అమెరికా ఎన్నికలేంటో.. మన రూపాయి విలువ తగ్గడమేంటో..!
ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందానా అమెరికా అధ్యక్ష ఎన్నికలతో మన రూపాయి విలువ తగ్గింది. స్టాక్స్ మార్కెట్లు కుప్పకూలాయి.
By : The Federal
Update: 2024-11-04 06:44 GMT
అమెరికా ఎన్నికల ప్రభావం మన రూపాయిపైన పడింది. రూపాయి విలువ భారీగా పడిపోయింది. నిన్న మొన్నటి దాకా 82,83 రూపాయలుగా ఉన్న డాలర్ మారకం (DOLLOR-Rupee Exchange) విలువ నవంబర్ 4 నాటికి 84.1రూపాయలకు తగ్గింది. ఈ ప్రభావంతోనే ఇండియన్ స్టాక్ మార్కెట్లపైనా పడినట్టు కనిపిస్తోంది. వివిధ స్టాక్స్ మార్కెట్లలో (stock Markets)సెన్సెక్స్ పాయింట్లు బాగా పతనమైనట్టు ఈ ఉదయం నుంచి వార్తలందుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు మరో 24 గంటల్లో జరుగనున్నాయి. నవంబర్ 5న పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఈ నేపథ్యంలో దలాల్ స్ట్రీట్‌లో సూచీలు పడిపోయాయి. దీంతో దాదాపు 5లక్షల కోట్ల రూపాయలకుపైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. అత్యధికంగా పీవీఆర్ ఐనాక్స్, పాలీ మెడిక్యూర్, విల్టాప్ ట్రాన్స్‌ఫార్మర్స్, ఇమామీ షేర్లు నష్టపోయాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై కూడా స్టాక్ మార్కెట్ల హవా నడుస్తుంటుంది. బ్రోకర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టే ఇన్వెస్టర్లు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
మొత్తంగా చూసినపుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల స్టాక్ మార్కెట్లపై పడినట్టే కనిపిస్తోంది. ప్రస్తుతం బేరసారాలన్నీ ట్రంప్, హారిస్ గెలుపోటముల చుట్టూనే తిరుగుతున్నాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ గెలిస్తే మార్కెట్ బాగుంటుందని ఎంతమంది భావిస్తున్నారో హారిస్ గెలువాలనుకునే వారూ అంతే సంఖ్యలో ఉన్నారు. డెమోక్రాటిక్ పార్టీ విజయం సాధిస్తే మాత్రం సూచీల్లో కనీసం 5 శాతం సర్దుబాటు కొనసాగుతుందని, భారత మార్కెట్ సూచీల్లో 5శాతం విలువ మారే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి.
మరోపక్క, ఇజ్రాయెల్-ఇరాన్‌ల మధ్య పోరు పెరుగుతుండటంతో పీపా చమురు ధర సోమవారం రెండు శాతం వరకు పెరిగి 74 డాలర్లకు చేరింది. మన రూపాయి విలువ భారీగా పతనమైన జీవితకాల స్వల్ప ధర వద్ద ట్రేడవుతోంది. తాజాగా రూ.84.1 వద్దకు అది చేరింది. ముఖ్యంగా ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌ను వీడుతుండటంతో డాలర్లకు డిమాండ్ పెరిగి.. ఆ ప్రతికూల ప్రభావంతో రూపాయి విలువ పడిపోతోంది. విదేశీ పోర్టుఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐ) భారీగా పెట్టుబడులను ఉపసంహరిస్తుండటం సూచీలు పడిపోవడానికి మరో కారణంగా నిలిచింది.
మన రూపాయి విలువ తగ్గడం అమెరికాలో స్థిరపడిన ఇండియన్లను తీవ్రవిచారానికి గురి చేస్తోంది. మరో రెండు రోజులు కూడా ఇదే పరిస్థితి కొనసాగవచ్చునని భావిస్తున్నారు. అమెరికా ఎన్నికలేమో గాని ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చిందన్నట్టుగా మన ఇన్వెస్టర్లు లబోదిబోమంటున్నారు.