గిరిజనుల కోసం మహాప్రస్థానం అంబులెన్స్‌గా.. తన వాహనాన్ని మార్చిన ఓ ఎమ్మెల్యే
ఏజెన్సీ ఏరియాల్లో ఆసుపత్రులకు వెళ్లడమే కాదు.. దురదృష్ట వశాత్తు అక్కడ చనిపోయిన వారిని తీసుకొని రవాడమూ గగనమే. ఆ శవాలను తరలించేందుకు ఎవ్వరూ ముందుకు రారు. వచ్చినా.. వేలువేలు అడుగుతారు. దీనికొ శాశ్వత పరిష్కారం చూపారు ఓ ఎమ్మెల్యే. ఆమె ఎవరు? ఎందుకు అలా చేశారు?
ఆంధ్రప్రదేశ్‌లోని ఏజెన్నీ ఏరియాలోని గిరిజనుల అందరూ అధికంగా పేదలే. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు కూడా వారి వద్ద డబ్బులు ఉండవు. అందుకే వారు ప్రభుత్వ ఆసుపత్రుల వైపు మొగ్గు చూపుతుంటారు. రంపచోడవరం ప్రాంతంలో అయితే ఇది ఎక్కువుగా ఉంటుంది. వారి సొంత ప్రాంతాల్లో అరాకొరా వైద్య సేవల కారణంగా, కాకినాడ, రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళేందుకు ఆసక్తి చూపుతుంటారు. అంత వరకు బాగానే ఉన్నా.. దురదృష్ట వశాత్తు అనారోగ్య కారణాల రీత్యా వారు అక్కడ మరణిస్తే, ఆ డెడ్ బాడీలను తమ సొంత గ్రామాలకు తెచ్చుకోవడం అంటే వారికి తలకి మించిన భారం.
మరణించిన వారి శవాలను తెచ్చుకునేందుకు వారు పడే తంటాలు వర్ణనాతీతం. ఇది వినడానికి చిన్న సమస్యగానే అనిపించినా రంపచోడవరం ప్రాంతపు గిరిజనులకు మాత్రం చాలా పెద్దదే. ఈ సమస్య రంపచోడవరం ప్రాంతపు గిరిజనులను పట్టి పీడిస్తోంది. ఏళ్ల తరబడి ఇది వారిని వెంటాడుతోంది. దీనికి చరమగీతం పాడాలని ఆ ప్రాంతపు ఎమ్మెల్యే భావించారు. దీని కోసం తమ సొంత వాహనాన్ని కేటాయించాలని నిర్ణయానికి వచ్చారు. తాము వాడుతున్న బొలెరో వాహనాన్ని అంబులెన్స్ మహాప్రస్థానంగా ఆ ప్రాంతపు గిరిజనులకు అందుబాటులోకి తెచ్చారు ఆ ఎమ్మెల్యే. ఆమె రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి.
రంపచోడవరం అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలో 11 మండలాలు ఉన్నాయి. అన్నీ ట్రైబల్ మండలాలే. గిరిజనులే నివాసం ఉంటారు. రంపచోడవరంలో ఏరియా ఆసుపత్రి ఉంది. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. పెద్దదిగా ఉన్నా పెద్దగా సౌకర్యాలు లేవు. అన్ని రకాల వ్యాధులకు సంబంధించి చికిత్సలు అందించడం కష్టమే. దీంతో అత్యవసర వైద్య సేవల కోసం, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న గిరిజనులు ఎక్కువుగా కాకినాడ, రాజమండ్రిలోని పెద్ద ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తుంటారు. వ్యాధులను నయం చేసుకొని తిరిగి వస్తుంటారు. అయితే దురదృష్ట వశాత్తు అక్కడ మరణించిన వారిని తీసుకొని రావడం కష్టం. దూరం ఎక్కువుగా ఉండటంతో అంబులెన్సు వాళ్ళు ముందుకు రావు. దీనికి తోడు బాడుగలు కూడా అధికంగానే ఉంటాయి. సగటున రూ. 15వేల నుంచి రూ. 25వేల వరకు ఖర్చు అవుతుంది. గ్రామాలకు ఉండే దూరాన్ని బట్టి ఆ రేట్లు ఇంకా ఎక్కువుగానే ఉంటున్నాయి. రూ. 30 వేల వరకు కూడా డిమాండ్ చేస్తుంటారు. దానిని భరించే ఆర్థిక స్థోమతలు గిరిజనులకు ఉండవు. దీని వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇది తమను ఎంతగానో ఆలోచింప చేసిందని, వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని ఎప్పటి నుంచో ఆలోచనలు చేస్తున్నట్లు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి ది ఫెడరల్‌కు తెలిపారు. దురదృష్ట వశాత్తు ఆసుపత్రుల్లో మరణించిన గిరిజనుల డెడ్ బాడీలను వారి బందువుల వద్దకు చేర్చి, చివరి చూపును చూసే అవకాశం కల్పించే దిశగా అడుగులు వేశారు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఉచితంగానే సేవలు అందుబాటులోకి తేవాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఈ అంబులెన్స్ ఏర్పాటు చేసి, తద్వారా గిరిజనులకు సేవలు అందించాలనే నిర్ణయానికి వచ్చినట్లు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషా దేవి తెలిపారు.