బాబు కళ్లలో ఆనందం కోసం భూములిచ్చారు, బోరు మంటున్నారు...

అమరావతికి భూములిచ్చి 11ఏళ్లయినా అగ్రిమెంటు ప్రకారం రైతులకు డెవెలప్ చేసిన ప్లాట్లు ఇవ్వలేదు.;

Update: 2025-09-11 09:37 GMT
AP Secretariat

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు ఇప్పటికీ న్యాయం కోసం ఎదురుచూస్తున్నారు. 2015లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య స్థలాలు ఇస్తామని హామీలు ఇచ్చినా, 11 ఏళ్లు గడిచినా ఆ హామీలు నెరవేరలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా, రాజధాని పూర్తి చేయడానికి మరో మూడేళ్లు పడుతుందని మంత్రి నారాయణ పదేపదే చెబుతున్నారు. ఇది రైతుల్లో ఆందోళన పెంచుతోంది. రాజకీయ అనిశ్చితులు, నిధుల కొరత, సాంకేతిక ఆటంకాలు రైతుల ఆశలను అడియాసలు చేస్తున్నాయి.

హామీలు vs వాస్తవం

2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ మొదలైనప్పుడు, సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం మూడేళ్లలో అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామని ప్రకటించారు. అప్పటి వరకు పదేళ్లపాటు రైతులకు కౌలు (అన్యూటీ) చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ కార్యాలయాల ప్లాను ఎంపికలో ఆలస్యం, నిధుల జాప్యంతో 2019 నాటికి కేవలం కొన్ని ఎన్‌జీవో భవనాలు, ఏఐఎస్ అధికారుల భవనాలు మాత్రమే నిర్మించారు. అనంతరం వచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేసి, అమరావతి పనులను పూర్తిగా నిలిపివేసింది. దీంతో ఐదేళ్లపాటు అభివృద్ధి స్తంభించిపోయింది. పదేళ్ల కౌలు నిబంధన ముగిసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మరో ఐదేళ్లు కౌలు చెల్లించేందుకు అంగీకరించింది. అయినా రైతుల్లో ఆశలు చిగురించకపోవడానికి కారణాలు లేకపోలేదు.

ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్లాట్ల అభివృద్ధికి 24 ప్రాజెక్టులకు రూ.23,579 కోట్లు ఖర్చవుతుందని అంచనా. వీటిలో రూ.3,135 కోట్ల విలువైన రెండు ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.20,444 కోట్ల విలువైన 22 ప్రాజెక్టులకు అనుమతులు వచ్చాయి, అందులో 19 పనులకు టెండర్లు పిలిచి అప్పగించారు. కానీ ఇటీవలి వర్షాలు, వాహనాల సౌకర్యం లేకపోవడంతో పనులు ప్రారంభం కాలేదు. జంగిల్ క్లియర్, సర్వే, రోడ్ల నిర్మాణం మొదలు ఇప్సుడే మొదలు పెట్టారు. మొత్తం పనులు పూర్తయ్యేందుకు కనీసం రెండేళ్లు పైగా పడుతుందని అంచనా. అప్పుడు ప్లాట్లలో నిర్మాణాలు, కంపెనీలు వచ్చేందుకు మరో మూడేళ్లు పడితే, మొత్తం ఆరేళ్లు అవుతుంది. ఈలోపు కౌలు చెల్లింపులు ఆగిపోతాయేమోనని రైతులు భయపడుతున్నారు.

కౌలు ఆగిపోతుందేమోననే భయం

అమరావతి రైతుల్లో పెరుగుతున్న అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. "భూములిచ్చి 11 ఏళ్లు అయింది. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అయినా ప్లాట్లు అప్పగించే ప్రక్రియ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు" అని ఒక రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మరో రైతు మాట్లాడుతూ, "డెవలప్మెంట్ పేరుతో మా దగ్గర 10 ఏళ్ల కిందట తక్కువ రేటుకే భూములు తీసుకున్నారు. ఇంకెప్పుడు కడతారు సార్?" అని ప్రశ్నించారు. రైతు నాయకులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. "వీలైనంత త్వరగా పనులు ప్రారంభిస్తే తప్ప, వచ్చే నాలుగేళ్లలో తమ ప్లాట్లు చేతికి అందవు. వెంటనే పనులు మొదలుపెట్టాలి, లేకుంటే తీవ్ర ఇబ్బందులు పడతాం" అని వారు చెబుతున్నారు.

