‘నీట్ స్కాంపై ప్రధాని స్పందించాలి’.. తిరుపతిలో భారీ నిరసన

ఎన్‌టీఏను రద్దు చేయాలని, విద్యార్థులకు న్యాయం చేయడానికి నీట్ స్కాం విషయంలో సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Update: 2024-06-22 10:24 GMT

నీట్ స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. స్కాం విషయం తెలిసిన వెంటనే కేంద్రం సైతం దిద్దుబాటు చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది. పరీక్షను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే కొంతకాలంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ ప్రశ్నపత్రాల లీకేజీపై ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్(ఏఐఎస్ఈసీ) కమిటీ ఆధ్వర్యంలో తిరుపతిలోని దండి మార్చ్ విగ్రహం దగ్గర విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు కొన్ని డిమాండ్లు చేశారు. ఈ స్కాంపై ప్రధాని మోదీ స్పందించాలని, ఎన్‌టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ)ను రద్దు చేయాలని కోరారు. దాంతో పాటుగా ప్రశ్నపత్రాల లీకేజీని అరికట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలని, లీకేజీకి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు.

మోదీ మౌనమేలా

ఈ సందర్బంగా ఏఐఎస్‌ఈసీ రాష్ట్ర సెక్రటేరియట్ మెంబర్ హరీష్ మాట్లాడుతూ.. మోదీ మౌనాన్ని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల వేళ విద్యార్థులకు పరీక్షల గురించి చెప్తూ మన్‌కీ బాత్‌లో పరీక్ష పే చర్చ నిర్వహించే మోదీ.. ఆ పరీక్ష పేపర్లు లీక్ అయినా ఎందుకు స్పందించడం లేదు. దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు అహర్నిశలు కష్టపడి పరీక్షలు రాస్తే ఎన్‌టీఏ నిర్లక్ష్యం వల్ల వాళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరులా మారింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.




 

కేంద్రమంత్రి రాజీనామా చేయాలి

‘‘మొదట నీట్ పరీక్ష నిర్వహణలో ఎటువంటి అవినీతి, అక్రమాలు జరగలేదంటూ బుకాయించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.. ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూసి అక్రమాలు జరిగిన మాట వాస్తవమే అని అంగీకరించక తప్పలేదు. తన శాఖలో ఇంతటి అన్యాయం, అక్రమం జరుగుతున్నా పట్టించుకోని కేంద్రమంత్రి.. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలి’’ అని డిమాండ్ చేశారు.

వాటి ఫలితమే ఈ స్కాం

‘‘విద్యా వ్యాపారీకరణ, ప్రైవేటీకరణ ఫలితమే ఈ నీట్ స్కాం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం రెక్కలు ముక్కలు చేసుకుని లక్షల రూపాయల ఫీజులు చెల్లించిన తల్లిదండ్రుల ఆవేదనకు కేంద్రం, ఎన్‌టీఏ బాధ్యత వహించాలి. ఎన్‌టీఏను రద్దు చేసి ఎంట్రన్స్ పరీక్ష నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలి’’ అని డిమాండ్ చేశారు పౌర చైతన్య వేదిక కార్యదర్శి జీ ప్రతాప్ సింగ్.  



సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలి

‘‘పరీక్ష పేపర్ల లీకేజీ విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలి. ప్రత్యేక కమిటీ వేసి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలి. తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. విద్యార్థులకు న్యాయం జరిగేలా చూడాలి’’ అని కోరారు.

Tags:    

Similar News