‘నువ్వసలు సీనియర్ IASవా లేక కేంద్ర ఎన్నికల సంఘం కీలుబొమ్మవా?’

కర్నాటక చీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ మీద విరుచుకుపడ్డ డాక్టర్ పివి రమేష్;

Update: 2025-08-12 11:21 GMT
ఎన్నికల వ్యవస్థపై ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారి డాక్టర్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం సృష్టించాయి. తప్పు జరిగినపుడు స్వచ్ఛందంగా విచారణకు ఆదేశించడానికి బదులు తప్పు ఎత్తి చూపిన వారిని ఎద్దేవా చేయడం దేనికి సంకేతమని రమేశ్ చేసిన ట్వీట్ ప్రస్తుత ఐఎఎస్ వర్గాలలో ప్రకంపనలు సృష్టించింది.

కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (ceo_karnataka)పై తీవ్ర విమర్శలు చేస్తూ డాక్టర్ పీవీ రమేశ్ ఆగస్టు 12న తన సామాజిక మాధ్యమం ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. కర్నాటక ముఖ్య ఎన్నికల అధికారి యావత్ ఐఎఎస్ కమ్యూనిటీకే తలవంపులు తెచ్చారన్నారు. ఒక సీనియర్ IAS అధికారి కేంద్ర ఎన్నికల సంఘం (ECISVEEP) అనే "యజమాని" చేతిలో కీలుబొమ్మగా మారిపోయారనే ఆరోపణ చేశారు. ECISVEEP అంటే Election Commission of India – Systematic Voters’ Education and Electoral Participation. ఇది భారత ఎన్నికల సంఘం (ECI) రూపొందించిన జాతీయ స్థాయి ఓటర్ల అవగాహన, విద్యా కార్యక్రమం.


