జగన్ చిన్నిచిన్ని ఆశలన్నీ... టీడీపీ సూపర్- 6పైనే...!
ఉచిత పథకాలపై వైసీపీకే ఎక్కువ ఆతృత ఉంది. అమలు సాధ్యం కాని పథకాలు తమకు ఉపకరిస్తుందనే ఊహలతో జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారు. ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలనే వారు కూడా ఉన్నారు.
By : SSV Bhaskar Rao
Update: 2024-09-14 15:30 GMT
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసెనే
కమ్మనైన మనసులన్నీ కలిసి ఆడెనే
పంటలతో నేల తల్లి పొంగెనే
సంపదతో పల్లెలన్నీ నిండెనే
సాగరా చాటరా జయం మనదేరా"
జయం మనదేరా సినిమాలోని ఈ పాట అధికారంలో ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం. ప్రతిపక్ష వైసీపీకి సరిగ్గా సరిపోతుంది.
అధికారంలోకి రాగానే అమలు చేస్తామని టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్ -6 పధకాల అమలుపై జనం ఆబగా నిరీక్షిస్తున్నారు. వీటి అమలు కోసం ప్రజలు కదా నిరీక్షిస్తున్నది. వైసీపీకి ఆశలు ఎందుకు అనిపించవచ్చు. ఇందుకు ప్రధాన కారణం ఒకటే.. నిధుల కొరతతో సతమతం అవుతున్న రాష్ట్రంలో ఈ పథకాలు అమలు చేయడం ఎలాగూ సాధ్యం కాదు. ఈ వైఫల్యమే తమకు శ్రీరామరక్ష అవుతుందని వైసీపీ గంపెడంత ఆశతో ఉంది. . దీనిని జనంలోకి బలంగా తీసుకుని వెళ్లడం ద్వారా లాభపడాలని వైసీపీ ఆశిస్తోంది. ఇదే విషయంపై ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్. జగన్ అనేక సందర్భాల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.
టీడీపీకి కలిసొచ్చిన కాలం...
గత ప్రభుత్వంలో సంక్షేమం మినహా అభివృద్ధి లేదు. సహజ వనరులను దోపిడీ చేశారు. ప్రస్తుత సీఎం ఎన్. చంద్రబాబును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టు చేయించిన వ్యవహారాలు టీడీపీ కూటమికి కలసివచ్చాయి. ఊహించని విధంగా 175 అసెంబ్లీ సానాలకు టీడీపీ 144 సీట్లలో పోటీ చేసి 135 స్థానాల్లో గెలిచింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేయగా 21 సీట్లను కైవసం చేసుకుంది. బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి, ఎనిమిది స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఇది చాలాదన్నట్లు టీడీపీ కూటమికి ప్రకృతి కూడా కరుణించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల సేద్యపు నీటి ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. ఇది ఒకరకంగా వరం కావడమే కాకుండా, తుంగభద్ర డ్యాం గేటు తెగడం, తాజాగా విజయవాడలో బుడమేరుకు గండిపడడం వంటి ఘటనలు ఉత్పాతం సృష్టించినా, సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేసిన వైసీపీ తీరుకు నిదర్శనమని టీడీపీ విమర్శలు గుప్పించింది. ఇదే అదనుగా సూపర్ 6 హామీల అమలు దాటవేతకు అవకాశం లభించింది. ప్రజల ఆలోచనలు కూడా అటే మళ్లాయి. ప్రకృతి ప్రకోపం వెనుక తమ నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు తిప్పికొట్టడానికి వైసీపీ సూపర్ 6 హామీలతో మోసం చేశారనే వ్యవహారం తెరమీదకు తీసుకుని రావడం ద్వారా లబ్ధిపొందాలనే ఎత్తుగడకు తెరతీయనుంది. వైసీపీ రాష్ట్ర నేతల సమీక్షల్లో కూడా ఇదే అంశంపై చర్చ సాగినట్లు సమాచారం.
