అజితారావు ఎవరికి గండి కొడుతుంది

ఆంధ్రప్రదేశ్ లోని ఎర్రగొండపాలెం నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన మహిళ బలమైన వ్యక్తి. ఏ పార్టీ ఓట్లు ఏమాత్రం చీలుస్తుందో చూడాలి.

Update: 2024-04-23 07:44 GMT

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అజితారావు ఏ పార్టీ ఓట్లు చీలుస్తుందనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. గతంలో రెండు సార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అజితారావు ఓటమి చెందారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఆమెకు సీటు ఇవ్వలేదు. చివరి వరకు ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో వారు కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్ వారు వెంటనే టిక్కెట్ ఇచ్చి ప్రోత్సహించారు. దీంతో ఆమె రంగంలోకి దిగింది. ఇంటింటి ప్రచారం మొదలు పెట్టింది. పిసిసి చీఫ్ వైఎస్ షర్మిల సోమవారం ఎర్రగొండపాలెం వచ్చి వైఎస్సార్ విగ్రహం సెంటర్ లో సభ నిర్వహించారు. మొదట అజితారావు నామినేషన్ దాఖలు చేసి ఆ తరువాత సభ జరిపారు. సభకు పట్టణంలోని ప్రజలు ఎక్కువ మొత్తంలో హాజరు కావడం విశేషం. ఒకప్పుడు కాంగ్రెస్ కు పెట్టింది పేరు. ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి కాంగ్రెస్ వారే ఎక్కువ సార్లు గెలుస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా అలాగే ఆదరించారు. ఈ పదేళ్ల నుంచి కాంగ్రెస్ ఈ నియోజకవర్గానికి దూరమైంది. అయినా అభిమానులు మాత్రం అలాగే ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ లో ఉన్నారు.

పట్టుదలతో రాజకీయాల్లో..

అజితారావు ఇన్‌కంటాక్స్ ఆఫీసర్ బూదాల కోటేశ్వరరావు భార్య. ఆయన ఈ నియోజకవర్గానికి చెందిన వారు. ఉద్యోగంరిత్యా వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో సేవ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అందుకు అధికారం తోడైతే బాగుంటుందనే ఆలోచనతో మొదటి సారి 2014లో ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేశారు. ఆ తరువాత 2019లో కూడా తెలుగుదేశం పార్టీ వారు టిక్కెట్ ఇచ్చారు. అయితే ఓటమి చెందటంతో వారు నియోజకవర్గంలో సరిగా పనిచేయలేక పోయారు. దీంతో తెలుగుదేశం పార్టీ వారు ఈ సారి ప్రకాశం జిల్లాకు చెందిన ఎరిక్సన్ బాబును అభ్యర్థిగా రెండు సంవత్సరాల క్రితం ప్రకటించారు. ఆయన ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థిగా ప్రజల మనస్సుల్లో ఉన్నారనడంలో సందేహం లేదు. ఈ ఎన్నికల్లో ఓటర్లను ధనం పూర్తి స్థాయిలో ప్రభావితం చేసే అవకాశం ఉంది. అందువల్ల ధనవంతులకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనవంతుల జాబితాలో పరిశీలిస్తే వైఎస్సార్సీపీ అభ్యర్థితో పాటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా ధనవంతురాలే. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాత్రం ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో కాస్త వెనుకడుగు వేస్తున్నారని చెప్పొచ్చు. కారణం మిగిలిన అభ్యర్థుల మాదిరి డబ్బులు లేకపోవడమే. తప్పకుండా ఎన్నికల్లో పోటీ చేయాలని, జనం మధ్యనే ఉన్నామని నిరూపించుకోవాలనే పట్టుదలతో అజితారావు కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు.

