కమ్మేసిన పొగమంచు..గాల్లోనే తిరిగిన విమానం

రాకపోకలతో పాటు విమానాల ల్యాండింగ్‌ కూడా పెద్ద సమస్యగా మారింది.;

By :  Admin
Update: 2025-01-02 05:54 GMT

విజయవాడ గన్నవరం ఎయిర్‌ పోర్టుకు పొగ మంచు ఎఫెక్ట్‌ అలుముకుంది. దట్టమైన పొగమంచు కమ్మేస్తుండటంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గురువారం కూడా ఇదే సమస్య తలెత్తింది. దట్టమైన పొగమంచు అధికంగా ఉండటం వల్ల విమానాలు ల్యాండ్‌ అయ్యేందుకు నానా తంటాలు పడుతున్నాయి. నిముషాల తరబడి గాల్లోనే చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ప్రయాణికులు హడలి పోతున్నారు. దట్టమైన పొగమంచు కారణంగా గురువారం ఉదయం ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్‌ ఇండియా విమానం గన్నవరం ఎయిర్‌ పోర్టులో దిగేందుకు వీల్లేక పోవడంతో కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఇండిగో, ఎయిర్‌ ఇండియా విమనాలు కూడా గాల్లోనే చక్కర్లు కొట్టాయి. సులువుగా ల్యాండ్‌ కావలసిన విమానాలు పొగమంచు కారణంగా గాల్లోనే చక్కర్లు కొట్టడంతో అందులోని ప్రయాణికులు ప్రమాదం ఏమైనా జరిగిందేమో అని ఆందోళనలకు గురవుతున్నారు. అయితే భయపడాల్సిన అవసరం లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాతావరణం అనుకూలించిన తర్వాత అధికారులు క్లియరెన్స్‌ ఇస్తున్నారు. దీంతో క్షేమంగానే విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయి. మరో వైపు రహదారులు కూడా దట్టమైన పొగమంచుతో నిండి పోయాయి. గన్నవరం ఎయిర్‌ పోర్టు వెళ్లేందుకు కూడా సరిగా కనిపించడం లేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆలస్యమైతే ఫ్లైట్‌ ఎక్కడ మిస్‌ అవుతుందేమో అని ఒకింత ఒత్తిడికి గురవుతున్నారు.

Tags:    

Similar News