రెండో దశ ల్యాండ్ పూలింగ్ (ఎల్‌పీఎస్ 2.0) ప్రతిపాదనలు కూడా రైతుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. మొదటి దశలోనే సమస్యలు పరిష్కారం కాకుండా, మరో 40,000-45,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం ప్రకటించడంతో, కొందరు రైతులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. "మొదటి దశలో భూములు ఇచ్చిన మా పరిస్థితి ఇంకా పరిష్కారం కాలేదు. రెండో దశలో మరిన్ని భూములు ఇవ్వడం సవాలుగా మారుతుంది" అని ఒక రైతు అభిప్రాయపడ్డారు. ఇటీవలి గ్రామ సభల్లో రైతులు అమరావతి భవిష్యత్తుపై స్పష్టత కోరుతున్నారు. కొందరు రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, మొదటి దశలోని పెండింగ్ సమస్యలు వారిని వెనక్కి తోస్తున్నాయి.


అమరావతి ల్యాండ్స్ (ఫైల్ ఫొటో)

ప్రభుత్వ బాధ్యతలు, సవాళ్లు

కూటమి ప్రభుత్వం అమరావతిని పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నట్లు చెబుతోంది. మంత్రి నారాయణ మూడేళ్లలో రాజధాని పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ, ఏడాదిన్నర గడిచినా ప్రగతి నత్తనడకన సాగుతోంది. నిధుల కొరత, వర్షాలు, గ్రావెల్ షార్టేజ్ వంటి సాంకేతిక సమస్యలు పనులను ఆలస్యం చేస్తున్నాయి. సీఆర్‌డీఏ అధికారులు ప్లాట్ రిజిస్ట్రేషన్లలో ఆలస్యం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రైతుల గ్రీవెన్స్‌లు పరిష్కరించడానికి స్పష్టమైన రోడ్‌మ్యాప్ అవసరం. ప్రభుత్వం వెంటనే పనులను వేగవంతం చేసి, రైతులకు నమ్మకం కల్పించాలి. లేకుంటే రైతుల ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుంది.

మరోవైపు, రెండో దశ భూసమీకరణకు జనసేన పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసి, పేద రైతుల పక్షాన నిలిచింది. ఇది ప్రభుత్వానికి సవాలుగా మారింది. రాజకీయాలు మారినప్పుడు మళ్లీ పనులు నిలిచిపోతాయేమోననే భయం రైతుల్లో ఉంది.

న్యాయం జరగాలంటే...

అమరావతి కల సాకారం కావాలంటే, రైతులకు న్యాయం జరగాలి. పదేళ్లు దాటినా వారి కలలు కల్లలుగానే మిగిలాయి. ప్రభుత్వం స్పష్టమైన రోడ్‌మ్యాప్‌తో పనులను వేగవంతం చేయాలి. రైతుల ఆవేదనను పరిగణలోకి తీసుకుని, వారికిచ్చిన హామీలు నెరవేర్చాలి. లేకుంటే ఈ ఆందోళన మరింత తీవ్రమవుతుంది. రైతుల త్యాగాలు వృథా కాకూడదు. ఇది సమయం చెబుతున్న మాట.

అసంపూర్తి హామీలు, ప్లాట్ల ఆలస్యం పై ఆగ్రహం

రైతులు తమ త్యాగాలు వృథా అవుతున్నాయని, ప్లాట్లు ఇంకా కేటాయించక పోవడంపై ఆవేదన చెప్పుకుంటున్నారు. "నేను రెండు ఎకరాలు ఇచ్చాను. నా తండ్రి ఆ భూమిని అంతా జీవితం పాటు పండించాడు. ఇప్పుడు నాకు వచ్చిన చిన్న ప్లాట్‌ను ఉపయోగించలేను. పెన్షన్ కూడా నా మందులకు సరిపోదు." అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక రైతు చెప్పారు. "వారు మాకు కలలు ఇచ్చారు, జీవనోపాధి కాదు. నా కొడుకు హైదరాబాద్‌కు ఉద్యోగం కోసం వెళ్లాడు. అమరావతిలో మాకు ఏమీ లేదు." అని చెప్పారు.

