ఊళ్లల్లో రచ్చంతా అన్నా చెల్లెళ్ల ఆస్తుల గోలే

ఊళ్లలో చర్చంతా అన్నా చెల్లెళ్ల వ్యవహారమే. ఒకరిపై ఒకరు రాసుకున్న లేఖలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. వైఎస్ కుటుంబం గురించి ఇంతాగా చర్చించుకోవడం ఇదే మొదటిసారి.

Update: 2024-10-25 11:37 GMT

అరే నాగన్న... రారా.. ఎక్కడికి పోయావు ఈ మధ్య కలిక్కానిక్కూడా కానరావడం లేదు అంటాడు అరబోలు రామసుబ్బులు.

నాగన్న: యాడికి పోలేదురా... ఇంటికాడనే ఉంటున్నా.. వానలు కదా, బయటకు రావట్లేదంతే..
రామసుబ్బులు: దాదా.. కూచో.. ఏంట్రా సంగతులు, రాజకీయం బాగా వేడెక్కినట్టుందిగా..
నాగన్న: అవున్రా.. బాగానే రాజుకుంటున్నట్టున్నాయ్.. ఇప్పుడంతా ఆస్తుల గోలే నడుస్తున్నట్టుందిగా.. అన్న, చెల్లి, తల్లి యవ్వారమే ఎక్కువగా నడుస్తోందిరా. రెండ్రోజుల్నుంచి చంద్రబాబు కన్నా జగనన్నా, షర్మిలమ్మ, విజయమ్మల ముచ్చటే నడుస్తోంద్రా..
రామసుబ్బులు: అసలు ఈ ఆస్తుల గోలేంటీ.. ఎందుకు అన్నా చెల్లెళ్లు ఇలా చేసుకుంటున్నారు.
నాగన్న: ఏమి లేదురా... వాళ్ల నాన్న వైఎస్సార్‌ బతికున్నప్పుడు షర్మిలకు పెళ్లైన తరువాత ఇద్దరికీ ఆస్తులు పంచారు. నాలుగు వాటాలేసి మనవళ్లకు ఇమ్మన్నాడంట. తండ్రిచాటు బిడ్డగా జగన్‌ చేసిన వ్యాపారాల్లో బాగా డబ్బులొచ్చాయి. ఆ ఆస్తులన్నీ జగన్‌ పేరుపైనే ఉన్నాయి.
రామసుబ్బులు: మరి అందరూ కలిసి ఉన్నప్పుడు జగన్‌ పేరు మీదనే ఎందుకున్నాయి. షర్మిల పేరు మీద కూడా కొన్ని రాస్తే పోయేదిగా..
నాగన్న: రాయొచ్చు. జగన్‌ ముందుండి వ్యాపారాల లావాదేవీలు చూస్తున్నారుగా.. అందుకే ఆయన పేరుతోనే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి.
రామసుబ్బులు: ఓహో అదా.. సరస్వతి పవర్‌ ప్రాజెక్టులో షేర్స్‌ విజయమ్మకు, షర్మిలకు రాసిచ్చిన తర్వాత వెనక్కి తీసుకుంటున్నానని, తల్లి, చెల్లిపై కేసు వేయడం ఏంట్రా... విచిత్రంగా లేదూ...
నాగన్న: నువ్వన్నది నిజమే.. రాజకీయంగా అన్నా, చెల్లెలికి అస్సలు పట్టంలేదు. పైగా షర్మిల జగన్‌పై ఒంటికాలి మీద లెగుస్తోంది. అందుకే తాను రాసి ఇచ్చిన ఆస్తిని వెనక్కి తీసుకోవాలనుకుంటున్నడు.
రామసుబ్బులు: ఇది చెల్లుతుందంటావా?
నాగన్న: చెల్లుతుందో చెల్లదో తెలియదుకానీ.. గిఫ్ట్‌ డీడ్‌ ఒకసారి రాసి ఇచ్చిన తరువాత దాన్ని వెనక్కి తీసుకుంటానంటే చెల్లదని చాలా మంది న్యాయవాదులు అంటున్నారు. ఇద్దరికీ సమ్మతమైతేనే అది రద్దు చేసుకునే అవకాశం ఉందంట. అన్నా చెల్లెళ్ల వ్యావహారం చూస్తే అది జరిగేట్టు లేదు. అందుకే కోర్టు ఏమి చెబుతుందో చూడాల్సిందే.