ప్రోగ్రెస్ రిపోర్ట్
రాష్ర్టంలో టీడీపీ కూటమి కొలువుదీరి సరిగా ఈ నెల 13వ తేదీకి మూడు నెలలు గడిచాయి. అధికారంలోకి వచ్చే పార్టీల పనితీరును విశ్లేషకులే కాదు. సాధారణ ప్రజానీకం కూడా మూడు నెలల్లోనే అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉంటుంది. ఎన్నికలప్పుడు ఇచ్చే హామీలు అధికారం చేపట్టిన తరువాత అమలు చేయడంలో సమర్థతను చాటుకోవాలి. అలా చేయలేని పక్షంలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇది కాస్తా, అధికారం కోల్పోయిన పార్టీకీ చేతికి ఆయుధం అందించినట్లే అవుతుంది. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరు కూడా అదేవిధంగా ఉంది.
దీనిపై ఇటీవల వైసీపీ అధ్యక్షుడు వైఎస్. జగన్ ఏమన్నారంటే...
"అధికారంలోకి రావడానికి సీఎం చంద్రబాబు ఎన్ని హామీలైనా ఇస్తారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మారుస్తారు. ఇప్పడు కూడా అదే చేస్తున్నారు" అని ఘాటుగా విమర్శించారు.
పథకాలపై మీనమేషాలు
టీడీపీ కూటమి ఇచ్చిన సూపర్ -6 హామీలపై వైసీపీ ఆశలు ఎందుకు? కూటమి ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు గడిచింది. హామీల అమలులో మీనమేషాలు లెక్కిస్తోంది. పరిపాలన వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. మినహా నాటి అమ్మఒడి (తల్లిదీవెన) పథకం ఊసే లేదు. ఉచిత బస్సు ప్రయాణం, ఆడబిడ్డలకు నెలకు రూ. 1500, రైతు భరోసా వంటి పథకాలు కూడా కార్యాచరణలోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో మూడు నెలల ప్రోగ్రెస్ ప్రజలకు వివరించడానికి వైసీపీ సన్నద్ధం అవుతోంది.
నెల్లూరుకు చెందిన బీజేపీ సీనియర్ నేత కరణం భాస్కరరావు స్పందించారు. "రాష్ట్రం పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నసమయంలో కూటమి అధికారం చేపట్టింది. ప్రభుత్వానికి కాస్త ఊపిరి తీసుకునే సమయం ఇవ్వాలి" అన్నారు. ఆదాయవనరులైన మద్యం, ఇసుక, గనుల లీజు వంటి ప్రధాన అంశాలపై విధాన నిర్ణయాలు తీసుకోవడానికి సమయం అవసరం. మూడు, ఆరు నెలలు కాదు. కనీసం ఆరు నెలల వ్యవధి అవసరం" అని ఆయన అభిప్రాయపడ్డారు.
తల్లిదీవెన రెట్టింపు
రాష్ట్రంలో టీడీపీ కూటమి జూన్ 13వ తేదీ ఏర్పాటైంది. అంతకుముందు రోజే 2024-25 విద్యా సంవత్సరం ప్రారంభమైంది. అదే రోజు లేదా మరుసటి రోజు రోజు వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన అమ్మఒడి (టీడీపీ కూటమి తల్లిదీవెన) పథకంలో తల్లుల ఖాతాలకు నగదు జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వం మారడం ఓ కారణమైతే, గత ప్రభుత్వానికి భిన్నంగా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికి పథకం వర్తింప చేస్తామని సీఎం ఎన్. చంద్రబాబునాయుడు ఎన్నికల వేళ సూపర్ సిక్స్ లో హామీ ఇచ్చారు. దీనిపై ఇంత వరకు విధివిధానాల పేరిట కాలయాపన జరుగుతోంది. మినహా ఇంతవరకు నగదు జమ కాలేదు. ఇదిలావుండగా..