‘పీపుల్స్ క్యాపిటల్’ పేరుతో మోసపోయాము

ల్యాండ్ పూలింగ్‌ను "సిస్టమాటిక్ కోర్షన్" అని విమర్శించాడు అమరావతి స్పీక్స్ (Amaravati Speaks) గ్రూప్ లీడర్, రైతు యాక్టివిస్ట్ రామ్ నూతక్కి (Ram Nutakki) . "మొదటి దశ రైతులు ఇంకా ప్లాట్లు పొందకపోతే, రెండో దశలో మరిన్ని భూములు తీసుకోవడం అన్యాయం. మా త్యాగాలు 'పీపుల్స్ క్యాపిటల్' పేరుతో మోసపోయాయి" అని చెప్పాడు. ఈ గ్రూప్ 2025లో రైతుల గ్రీవెన్స్‌లపై పలు క్యాంపెయిన్‌లు నడిపింది. వారు మొత్తం 100కి పైగా ఫ్యామిలీస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు.


ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉద్యోగుల కోసం రాయపూడి సమీపంలో నిర్మిస్తున్న భవనాలు 

మొదటి దశ సమస్యలు పరిష్కారం కావాలి

దశాబ్దం కిందట జరిపిన మొదటి దశ ల్యాండ్ పూలింగ్ కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉఏందని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ (MAUD) ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ కూడా అభిప్రాయపడ్డారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ జరుగున్న ప్రాంతాలలో రైతుల అభిప్రాయాలను 2025 జూలైలో సేకరించినట్లు చెప్పారు. "రైతులు ల్యాండ్ పూలింగ్‌కు సిద్ధంగా ఉన్నారు, కానీ మొదటి దశలోని ప్లాట్ కేటాయింపు ఆలస్యం కాకుండా పరిష్కరించాలి" అని సురేష్ కుమార్ అబిప్రాయపడ్డారు. రైతులకు అన్యూటీ రూ. 30,000 నుంచి రూ. 50,000 వరకు పెంచేందుకు రూల్స్ 2025లో సలహాలు కూడా ఇచ్చాడు.

ల్యాండ్ పూలింగ్ 2.0 పై సందేహాలు, భయాలు

మొదటి దశ సమస్యలు పరిష్కారం కాకుండా రెండో దశ (30,000-40,000 ఎకరాలు) ప్రతిపాదనలు రైతుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. "మొదటి భూములు ఇచ్చిన మాకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. మరోసారి ఇస్తే, మళ్లీ ఆలస్యాలు ఎదుర్కొంటామా?" అని ఒక రైతు అభిప్రాయపడ్డాడు. "ప్రభుత్వం భూములు కొనుగోలు చేస్తే మంచిది, పూలింగ్‌లో మళ్లీ మోసం జరుగుతుంది." అని అన్నారు.

మొదటి దశ ప్లాట్లు వెంటనే కేటాయిస్తాం

2025 ఏప్రిల్-జూన్‌లో రైతులతో సమావేశాలు నిర్వహించాము. "రైతులు 36,000 ఎకరాలు రెండో దశలో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి పి నారాయణ (P. Narayana) చెప్పారు. మొదటి దశ ప్లాట్లు వెంటనే కేటాయిస్తాం" అని హామీ ఇచ్చారు. అయితే రైతులు ఆయన మాటలపై సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అన్యూటీ చెల్లింపులు, ఆర్థిక ఇబ్బందులు

పదేళ్లు గడిచినా అన్యూటీ (కౌలు) చెల్లింపులు సకాలంలో రావడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. "మా భూములు ఇచ్చాం, కానీ కౌలు కూడా సరిగ్గా రావడం లేదు. ప్లాట్లు ఇవ్వకుండా మరో ఐదేళ్లు పొడిగిస్తున్నారు. కానీ ఆ తర్వాత ఏమిటి?" అని ఒక రైతు ప్రశ్నించారు. గ్రావెల్ షార్టేజ్, లాజిస్టిక్ సమస్యలు పనులను ఆలస్యం చేస్తున్నాయని, దీంతో రైతుల ఆర్థిక భద్రత ప్రమాదంలో పడుతుందని వారు ఆందోళన చెందుతున్నారు. "మా ప్లాట్లు ఇప్పటికే అప్పగించి ఉంటే వ్యాపారాలు, ఇళ్ల నిర్మాణాలు చేసుకునేవాళ్లం" అని మరో రైతు అభిప్రాయపడ్డారు.

