అందరి దృష్టి ఈ ఐదుగురు ఎంఎల్ఏలపైనే

ఇంతకీ విషయం ఏమిటంటే దక్షిణకొరియా సియోల్ నగరంలోని ఛంగ్ యే చున్ నదిని చూడటానికి ప్రభుత్వం 25 మంది సభ్యుల బృందాన్ని దక్షిణకొరియాకు పంపిస్తోంది.

Update: 2024-10-19 06:38 GMT

తెలంగాణా రాజకీయాల్లో ఇపుడందరి దృష్టి ఈ ఐదుగురు ఎంఎల్ఏలపైనే నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే దక్షిణకొరియా సియోల్ నగరంలోని ఛంగ్ యే చున్ నదిని చూడటానికి ప్రభుత్వం 25 మంది సభ్యుల బృందాన్ని దక్షిణకొరియాకు పంపిస్తోంది. ఇందులో మంత్రి, ఎంఎల్ఏలు, మేయర్, డిప్యుటి మేయర్, అధికారులు ఉన్నారు. ఈ బృందం ఈనెల 21వ తేదీన బయలుదేరి మూడురోజుల పాటు అంటే 24వరకు నదిసుందరీకరణ జరిగిన విధానంపై అధ్యయనం చేస్తుంది. దక్షిణకొరియా సియోల్ నగరంలోని చంగ్ యే చున్ నదిని సుందరీకరణ చేసినట్లుగానే మూసీనది పునరుజ్జీవనం చేయాలని రేవంత్ గట్టిగా డిసైడ్ అయిన విషయం తెలిసిందే. రేవంత్ నిర్ణయాన్ని బీఆర్ఎస్, బీజేపీ, పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

మూసీ పునరుజ్జీవనాన్ని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు చెందిన ఎంఎల్ఏలను సియోల్ పంపిస్తే అక్కడి నది సుందరీకరణ జరిగిన విధానాన్ని పరిశీలిస్తారని అనుకున్నది. చంగ్ యే చున్ నది సుందరీకరణ తర్వాత జరిగిన మార్పులను గమనించాలన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం. అక్కడి నదిలో జరిగిన మార్పును గమనిస్తే ఇక్కడ మూసీనది పునరుజ్జీవన ప్రక్రియను అర్ధంచేసుకుంటారని, తర్వాతైనా ప్రతిపక్షాల ఆలోచనల్లో మార్పులు వస్తాయని రేవంత్ అనుకున్నారు. అందుకనే బీఆర్ఎస్ నుండి ఎంఎల్ఏలు ప్రకాష్ గౌడ్, కాలేరు వెంకటేష్, డీ సుధీర్ రెడ్డి, సీహెచ్ మల్లారెడ్డి, బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్, ఎంఐఎం ఎంఎల్ఏలు మహ్మద్ ముబీన్, కౌసర్ మొహినుద్దీన్, మీర్ జుల్ఫికర్ ఆలీ, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలతో పాటు మేయర్ విజయలక్ష్మి, డిప్యుటి మేయర్ శ్రీలత, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు కూడా వెళ్ళబోతున్నారు. అధికారులు ఎలగూ వెళతారు అలాగే మిత్రపక్షం ఎంఐఎం మూసీ ప్రాజెక్టును వ్యతిరేకించటంలేదు కాబట్టి సమస్యలేదు.

ఇపుడు సమస్యంతా బీఆర్ఎస్, బీజేపీ ఎంఎల్ఏలతోనే వచ్చింది. ప్రభుత్వం ఎంపికచేసిన బీఆర్ఎస్ ఎంఎల్ఏల్లో ప్రకాష్ గౌడ్ ఇప్పటికే కారుపార్టీలో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. ఇక కాలేరు వెంకటేష్, సీహెచ్ మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి ఏమిచేస్తారన్నది ఆసక్తిగా మారింది. ఇదే సమయంలో బీజేపీ ఎంఎల్ఏ రాజాసింగ్ విషయం కూడా ఏమీ తేలలేదు. మూసీ ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదుకాని ఇళ్ళు కూల్చకుండా నదికి రెండువైపులా రీటైనింగ్ వాల్ నిర్మించి నది పునరుజ్జీవన కార్యక్రమం చేసుకోమని కేంద్రమంత్రి, తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. మరీ స్ధితిలో రాజాసింగ్ సియోల్ వెళతారా వెళ్ళరా అన్నది తెలలేదు. మూసీ ప్రాజెక్టు విషయంలో బీజేపీ లైన్ పై క్లారిటీగా లేదు.

ఇదే సమయంలో పార్టీ నాయకత్వంతో రాజాసింగ్ కు అంతమంచి సంబంధాలు కూడా లేవు. చాలా సందర్భాల్లో రాజాసింగ్ కు పార్టీ పెద్దల నుండి మద్దతు దొరకలేదు. అందుకనే ఎంఎల్ఏ కూడా తనకు పార్టీతో సంబంధంలేదు అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. కాబట్టే రాజాసింగ్ సియోల్ ట్రిప్ విషయంలో అయోమయం పెరిగిపోతోంది. ఇక మల్లారెడ్డి, సుధీర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారని ఆమధ్య బాగా ప్రచారం జరిగినా తర్వాత ఎందుకో ఆగిపోయింది. మల్లారెడ్డి మనవరాలి వివాహం ఈనెలాఖరులో జరగబోతోంది. వివాహం పెట్టుకుని మల్లారెడ్డి సియోల్ వెళతారా అన్నది అనుమానమే. మిగిలిన సుధీర్ రెడ్డి ఏమిచేస్తారనేది ఆసక్తిగా మారింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాయకత్వం వహిస్తున్న విదేశీ ట్రిప్ లో కాంగ్రెస్ ఎంఎల్ఏలు బీ లక్ష్మారెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి ఎలాగూ వెళతారనటంలో సందేహంలేదు. కాబట్టి ఇపుడు అందరి దృష్టి బీఆర్ఎస్, బీజేపీ ఎంఎల్ఏలపైనే నిలిచింది. చివరకు వీళ్ళేమి చేస్తారో చూడాల్సిందే.

Tags:    

Similar News