ఒక్కరికే వైసీపీ వర్తింపు
వైసీపీ ప్రభుత్వంలో కుటుంబంలో ఒక బిడ్డకు మాత్రమే ఏడాదికి రూ.1500 జమ చేసేవారు. పథకం ప్రారంభమైన తరువాత అందులో రూ. వెయ్యి పాఠశాల పారిశుద్ధ్య పనుల కోసం మినహాయించి మిగతా సొమ్ము ఇచ్చే వారు. ఆ లెక్కన 2022-23 విద్యా సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని 42,61,965 మంది పిల్లల తల్లుల ఖాతాలో 6,392.94 కోట్లు జమ చేసింది. నాలుగేళ్లలో తమ ప్రభుత్వ కాలంలో విద్యారంగానికి విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుకల ద్వారా 66,722.36 కోట్లు వెచ్చించినట్లు వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ అప్పట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేశారు.
ఇప్పుుడు డబుల్..
టీడీపీ కూటమి ఎన్నికల వేళ ఇచ్చిన పథకాల్లో కేవలం తల్లిదీవెన (అమ్మఒడి) పథకం అమలు చేయడానికి రెట్టింపు అయ్యే అవకాశం కల్పించారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లిదీవెన వర్తింప చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. దామాషాలో ఇంటికి ఇద్దరు పిల్లలకు ఇచ్చినా ఏడాదికి రూ. 12,795.88 కోట్లు వెచ్చించాల్సి వస్తుంది. గత వైసీపీ పాలనలో నవరత్న పథకాలకు రూ. 62 వేల కోట్లు వెచ్చించారనేది లెక్క. ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించిన మేనిఫెస్టో అమలుకు దాదాపు రూ. 1.27 వేల కోట్లు అవసరం అవుతుందనేది అంచనా. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే, 102 శాతం ఎక్కువ అని భావిస్తున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించే వాతావరణం కనిపించడం లేదనేది పరిశీలకుల అంచనా. మేనిఫెస్టో ప్రకటించే సమయంలోనే బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునీల్ ధియేథర్ అభ్యంతరం తెలిపారు. ఆ పత్రాలు ముట్టుకోవడానికి కూడా సుముఖత చూపకపోవడం గమనార్హం. బీజేపీ అధికార ప్రతినిధితో పాటు రాజ్యసభ మాజీ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కూడా " అంతభారం భరించడం కష్టం. ఆ మేనిఫెస్టోతో సంబంధం లేదు" అని ప్రకటించడం ప్రస్తావనార్హం.
వెనువెంటనే...
అధికారంలోకి వచ్చిన తరువాత సూపర్ సిక్స్ పథకాల్లో ప్రధానంగా ఉచిత బస్సు ప్రయాణం, పేదలకు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లు అందించే అంశం ఇంకా కొలిక్కి రాలేదు. దీనిపై ప్రభుత్వం అధ్యయనం చేస్తున్నట్లు చెప్పడం మినహా, ఎప్పటి నుంచి అమలు అనేది తేలడం లేదు.
రాష్ట్రానికి వచ్చే ఆదాయం, నిధులపై సమగ్రత అవసరం అని బీజేపీ సీనియర్ నేత కరణం భాస్కరరావ్ అభిప్రాయపడ్డారు. "కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆ పథకాలకు మినహా దారి మళ్లించడానికి గతంలో మాదిరి ఆస్కారం ఉండదు" అని ఆయన వ్యాఖ్యానించారు. "మాజీ సీఎం వైఎస్. జగన్ పరిస్థితులను, పరిపాలన అవగాహన చేసుకునేందుకు తనను తాను అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అని సూచించారు.
జనమే కాదు... ప్రకృతీ కరుణించింది...
ఎన్నికల్లో ఓట్లతో జనం టీడీపీని ఆదరించారు. ఇదే సమయంలో ప్రకృతి కూడా కరుణించడంతో జలాశయాలు నిండాయి. ఇదే సమయంలో తుంగభద్ర డ్యాం గేటు చెయిన్ లింకు తెగడం, ఇటీవల విజయవాడ సమీపంలోని బుడమేరుకు గండిపడిన వ్యవహారం కూడా రాజకీయాలను సంతరించుకున్నాయి. "వైసీపీ పాలనలో బటన్ నొక్కుడు వంటి పథకాలకు మినహా, అభివృద్ధికి ప్రధానంగా నీటి పారుదల రంగాన్ని నిర్లక్ష్యం చేశారు" అని టీడీపీతో పాటు ప్రభుత్వ పెద్దలు, సీఎం ఎన్. చంద్రబాబు కూడా విరుచుకుపడ్డారు. దీంతో వైసీపీ డిఫెన్స్లో పడింది. దీనికి చెక్ పెట్టడానికా.. అన్నట్లు టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయకపోవడం వెనుక మోసపూరిత మాటలు ఉన్నాయని వైసీపీ తెరమీదకు తీసుకుని వచ్చింది. ఇటీవల గుంటూరు, పిఠాపురం పర్యటనల్లో కూడా వైఎస్. జగన్ కూటమి ప్రభుత్వాన్ని మాటలతో ర్యాగింగ్ చేయడం ప్రస్తావనార్హం.