భారత ఎన్నికల వ్యవస్థ విశ్వాసాన్ని దెబ్బతీసేలా కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి (@ceo_karnataka) తీరు ఉందని మండిపడ్డారు. డాక్టర్ పీవీ రమేశ్ చేసిన వ్యాఖ్యలు విస్తృత చర్చకు దారి తీశాయి. ఆయన తన ట్వీట్‌లో "మీరు IAS వర్గానికి అవమానం. భారత ఎన్నికల వ్యవస్థను కబళిస్తున్న తీవ్రమైన వ్యవస్థాత్మక లోపాలను రాహుల్ గాంధీ(RahulGandhi) బయటపెట్టారు. వాటిని ఎన్నికల సంఘం స్వచ్చందంగా వాటిపై దృష్టి పెట్టి, సమగ్ర సవరణ చర్యలు చేపట్టాల్సింది పోయి మీరే (కర్నాటక ECI) ఎగతాళిగా, అవమానకరంగా, ప్రజల్ని గందరగోళపరిచేలా అడ్డంకులు సృష్టిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఇది దారుణం, ఓ సీనియర్ ఐఎఎస్ అధికారి అలా వ్యవహరించడం తన ఊహకు అందని విషయంగా అభివర్ణించారు.
ఆరోపణల నేపథ్యం...
ఇటీవల కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియలో ఉన్న కొన్ని అవకతవకలు, వ్యవస్థపరమైన లోపాలను బహిర్గతం చేశారు. వాటిపై సుయో మోటో విచారణ జరపకుండా ఎన్నికల సంఘం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించిందనే విమర్శలు ప్రతిపక్షం నుంచి వస్తున్నాయి.
ప్రస్తుత ఆరోపణలు, కేవలం వ్యక్తిగతంగా ఒక IAS అధికారిని మాత్రమే కాకుండా మొత్తం ఎన్నికల వ్యవస్థ నిష్పక్షపాతత, విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.
ప్రజాస్వామ్యంపై ప్రభావం...
ఎన్నికల వ్యవస్థ పట్ల ప్రజల విశ్వాసం దెబ్బతిన్నప్పుడు, ప్రజాస్వామ్య పునాదులు కదులుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఉన్న నిష్పక్షపాతత, పారదర్శకతే ప్రజాస్వామ్యానికి ఆత్మ అని, ఆ విలువలు క్షీణిస్తే ఎన్నికల ఫలితాలపై కూడా అనుమానాలు పెరుగుతాయని వారు అంటున్నారు.
ఒక మాజీ ఎన్నికల కమిషనర్ వ్యాఖ్యానిస్తూ, "ఒక రాష్ట్ర CEO (Chief Electoral Officer) కేవలం పరిపాలనా బాధ్యత మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్య నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత కూడా వహిస్తారు. ఆ స్థానంలో చిన్న తప్పు కూడా పెద్ద అవిశ్వాస వాతావరణాన్ని సృష్టిస్తుంది" అన్నారు.
అంతర్జాతీయ ప్రతిష్ఠకు దెబ్బ
ఆరోపణల్లో "మీ చర్యల వల్ల దేశీయంగానే కాకుండా, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల వ్యవస్థ ఎగతాళి చేయబడుతోంది" అనే అంశం ప్రస్తావనలోకి వచ్చింది. యూరప్, అమెరికా వంటి ప్రాంతాల్లో భారత ఎన్నికల ప్రక్రియను సాంకేతిక నైపుణ్యం, విస్తృత పరిమాణం కోసం మెచ్చుకుంటారు. అయితే, పారదర్శకతపై ప్రశ్నలు లేవనెత్తబడితే, ఆ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్నది విశ్లేషకుల అభిప్రాయం.
ఎన్నికల సంఘం స్పందన లేమి
ప్రస్తుతం ఎన్నికల సంఘం లేదా కర్ణాటక ముఖ్య ఎన్నికల అధికారి దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నదేమిటంటే, ఈ వివాదంపై స్పందన ఆలస్యం అయితే, అది ప్రజల్లో ఉన్న అనుమానాలను మరింత పెంచే ప్రమాదం ఉంది.
భారత ఎన్నికల చరిత్రలో ఎన్నికల ముఖ్య అధికారులుగా ఉన్న ఐఎఎస్ లపై ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. అయితే వాటికి సమాధానం చెప్పారే తప్ప ఇలా ఎదురుదాడి చేయలేదు. కర్నాటక ఎన్నికల అధికారి వ్యవస్థలోని లోపాలను విచారించడానికి బదులు అసలు లోపాలే జరగలేదని, రాహుల్ గాంధీ ఏమి అడుగుతున్నారో ఆయనకే తెలియడం లేదంటూ రాహుల్ గాంధీకే నోటీసులు ఇచ్చారు. దీన్ని డాక్టర్ పీవీ రమేశ్ తప్పుబట్టారు.
ఎవరీ డాక్టర్ పి.వి.రమేశ్....
డాక్టర్ పీవీ రమేశ్ ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడకు చెందిన వారు. ఆయన పూర్తిపేరు పెనుమాక వెంకట రమేశ్ బాబు. వైద్య విద్య చదివిన ఐఎఎస్ అధికారి. ఆయన 1985 బ్యాచ్. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందినవారు . MBBS డిగ్రీను Christian Medical College, Vellore నుంచి పొందారు . రాష్ట్ర ప్రభుత్వంలో కీలక స్థాయిలో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ఫైనాన్స్, యూత్ అఫైర్స్ & కల్చర్ వంటి విభాగాలు నిర్వహించారు.
అంతర్జాతీయ స్థాయిలో UNOPS, UNFPA, IFAD వంటి సంస్థలతో పని చేశారు. పేదరికం నిర్మూలన, గ్రామీణ అభివృద్ధి ప్రాజెక్టుల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్నారు. ముఖ్యమంత్రి సలహాదారు, Special Chief Secretary వంటి పదవులు కూడా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో ఉంటున్నారు.
ఎన్నికల ప్రక్రియలో 'తీవ్రమైన వ్యవస్థాగత లోపాలు' (systemic pathology)పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బహిర్గతం చేసిన నేపథ్యంలో పీవీ రమేశ్ ఈ కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
రాహుల్ గాంధీ కర్ణాటకలోని ఒక అసెంబ్లీ సెగ్మెంట్‌లో 1 లక్షలకు పైగా ఫేక్ వోటర్లు, డూప్లికేట్ ఎంట్రీలు, చెల్లని అడ్రస్‌లు, ఫారమ్ 6 దుర్వినియోగం ఉన్నాయని ఆరోపించారు. ఇది 2024 లోక్‌సభ ఎలక్షన్స్‌లో BJPకి అనుకూలంగా జరిగిందని, మహారాష్ట్రలో 40 లక్షల ఫేక్ పేర్లు జోడించారని వీడియోలు విడుదల చేశారు. ECI దీనిపై స్వయంగా చర్యలు తీసుకోకుండా రాహుల్‌కు నోటీస్ ఇచ్చి 'ట్రోలింగ్' చేసిందని రమేష్ ఆరోపించారు. దీనివల్ల ECI విశ్వసనీయత కోల్పోయి అంతర్జాతీయంగా నవ్వులపాలైందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కూడా కర్నాటక సీఇవో తీరును తీవ్రంగా ఎండగట్టింది. ఎన్నికల వ్యవస్థ 'మరణించింది' అని రాహుల్ అభిప్రాయపడ్డారు. అయితే BJP, ECI సపోర్టర్లు ఇది 'రాజకీయ ఆరోపణలు' మాత్రమేనని, ఆధారాలు లేవని, చట్టపరంగా డొల్లతనాన్ని సూచిస్తున్నాయని వాదిస్తున్నారు.
ఇదే సమయంలో డాక్టర్ పీవీ రమేశ్ చేసిన ట్వీట్ పై కూడా విమర్శలు వచ్చాయి. ఆయన్ను 'కాంగ్రెస్ బాబు'గా అభివర్ణించారు.
మొత్తంగా ఈ వివాదం ఎన్నికల వ్యవస్థ, సమగ్రతపై ప్రజల విశ్వాసాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. ECI సమగ్ర పరిశీలన అవసరమని విశ్లేషకులు సూచిస్తున్నారు.
Tags:    

Similar News