ఇచ్చిన భూములు డెవలప్ చేయకుండా మరో చోట భూములు ఏమిటి?

మొదటి ఫేజ్ సమస్యలు పరిష్కారం కాకముందే రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ (40,000-45,000 ఎకరాలు) ప్రతిపాదనలు ఏమిటని తుళ్లూరు మాజీ ఎంపీపీ రుద్ద మోహన్ బాబు అన్నారు. "మొదటి భూములు ఇచ్చిన మాకు ఇంకా ప్లాట్లు ఇవ్వలేదు. మరోసారి భూములు ఇస్తే, మళ్లీ ఆలస్యాలు ఎదుర్కొంటాం. పవర్ మారితే ఏమవుతుంది?" అని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ముందు రాజధానికి చట్టబద్దత కావాలి’ అని ఆయన అన్నారు.

మొదటి విడత భూములు ఇచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయించాలి

రాజధాని కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు వెంటనే ప్లాట్లు కేటాయించి ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతుల వేదన ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. రోడ్లు, ఇతర సౌకర్యాలు కల్పించాలి. అప్పుడే రెండో విడత భూ సమీకరణపై దృష్టి పెట్టాలి.

రాజధాని రైతుల ఆవేదనలో అర్థం ఉంది

రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులు ఆవేదన వ్యక్తం చేయడంలో అర్థం ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు అన్నారు. ఎందుకంటే వారికి ఇప్పటికీ ప్లాట్లు కేటాయించలేదు. ప్రభుత్వం తమ పనులు తాము చేసుకుంటూనే రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లు వారికి ఇస్తే అందులోనూ కట్టడాలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా రెండో దశ భూ సమీకరణ అనేది సరైన పద్ధతి కాదని అన్నారు.

కొందరు ఆశావాదం, మరికొందరు సందేహం

కొందరు రైతులు రెండో ఫేజ్‌కు అంగీకరిస్తున్నారు. కానీ మెజారిటీ అసంతృప్తితో ఉన్నారు. "సమస్యలు పరిష్కరిస్తే మాత్రమే భూములు ఇస్తాం" అని 1,300 ఎకరాల రైతులు చెబుతున్నారు. సింగపూర్ స్టైల్ క్యాపిటల్ అని చెప్పి, రైతులను మోసం చేశారు" అని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

11 ఏళ్లుగా ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నాం

మేము ఇచ్చిన పొలాల్లో ప్లాట్లు వేసి మాకు ప్లాట్లు అప్పగించాలని తుళ్లూరు రైతు పి మోహన్ రావు ప్రభుత్వాన్ని కోరారు. ఆ తరువాత రెండో దశ భూ సమీకరణ చేపట్టాలి. 11 ఏళ్లుగా ప్లాట్ల కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడే అమరావతిలో రోడ్ల పనులు మొదలు పెట్టారని అన్నారు.

కలలోనే మూడేళ్లు...

నాకున్న ఎకరంన్నర పొలం పూలింగ్ లో రాజధాని కోసం ఇచ్చాను. ఇప్పటికీ పాట్ల విషయంలో దారీ, డొంకా లేదని నంబూరుకు చెందిన షేక్ ఇస్మాయిల్ అన్నారు. ప్లాట్లు వేసి రోడ్లు పోసి ఇవ్వాలి. అదేమీ ఇంతవరకు జరగలేదన్నారు. మూడేళ్లలో నిర్మాణాలు పూర్తవుతాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ నేనేమన్నా ఇంజనీర్ నా? కలలోనే మూడేళ్లలో అవుతుందని అన్నారు.

నా పొలం ఎందుకిచ్చానా అని బాధపడుతున్నా...

రైతులకు ప్లాట్లు వేసి ఇవ్వలేదు. నా ఎకరం పొలం ఎందుకు ఇచ్చామా అని బాధపడుతున్నా అని కురగల్లు గ్రామానికి చెందిన కడియం గంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్లాట్లు ఫోన్ లలో చూసుకోవడమే. ఎక్కడున్నాయో మాకు తెలియదు. ఇక్కడ డెవలప్ చేయాలి. అలా కాకుండా ఏడాది కూడా కాకముందే వేరే చోట భూములు కావాలని ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇది మంచి పద్ధతి కాదు. మాకు ముందు ప్లాట్లు చూపించి అప్పుడు వేరే చోట అడగొచ్చు.

