స్‌కు తరలించారు.
చార్‌ధామ్ - యమునోత్రి, గంగోత్రి, కేధార్‌నాథ్, భద్రీనాథ్- దర్శించుకునేందుకు వెళ్లిన పర్యాటకులు ఇలా దుర్మరణం చెందడం పట్ల ఉత్తరాఖండ్ ప్రభుత్వం ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది. మే 2వ తేదీ నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఈయాత్రకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల నుంచి పర్యాటకులు పెద్ద ఎత్తున ఉత్తరాఖండ్‌కు వస్తున్నారు. ఈ యాత్రకు చాలా మంది హెలీకాప్టర్‌ను ఉపయోగిస్తుంటారు. అందులో భాగంగా ఏడుగురు యాత్రికులు ప్రైవేట్ హెలీకాప్టర్‌లో వెళుతుండగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగానాని సమీపంలో ఒక్కసారిగా హెలీకాఫ్టర్ కుప్పకూలిపోయింది. చార్‌ధామ్ యాత్ర ప్రారంభైన 5 రోజులకే ఈ ఘటన జరగడంతో తీవ్ర విషాదం నెలకొంది. వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీస్ అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.
Tags:    

Similar News