అందరూ మెచ్చుకునేలా అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అందరూ మెచ్చేలా తయారవుతుందా? అందుకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ చర్యలు తీసుకుంటున్నారు. ఏమి చేయనున్నారు.

Update: 2024-06-20 12:53 GMT

ఆంధ్రప్రదేశ్‌ను అందరూ మెచ్చుకునేలా చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నడుం బిగించారా? అవుననే సమాధానం వస్తోంది. గత ప్రభుత్వం అమరావతి ప్రాంతాన్ని పట్టించుకోకుండా వదిలేయడంతో అసంతపూర్తి నిర్మాణాలైన భవనాలు, పలు కట్టడాలు చెదలు పట్టాయి. కొన్ని పనికి రాకుండా పోయాయి. మరికొన్ని మరమ్మతులతో బాగుపడుతున్నాయి. వైఎస్‌ జగన్‌ కక్షపూరిత రాజకీయాలకు సాక్ష్యంగా ప్రజావేదిక నిలిచింది. కృష్ణానది లోపలి భాగంలో నిర్మించిన అక్రమ కట్టడాలన్నీ కూల్చి వేస్తానని చెప్పిన నాటి సీఎం జగన్‌ ప్రజా వేదిక ఒక్కటి కూల్చి ఆ శిధిలాలు కూడా తొలగించకుండా అక్కడే వదిలేశారు. వీటన్నింటినీ గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిశీలించారు. అధికారులను అడిగి రాజధాని అమరావతి ప్రాంతంలో పరిస్థితులు తెలుసుకున్నారు.

Delete Edit

మొదట చంద్రబాబునాయుడు ఇంటిని ఆనుకుని శిధిలంగా ఉన్న ప్రజావేదిక కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూల్చడం వల్ల ప్రజలకు నష్టం జరిగిందే తప్ప జగన్‌కు కాదనే విషయం ప్రజలు అర్థం చేసుకున్నారనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అందుకే చిత్తుచిత్తుగా ఓడిపోయారనే విషయం చెప్పకనే చెప్పారు.

అక్కడి నుంచి నేరుగా ఉద్దండ రాయునిపాలెంలో సచివాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. శంకుస్థాపన సందర్భంగా పవిత్ర నదీజలాలు, పార్లమెంట్‌ వద్ద నుంచి మట్టిని తెచ్చి శంకుస్థాపన సమయంలో అక్కడ ఉంచారు. ఆ పవిత్రతే ఇప్పుడు అమరావతిని కాపాడిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం విశేషం. సచివాలయం శంకుస్థాపన చేసిన చోట మోకాళ్లపై సీఎం చంద్రబాబు మోకరిల్లాడు. భూమికి తలను ఆనించి భూమాతకు నమస్కరించారు. అనంతరం అక్కడి నుంచి పక్కకు జరిగి టెంకాయ కొట్టి పూజలు చేశారు. అంటే తిరిగి సచివాలయం పనులు మొదలవుతున్నాయనే సంకేతాలు ఇచ్చారు. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును పరిశీలించారు. రోడ్లకు ఇరువైపుల పెరిగిన పిచ్చిచెట్లను అధికారులు ఇప్పటికే కొంత మేర తొలగించారు. ఐఏఎస్‌ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల కోసం నిర్మించిన అసంపూర్తి నిర్మాణ భవనాలను పరిశీలించారు.
రాజధాని ప్రాంతంలో 2019కి ముందు జరిగిన అభివృద్ధి నాశనమైన తీరును పరిశీలించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులు చాలా మంది ఆ ప్రాంతానికి వచ్చారు. రాజధాని నిర్మాణం ఎలాగైతే మొదలవుతుందో పోలవరం నిర్మాణ పనులు కూడా అదే వేగంతో జరగాల్సి ఉంటుంది. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి, అమరావతి రాజధాని ఒక మంచి పరిపాలనా కేంద్రం అనే అభిప్రాయంలో రాష్ట్ర ప్రజలు ఉన్నారు. వారి నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు వమ్ము చేయకుండా ముందుకు సగుతున్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అమరావతి పరిశీలన కూడా పూర్తయింది. ఈనెల 24న మంత్రి వర్గ సమావేశంలో స్వేతపత్రాలు ఇవ్వాలని ఇప్పటికే ముఖ్యమంత్రి మంత్రులను ఆదేశించారు. అంటే అప్పటికే ఏశాఖ పరిస్థితి ఏమిటి? వాటిని బాగుచేసేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాల్సి ఉంటుందనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టం చేసే అవకాశం ఉంది.
Delete Edit
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతిని పరిశీలించిన అనంతరం అమరావతిలోని సీఆర్‌డీఏ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ అంటే అమరావతి, పోలవరం అన్నారు. ఈరెండింటినీ రాజకీయ లక్షణాలు లేని జగన్‌ నాశనం చేశాడన్నారు. 1631 రోజులు అమరావతి కోసం ఉద్యమం చేసిన రైతులను ఆయన అభినందించారు.
పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుంది. అందుకోసం విభజన చట్టం తోడ్పాటు తీసుకున్నాం. పోలవరాన్ని వైకాపా ప్రభుత్వం గోదారిలో కలిపేసింది. రాష్ట్రానికి వరంగా మారాల్సిన పోలవరం శాపంగా మారింది. రాజకీయాలకు పనికిరాని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో గత అయిదేళ్లు ప్రత్యక్షంగా చూశాం. అమరావతి ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాదు. కేంద్ర నిధులతో పోలవరం కట్టి, ఇక్కడి నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటే సాగునీటి రంగానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చంద్రబాబు చెప్పారు.
పవిత్ర జలాలు, మట్టి తీసుకొచ్చి ప్రధాని శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే మనల్ని కాపాడింది. పవిత్ర మట్టి చూసిన తర్వాత అదే అనిపించింది అన్నారు చంద్రబాబు. ఐకానిక్‌ కట్టడాలన్నీ నిలిచిపోయాయి. ఎలాంటి మార్పు చేయలేదు. పూర్తి కావాల్సిన ఎన్నో పనులు నిలిపివేశారన్నారు. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడారు. అయిదేళ్ల తర్వాత మీ రాజధాని ఏది అని అడిగితే చెప్పుకోలేని పరిస్థితికి తీసుకొచ్చారు. అమరావతి, పోలవరం మాకేం సంబంధం అనుకోవద్దు. తెలుగుజాతి గర్వంగా తలెత్తుకునేలా రాజధాని నిర్మాణం ఉండాలి. కర్నూలును ఆధునిక నగరంగా తయారు చేయాలి. 70–80 దేశాల్లో తెలుగు ప్రజలు అమరావతిని నాశనం చేయడంపై నిరసన తెలిపారు. రౌడీయిజం రాజకీయాల్లో లేకుండా చేస్తాం. అలాంటి వారిని ఉక్కుపాదంతో అణచివేస్తాం. రుషులు తపస్సులు చేసిన ప్రాంతం రుషికొండను నాశనం చేశారు. ఖజానా మొత్తం ఖాళీ అయ్యింది. లెక్కలు చూపించి.. చూపించకుండా ఎన్నో చోట్ల అప్పులు తీసుకొచ్చారు. హిరోషిమా, నాగసాకిని స్ఫూర్తిగా తీసుకొని ప్రజా వేదికను జగన్‌ విధ్వంసానికి గుర్తుగా అలాగే ఉంచుతాం. గతంలో సీఎంలు చేతనైతే అభివృద్ధి చేశారు. లేకుంటే ఊరుకున్నారు. జగన్‌లా విధ్వంసానికి పాల్పడలేదని మాజీ సీఎంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Tags:    

Similar News