రామసుబ్బులు: జగన్‌పై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నాయి కదా.. ఈ కేసుల్లో చాలా ఆస్తులు ఈడీ అటాచ్‌ చేసికదా.. కోర్టు కేసుల్లో ఉన్న ఆస్తులు తల్లి, చెల్లి స్వాధీనం చేసుకుంటే జగన్‌ మెడకు చుట్టుకొని బెయిల్‌ రద్దవుతుందంట కదా...
నాగన్న: గిఫ్ట్‌ డీడ్‌ రాసి ఇచ్చేటప్పుడు కోర్టు కేసులు పరిష్కారం అయిన తరువాత మీకు స్వాధీనం అవుతుందని రాయలేదు కదా... అలాంటప్పుడు వాళ్ల ఇష్టం ప్రకారం చేసుకుంటారు. దానిని జగన్‌ ఎలా ప్రశ్నిస్తారు. సరే.. కోర్టులో కేసు వేశారు కదా... ఏం జరుగుతుందో చూద్దాం.
రామసుబ్బులు: అన్నా చెల్లెళ్ల ఉత్తరాల గోలేంటి?
నాగన్న: సరస్వతీ పవర్‌ ప్రాజెక్టు విజయమ్మ తన కూతురు షర్మిలకు ఇచ్చిందంట. అదెట్టా కుదురుద్దని జగన్ అదేదో కోర్టుకి ఉత్తరం రాశాడంట. ఇప్పుడా సంగతి అందరికీ తెలిసింది. దీంతో ఆ అమ్మాయి షర్మిల ఇప్పుడు కోపానికొచ్చింది. అన్నని నోరు పట్టరాని మాటల్తో ఉత్తరం రాసింది.
రామసుబ్బులు: అన్నా చెల్లెళ్ల గొడవలో చంద్రబాబు ప్రమేయం అంటున్నారేంటి?
నాగన్న: ఈ చర్చా జరుగుతోంది. షర్మిల రాసిన ఉత్తరం ముందుగా తెలుగుదేశం పార్టీ వాళ్లే సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. అందుకే చంద్రబాబు డైరెక్షన్‌లోనే షర్మిల ఇదంతా చేస్తున్నట్లు జగన్‌ అనుకూల వర్గం మాట్లాడుతోంది. చంద్రబాబు కూడా నిన్న మీడియాతో మాట్లాడుతూ తల్లి, చెల్లిపై కేసు వేసిన జగన్‌తో రాజకీయం చేయాల్సి రావడం సిగ్గుగా ఉందన్నారుగా... అది కూడా ఆలోచించాల్సిందే.
ఈ ఇద్దరి సంభాషణ మరెక్కడో కాదు. రాష్ట్ర సచివాలయానికి వెళ్లే దారిలో మందడం గ్రామంలోని ఓ టీస్టాల్‌ దగ్గర జరిగింది. వాళ్ల మాటల్లోనే వాళ్ల పేర్లు కూడా తెలిసాయి. నేను నా మిత్రుడు విజయ్‌ కలిసి సచివాలయానికి వెళుతూ ఆ టీస్టాల్‌ దగ్గర టీతాగేందుకు ఆగాం. చాలా మంది కూర్చునేందుకు ఆ స్టాల్‌ అనుకూలంగా ఉంటుంది. మంచీ చెబ్బర కూడా చాలా మంది ఇక్కడ కూర్చుని మాట్లాడుకోవడం విశేషం. చేతిలోని గ్లాసుతో గరం గరం టీ తాగుతూ.. రాష్ట్రంలోని వేడివేడి రాజకీయాలను చర్చించుకోవడం ఇక్కడ పరిపాటే... ఇక్కడే కాదు రాష్ట్రంలో ఏ సెంటర్‌లో ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు నడుస్తున్నదంతా అన్నా చెల్లెళ్ల టాపిక్కే...
ప్రతి ఇంట్లో ఉండే గోలేగా అనే వాళ్లు కొందరు, అన్న వైపు కోపేసుకునే వాళ్లు కొందరుంటే చెల్లెలు వైపు మాట్లాడే వాళ్లు మరికొందరు. ఇలా ఏదైతేనేం ఇప్పుడు అన్నా చెల్లెళ్ల ఆస్తుల గోల విశ్వవ్యాప్తమైంది.
Tags:    

Similar News