ప్రభుత్వం మారితే మేము కూలిపోవాల్సిదే...

ముందు భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వండి. రోడ్లకు కావాలంటే రెండో విడత కింద తీసుకోండి అని రాజధాని రైతు భాష్యం కృష్టారావు అన్నారు. అంతే కాని తీసుకున్న భూములకు ప్లాట్లు కేటాయించి చూపించకుండా రెండో విడత భూ సమీకరణ ఏమిటని ప్రశ్నించారు. ప్రస్తుతం మొదలైన పనులు పూర్తయితేనే రెండో విడత ఇస్తాం. ప్రభుత్వం మారితే మేము కూలికి పోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల గొంతు నొక్కొద్దు

ప్రభుత్వం రెండో దశ భూ సమీకరణపై ఇటీవల విజయవాడలో సిటిజన్ ఫర్ డెమొక్రసి తరపున నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, సిటిజన్ ఫర్ డెమొక్రసీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడారు. మొదటి విడత తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రెండో దశ భూములు అడగాలన్నారు. ప్రజలు ఏమడుగుతున్నారో వారి గొంతును సమర్థించాలి. అంతే కాని ఏ పక్ష పోకడలు మంచివి కాదని అన్నారు. మొదటి విడత ప్లాట్లు ఇవ్వకుండా రెండో విడతను నేను సమర్థించలేనని అన్నారు.

ఉద్దేశ్య పూర్వకంగానే అధికారులు తప్పులు

అధికారులు ఉద్దేశ్య పూర్వకంగా తప్పులు చేస్తున్నారని అన్నారని మందడం గ్రామానికి చెందిన రైతు కృష్ణమూర్తి ఆరోపించారు. ప్రభుత్వం ఈ విషయంలో అప్రమత్తం కావాలని, మొదట భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు వెంటనే ఇవ్వలన్నారు.

సమీకరణలోనూ రైతుకు అన్యాయం

భూములు తీసుకునే విషయంలోనూ అధికారులు తప్పులు చేస్తున్నారని నెక్కల్లు గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మాకు 70 సెంట్లు గ్రామకంఠం స్థలం ఉంది. 30 సెంట్లలో పశువుల పాక వేశాము. 20 సెంట్లలో గడ్డివాము ఉంది. గడ్డివామును ప్రభుత్వం తీసుకున్నట్లుగా రికార్డుల్లో రాయలేదు. కానీ మా స్థలం మొత్తం స్వాధీనం చేసుకున్నారు. ఇది అధికారులు కావాలని చేసిన తప్పిదం అన్నారు. ఇలా అనేక చోట్ల జరిగాయన్నారు.

అమరావతి విద్యా సంస్థల్లో స్థానికులకు ఇచ్చిన హామీ మేరకు 25 శాతం సీట్లు ఇవ్వాలి

భూములు ఇచ్చిన వారికి ప్లాట్లు ఇవ్వకుండా ఎక్స్ర్టా భూములు ఏమిటని నిడమర్రు గ్రామానికి చెందిన రైతు కట్టెపోగు బాబూరావు అన్నారు. 2015లో మా భూములు తీసుకునేటప్పుడు అమరావతిలోని విద్యా సంస్థల్లో స్థానికులకు 25 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు విట్, ఎస్ఆర్ఎం, అమృత యూనివర్శిటీలు వచ్చాయి. ఇందులో మా పిల్లకు రిజర్వేషన్ లేదు. ఎస్సీ, ఎస్టీలకు అసలు అవకాశం లేకుండా పోయింది. నేను ఎస్సీ మాదిగ కులానికి చెందిన వాడిని నేను ఇచ్చింది తక్కువ భూమే అయినా నా పిల్లలను మంచి విద్యా సంస్థల్లో చదివించాలని కోరుకుంటున్నానని అన్నారు.

బలవంతంగా లాక్కుంటున్నారు

నాకు రెండెకరాలు పొలం ఉంది. నేను పూలింగ్ కు ఇవ్వలేదు అని అమరావతి రైతు ముప్పాళ్ల సత్యవతి చెప్పారు. కోర్టులో కేసు ఉంది. అయినా బలవంతంగా లాక్కుంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. ఎవరెవరో వచ్చి మాకు సీఆర్డీఏ ఈ భూమి ఇచ్చింది. ఇది మాది అంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News