విజయవాడ రైల్వేస్టేషన్‌లో అలెర్ట్‌

విస్తృత స్థాయిలో తనిఖీలు చేపడుతూ.. మాక్‌డ్రిల్‌ నిర్వహించారు.;

Update: 2025-05-09 04:22 GMT

ఇండియా–పాకిస్తాన్‌ యుద్ధం నెలకొన్న ఉద్రిక్తతల పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌ విజయవాడ రైల్వే అధికారులు అలెర్ట్‌ అయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల జరక్కుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఉద్యోగులు, సిబ్బందితో పాటు ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు రంగంలోకి దిగారు. అందులో భాగంగా గురువారం అర్థరాత్రి విజయవాడ రైల్వేస్టేషన్‌లో మాక్‌డ్రిల్‌ను నిర్వహించారు.

గవర్నమెంట్‌ రైల్వేపోలీసు, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ రంగంలోకి దిగారు. రైల్వే పోలీసులు ఐదు బృందాలుగా ఏర్పడి విజయవాడ రైల్వేస్టేషన్‌లో విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. జీఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌ జేవీ రమణ, ఆర్పీఎఫ్‌ అసిస్టెంట్‌ సెక్యూరిటీ కమిషనర్‌ కోట జోజి ఆధ్వర్యంలో సిబ్బంది, డాగ్‌ స్క్వాడ్‌లతో టీమ్‌లు వారీగా ఏర్పాటు చేసుకొని స్టేషన్‌ అంతా చెకింగ్‌లు చేపట్టారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్‌ఫాంలు, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, లిఫ్ట్‌లు, వెయిటింగ్‌ హాళ్లు, టికెట్‌ కౌంటర్లు, బుకింగ్‌ కార్యాలయాలు, పార్శిల్‌ విభాగాలు, పార్కింగ్‌ ఏరియాలు, సమీపంలోని పూల మార్కెట్, డీజిల్‌ లోకో షెడ్‌ వంటి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ప్రయాణికుల లగేజీ బ్యాగులను చెకింగ్‌ చేశారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు అవగాహన కల్పించారు. అనుమానితుల వ్యక్తులకు సంబంధించిన వివరాలను సేకరించారు. దీంతో పాటుగా రైల్వేస్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలను, వాటి పనితీరును పరిశీలించారు. వీటి పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు సీసీటీవీ కెమేరాలను క్షుణ్ణంగా మోనరటింగ్‌ చేసే విధంగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ మాక్‌ డ్రిల్‌ సందర్భంగా విజయవాడ రైల్వేస్టేషన్‌ అంతా ఒక్క సారిగా అప్రమత్తం అయింది. ప్రయాణికులు అందరూ సిబ్బందికి సహకరించారు.
Tags:    

Similar News