ఎవరిపై కాంగ్రెస్ ప్రభావం ఉంటుంది

నియోజకవర్గంలో ఎవరిపై కాంగ్రెస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే వైఎస్సార్సీపీ, టీడీపీ వైపున ఫిక్స్ అయిన ఓటర్లు వెనువెంటనే కాంగ్రెస్ లోకి వచ్చి ఉన్నపళంగా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తారని ఆలోచించడంలో అర్థం లేదు. అయితే ఎంత మంది ఓటర్లు కాంగ్రెస్ పార్టీ రావాలని కోరుకుంటున్నారనేది ఈ ఎన్నికల్లో స్పష్టమవుతుంది. అనడంలో సందేహం లేదు. నియోజకవర్గంలో 2.6లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు 60వేలు వుండగా ఎస్టీలు 15 వేల వరకు ఉన్నాయి. బీసీల ఓట్లు సుమారు 60వేలకు పైనే ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గం ఓట్లు 28వేల వరకు ఉండగా కమ్మ సామాజిక వర్గం ఓట్లు 14వేల వరకు ఉన్నాయి. ముస్లిమ్ల ఓట్లు 8వేలు, బలిజ, నాయుడు ఓట్లు 15వేల వరకు ఉన్నాయి. అంటే నియోజకవర్గంలో ఎస్సీ, బీసీలే నిర్ణయాధికారం కలిగి ఉన్నారని చెప్పొచ్చు. రెడ్డి సామాజికవర్గం ఓట్లు తక్కువ ఉన్నా ఓటర్లను ప్రభావితం చేయగలిగిన వారిలో రెడ్డి, కమ్మలే ఉంటారు. బీసీల్లో యాదవుల ఓట్లు కూడా సుమారు 35వేల వరకు ఉన్నాయి.

నాయకుడి మనసు మారుతుందే కాని ఓటరు మనసు మారటం లేదు

2009లో ఆదిమూలపు సురేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చివరి వరకు ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆతరువాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు అక్కడ వైఎస్సార్సీపీ వారు సీటు ఇవ్వలేదు. సంతనూతలపాడు నుంచి పోటీ చేసి గెలిచారు. తిరిగి 2019 ఎన్నికల్లో సురేశ్ కు ఎర్రగొండపాలెం వైఎస్సార్సీపీ టిక్కెట్ వైపాలెంలో దక్కింది. ఆ ఎన్నికల్లోనూ గెలిచారు. అనంతరం 2014 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున పాలపర్తి డేవిడ్ రాజు పోటీ చేశారు. ఆయన గెలిచిన తరువాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అయినా ప్రజలు మాత్రం మారలేదు. చోటా నాయకులు సైతం వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నాయకులు మారినా ప్రజలు మాత్రం కాంగ్రెస్, ఆ తరువాత వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. అంటే ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీకి ఎంత గట్టి హోల్డ్ ఉన్న నియోజకవర్గంలో తెలుసుకోవచ్చు. 1955లో ఈ నియోజకవర్గం ఏర్పడింది. అప్పట్లో కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యే పోటీ వుండేది. రెండు సార్లు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పూల సుబ్బయ్య గెలుపొందారు. ఆ తరువాత రద్దయి తిరిగి 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది.

రెండు పార్టీల నుంచి కాంగ్రెస్ కు ఓట్లు చీలే అవకాశం

తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు చీలే అవకాశం ఉంది. ఏ పార్టీ నుంచి ఎంత శాతం ఓట్లు కాంగ్రెస్ కు చీలుతాయి అనేదానిపై చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ నుంచి 60శాతం, వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 40శాతం ఓట్లు చీలే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అజితారావుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ వారితో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. ప్రతి ఒక్క నాయకుడిని పేరుతో పిలిచే అవకాశం ఆమెకు ఉంది. బయట పడకపోయినా ఆమెకు ఓట్లు వేయించే విషయంలో చొరవ తీసుకునే అవకాశం ఉంది. దోర్నాల మండలంలొ తెలుగుదేశం పార్టీ నుంచి జబ్బార్ అనే నాయకుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమానుగుడిపాడు నుంచి టీడీపీ నాయకుడు మంచాల చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి ప్రభావం ఎంత ఉంటుందనే దానికంటే కాంగ్రెస్ వైపు కూడా ఓటర్లు, నాయకులు మొగ్గు చూపుతున్నరని చెప్పొచ్చు. ఇది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ బలపడుతుందనే దానికి సంకేతంగా చెప్పొచ్చు.

Tags:    

Similar News