ఆ వ్యాఖ్యలను సీఎం ఎన్. చంద్రబాబు కూడా సమర్థవంతంగా తిప్పికొట్టారు. "ప్రకృతి విలయ బాధితులను కేంద్రమే ఆదుకోవాలి. దాతలు ముందుకు రావాలి. గత ప్రభుత్వంలో ఖజానా ఖాళీ చేశారు" అని వైఎస్. జగన్ వ్యాఖ్యాలను సీఎం చంద్రబాబు తిప్పికొట్టారు. "కేంద్రం ఇచ్చిన నిధులకు గత ప్రభుత్వానికి లెక్కలు కూడా చెప్పలేదు. దీనివల్ల జగన్ చేసిన పనులకు ఎక్కడా అప్పు కూడా పుట్టని పరిస్థితి" అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనినిబట్టి పథకాల అమలుకు ఇంకా కొంతకాలం వేచిచూడాల్సిన అనివార్యమైన పరిస్థితి.
ఇదే అదనుగా..
ఈ నెలాఖరు లోపు అన్ని జిల్లాల పార్టీ కమిటీలు పూర్తి చేయడానికి వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ సంసిద్ధం అవుతున్నారు. ఆ తరువాత అక్టోబర్ మొదటివారంలో జిల్లాల వారీగా అసెంబ్లీ స్థాయి నేతలతో వైఎస్. జగన్ సమావేశం కానున్నారు. ఇందుకోసం దసరాకు ముందే జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించరని పార్టీ వర్గాల సమాచారం. ఆ మేరకు వైసీపీ కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
దిశా నిర్దేశం...
"ప్రకటించిన హామీల మేరకు పథకాలు అమలు చేయలేక చతికిలబడతారు. ఎక్కువ కాలం అధికారంలో ఉండడానికే చంద్రబాబు అసలైన లక్ష్యం. ఈ పథకం ముందు ఆయన దేనినీ లెక్కచేయరు" అని వైసీపీ అధినేత వైఎస్. జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. "2014లో కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రకటించి, మాట మార్చారు. స్కిల్స్ డెవలప్ చేస్తాం" అని నాలుక మడత వేసిన అంశాన్ని గుర్తు చేశారని చెబుతున్నారు. ఈ అంశాలతో పాటు "రెడ్ బుక్" అమలుతో కేసుల్లో ఇరికిస్తున్న అంశాలను కూడా జనంలోకి తీసుకువెళ్లాలనే వ్యూహంతో వైసీపీ లబ్ధి పొందాలని ఎత్తులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాలను ఇటీవల కాలంలో చాలాసార్లు స్వయంగా వైఎస్. జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. నెలాఖరులోపు రాజకీయ వేడి ఎలా ఉంటుందనేది వేచిచూడాలి.
2024 జూలై31: హామీల అమలులో టీడీపీ కూటమి తాత్సారంపై ధర్మవరం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి నెల కిందటే స్పందించారు. " హామీల అమలుపై అంత తొందరేలా? కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కాస్త సమయం ఇవ్వాలి" అని అభిప్రాయపడ్డారు. "ఈ ఏడాది చివరి వరకు సమయం అవసరం" వినుకొండలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వైఎస్. జగన్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు. అదేరోజే కేతిరెడ్డి ధర్మవరంలో సూపర్ సిక్స్ పథకాలపై చేసిన ఆ వ్యాఖ్యాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.