అంబటి రాయుడుపై సోషల్ మీడియా ’యుద్ధం‘
అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.;
By : The Federal
Update: 2025-05-09 07:37 GMT
పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పైన, ప్రస్తుతం నెలకొన్న ఇండియా–పాకిస్తాన్ యుద్ధ వాతావరణంపైన ప్రముఖ మాజీ క్రికెటర్ అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రస్తుతం అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
అంబటి రాయుడు ఏమన్నారంటే..
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇండియా–పాకిస్తాన్ యుద్ద పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్తత పరిస్థితులు భారత దేశాన్ని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పందించారు. సోషల్ మీడియా వేదికగా మూడు పోస్టులు పెట్టారు. తొలి పోస్టు కాస్త వివాదాస్పదంగా మారడంతో మరో రెండు పోస్టులు పెట్టారు.
కంటికి కన్ను సమాధానమైతే ప్రపంచం గుడ్డిది అవుతుంది అంటూ యుద్ధ పరిస్థితులను ఉద్దేశించి సోషల్ మీడియాలో తొలి పోస్టు పెట్టారు. ఇది కాస్త వివాదాస్పదంగా మారింది. ఉగ్ర మూకలను, వారి దాడులను, దుశ్చర్యలను నిలువరించకపోతే వారు ఇంకా రెచ్చి పోతారని, అందువల్ల ప్రతిఘటన అవసరమని, దీనిని అర్థం చేసుకోవాలని, అలా కాకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని నెటిజన్లు విమర్శలు చేయడంతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నెటిజన్ ల విమర్శలను, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు మరో రెండు పోస్టులు పెట్టారు. జమ్మూ కశ్మీర్, పంజాబ్‌తో పాటు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాలలో శాంతి భద్రతల కోసం నేను ప్రార్థన చేస్తున్నను. దాడులతో ప్రభావితమైన ప్రజలకు బలం, భద్రత, త్వరితిన పరిష్కారం లభించాలని నేను ఆశిస్తున్నాను.. జై హింద్ అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు. తర్వాత మరో పోస్టు పెట్టారు. ఇలాంటి ఉద్రిక్తత క్షణాల్లో భయంతో కాకుండా, దృఢ సంకల్పంతో, యూనిటీగా మనమంతా నిలబడదాం. ఎనలేని ధైర్యం, డిసిప్లెయిన్, నిస్వార్థతతో యావత్ భారత దేశ భారాన్ని మోస్తున్న మన భారత దేశం సైనికులకు నా కృతజ్ఞతలు. భారత దేశ సైనికుల త్యాగాలు తప్పకుండా గుర్తిస్తారు. సైనికుల ధైర్యమే మువ్వన్నెల భారత దేశ జెండా పతాకాన్ని ఎగురవేస్తుంది. సైనికుల పరాక్రమం, శౌర్యమే భారత దేశ సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. భారత సైనికుల పనితీరు భారత దేశం శాంతియుతతకు మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ.. భారత దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశ భద్రత కోసం, ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పోరాటం చేస్తున్న సైనికుల పనితీరుకు జేజేలు పలుకుతున్నట్లు అంబటి రాయుడు ఆ పోస్టులో పేర్కొన్నారు.
అయితే భారత దేశ సైనికులను, వారు చేస్తున్న పోరాటాలను మెచ్చుకుంటూ తర్వాత పెట్టిన రెండు పోస్టుల కంటే కంటికి కన్ను సమాధానమైనే ప్రపంచం గుడ్డిది అవుతుందని పెట్టిన పోస్టు మీద సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అంబటి రాయుడు ట్వీట్ వివాదాస్పదంగా మారింది.